Monday 9 June 2014

లక్ష దాకా మాఫీ చేసి తీరుతా

లక్ష దాకా మాఫీ చేసి తీరుతా

Published at: 09-06-2014 04:24 AM
ఒక మంత్రి తెలిసో తెలియకో మాట్లాడాడు
దానిని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు
ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లు రైతులో కాదో!
అవన్నీ కాకమ్మ కథలో ఏమిటో పరిశీలించాలి
లక్ష దాకా అని మేనిఫెస్టోలో చెప్పాం.. చేస్తాం
రైతులు భయాందోళనలకు గురికావద్దు
రుణ మాఫీ అమలుకు మరో 10-15 రోజులు
మరో రూ.10 వేల కోట్లు ఖర్చయినా చేస్తాం
ఆర్బీఐ నుంచి కూడా అనుమతి పొందాలి
వ్యూహాత్మకంగానే రెండు రోజులు మౌనం : కేసీఆర్
న్యూఢిల్లీ, జూన్ 8 : లక్ష రూపాయల వరకు రుణ మాఫీ పథకాన్ని అమలు చేసి తీరతామని, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అక్షరాన్నీ తూ.చా. తప్పకుండా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. రుణ మాఫీ విషయంలో రైతులు భయాందోళనలకు గురి కావొద్దని భరోసా ఇచ్చారు. ఒక మంత్రి తెలిసో తెలియకో మాట్లాడిన దానిని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. రుణ మాఫీ పథకం తమకు వర్తించదన్న ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నవారు రైతులో కాదో.. కాకమ్మ కథలో చూసి స్పందిస్తామని వ్యాఖ్యానించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. "నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వారం రోజులు మాత్రమే అయింది. నాలుగు రోజుల నుంచే కొంతమంది చాలా దుర్మార్గంగా, అవకాశవాదంగా ఇంతకంటే మహత్తరమైన పని లేదన్నట్లు కొంతమంది నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. మేమేదో రైతులను మోసం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రణాళికలో రైతు రుణాలను రూ.లక్ష వరకూ రద్దు చేస్తామని పేర్కొన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వంద శాతం దానికి కట్టుబడి ఉంది. దానిని అమలు చేసి తీరుతాం. రైతులకు ఎలాంటి భయాలు, ఆందోళనలు అవసరం లేదు. రుణ మాఫీకి రూ.8-12 వేల కోట్లు ఖర్చవుతాయని మేం అంచనా వేశాం. మరో రూ.10 వేల కోట్లు ఖర్చయినా సరే మాటపైనే ఉంటాం. తప్ప వెనక్కుపోయేది లేదు'' అని తేల్చి చెప్పారు.
వెకిలిగా ప్రవర్తించొద్దు
రాజకీయ పార్టీలు వెకిలిగా వ్యవహరించడాన్ని మానుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే ఆచితూచి మాట్లాడాలని మంత్రులందరికీ చెప్పానని, కానీ ఒక మంత్రి తెలిసో తెలియకో మాట్లాడిన మాటను తీసుకుని మీడియా దాన్ని లాగి లాగి పెద్దది చేసిందని ఆక్షేపించారు. ఇతర పార్టీలు సైతం ఇంతకన్నా మహత్తర అవకాశం లేదన్నట్లు నాలుగు రోజుల ప్రభుత్వాన్ని పట్టుకుని నానాయాగీ చేశాయని విమర్శించారు. ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని, నిర్మాణాత్మకంగా ముందుకువెళ్లే సందర్భంలో ఇంత తొందరపడి, ఇంత వెకిలిగా ప్రవర్తించటం మంచిది కాదని హితవు పలికారు. అప్పుడే హుందాగా, కలసికట్టుగా ముందుకుపోయే ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు. తాము వాగ్దాన భంగం చేసుకునే వాళ్లం కాదని, చేసిన వాగ్దానాలను అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చెబుతున్నాడని ప్రకటించారు.
రుణమాఫీకి మరో 15 రోజులు!
తెలంగాణ రాష్ట్రంలో చాలా శాఖల్లో అధికారులు లేరని, దీంతో పరిపాలన కష్టంగా ఉందని, పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పడితే పరిపాలన సులభం అవుతుందని కేసీఆర్ తెలిపారు. "బ్యాంకర్ల సమావేశంలో ఏ బ్యాంకు వద్ద ఎన్ని ఖాతాలు ఉన్నాయి? ఎంతమంది ఉంటారు? అన్న వివరాలను మాత్రమే అడిగాం. అంతకు మించి మరేమీ జరగలేదు. రుణ మాఫీ లబ్ధిదారులు 20-23 లక్షల మంది ఉంటారు. వారు తీసుకున్న అప్పు ఎంత? శాఖల వారీగా వివరాలు ఇవ్వండి అని కోరాం. ఈ వివరాలన్నీ ప్రభుత్వానికి అందిన తర్వాతే ప్రక్రియ మొదలవుతుంది. అలాగే, రుణ మాఫీ చేయాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా అవసరం. నిజమైన రుణ మాఫీ అమల్లోకి వచ్చేందుకు మరో 10-15 రోజులు పడుతుంది'' అని వివరించారు. ఇప్పటి వరకు ఏమీ కాలేదని, ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు రామలింగం అన్నట్లు కొంత పిచ్చి ప్రయత్నాలు కొన్ని పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. దీంతో, రుణమాఫీ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా.. "చనిపోయినవారు రైతులో.. కాదో.. కాకమ్మ కథలో (కాక్ అండ్ బుల్ స్టోరీస్) చూడాలి కదా!'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నా మౌనం వ్యూహాత్మకం
రుణ మాఫీ అమలుకు సంబంధించి ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా.. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి కొంత డ్యామేజీ జరుగుతుందని తెలిసినా కావాలనే రెండు రోజుల నుంచి మౌనంగా ఉన్నానని, తద్వారా శత్రువులు ఎంత ఆర్తితో గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారో అందరికీ తెలిసి వచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనినిబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం ఎలా చేసుకోవాలో కూడా అందరికీ తెలిసి వచ్చిందని, ఇది ఒక పాఠంగా ఉపయోగపడుతుందని, తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలు ఏంటో అర్థమవుతాయని చెప్పారు. అందుకే కావాలనే.. వ్యూహాత్మకంగా ఊరుకున్నానని చెప్పారు.

No comments:

Post a Comment