Thursday 19 June 2014

పులి'చింత'లు తీర్చేందుకు శ్రీకారం

పులి'చింత'లు తీర్చేందుకు శ్రీకారం

Published at: 16-06-2014 05:48 AM
విజయవాడ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : ప్రాజెక్టు మొదలై పదేళ్లయినా పులి'చింత'లు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు ఈ ఏడాది ఖరీఫ్ నాటికి 15 టీఎంసీలు అయినా నిల్వ చేస్తామని అయిదేళ్లుగా చెబుతున్నా.. ఆ మాటలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చిందిలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలం ముగియనుండటంతో నాలుగు స్లూయిస్ గేట్లను పెట్టించి హడావిడిగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెప్పి శిలాఫలకం వేసి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం జరిగి మూడు నెలలు అయింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం ఆ ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులు, మీడియా సమక్షంలో ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. హడావుడిగా గేట్లు అమర్చిన అధికారులు ఇంత వరకు వాటికి విద్యుత్తు సరఫరా పనులు పూర్తి చేయించలేదు. ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు అమర్చారు. వీటికి స్పిల్‌బీమ్ పనులు పూర్తి చేశారు కానీ వాల్ ప్లేట్లు, రబ్బర్ సీళ్లు ఏర్పాటు చేయలేదు. గేట్లకు విద్యుత్తు సరఫరా చేసే పనులు పూర్తి కాకపోవటంతో గేట్లను అత్యవసరంగా ఎత్తాల్సి వస్తే ఇబ్బందే. పొరపాటున ఫ్లాష్ ఫ్లడ్ వంటి సమస్యలు ఏమైనా వస్తే 300 టన్నులున్న ఒక్కో గేటును పైకెలా లేపుతారని మంత్రి ఉమా అధికారులను ప్రశ్నించారు. గేట్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జూలై 30 నాటికి 11 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు.
రూ.1830 కోట్లకు పెరిగిన వ్యయం
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2003లో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.450 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. 2004లో వైఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు అంచనాలు సవరించి రూ.568 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించింది. 2007 నాటికి పులిచింతల ప్రాజెక్టు కట్టి తీరతామని హామీ ఇచ్చినా ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1830 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు రూ.1390 కోట్ల మేరకు చెల్లింపులు జరిగాయి. పలుమార్లు డిజైన్లు మార్చటంతోపాటు ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. దీనిపై కాంట్రాక్టర్ అదనపు చెల్లింపుల కోసం ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. కాంట్రాక్టర్‌కు రూ.120 కోట్లు చెల్లించమని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రాజెక్టు ప్రధాన పనులన్నీ పూర్తికాగా, ఇంకా రూ.20 కోట్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు చెప్పారు. అప్రోచ్ రోడ్లు, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జూలై నాటికి నాలుగు గేట్లు పూర్తి స్థాయిలో పని చేసేలా పనులు వేగవంతం చేస్తామని ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు అన్నారు.

No comments:

Post a Comment