Monday 23 June 2014

విద్యుత్ వృథాను అరికడదాం

విద్యుత్ వృథాను అరికడదాం

Published at: 23-06-2014 04:39 AM
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టి.. వినియోగదారులకు నాణ్యమైన కరెంటును అందించడానికి అధికారులు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. విద్యుత్ రంగంపై ఉన్నతాధికారులతో ఆదివారం హైదరాబాద్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీలో వినియోగదారులకు ఇకపై 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయరంగానికి ప్రాధాన్యమివ్వాలని, 9 గంటలకు తగ్గకుండా సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ పొదుపునకు సంబంధించి పాటిస్తున్న అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోనూ ఆదాపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన సంరక్షణ సంస్థ అధికారులకు సూచించారు. విద్యుత్ ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు పొదుపు చర్యలను పాటిస్తూనే సంప్రదాయ ఇంధన వనరులైన సౌర విద్యుత్, పవన విద్యుత్‌లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనువైన ప్రాంతమని.. అయితే పవర్ హాలిడే కారణంగా కొన్నేళ్లుగా పరిశ్రమలు భారీ నష్టాలను చవి చూశాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పారిశ్రామిక నాణ్యమైన, అవసరమైన విద్యుత్ అందించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్యం, పొదుపు విషయంలో చేపట్టిన కార్యాక్రమాలకు ఆకర్షితమైన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఎనర్జీ ఎఫిషియన్ట్ కంపెనీ లిమిటెడ్(ఈఈఎస్ఎల్).. రాష్ట్రంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్ఈసీఎం చైర్మన్ ఐవైఆర్. కృష్ణారావు సీఎంకు వివరించారు. ఈఈఎస్ఎల్, ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లు ఏపీలో ఇంధన సామర్థ్య పథకాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్(ఇన్‌చార్జి) ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, ఏపీ జెన్‌కో సీఎండీ విజయానంద్ పాల్గొన్నారు. అనంతరం సమీక్షపై సీఎస్ వివరిస్తూ.. సంప్రదాయ ఇంధన వనరులకు ప్రాచుర్యం కల్పిస్తూనే ప్రభుత్వశాఖలన్నీ విద్యుత్ ఆదాను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. పలు శాఖల్లో ఎనర్జీ కన్జర్వేషన్ సెల్స్(ఇంధన ఆదా విభాగాలు) ఏర్పాటు చేసి విద్యుత్ ఆదాకు యత్నిస్తున్నట్లు సీఎంకు వివరించామని తెలిపారు.

No comments:

Post a Comment