Sunday 29 June 2014

వక్ఫ్ భూములు అంటే మంటే!

వక్ఫ్ భూములు అంటే మంటే!

Published at: 30-06-2014 03:35 AM
తెలంగాణ సర్కారుకు గుదిబండే
'ఆక్రమణ' ల వివాదంలో కొత్త కోణం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములుగా వేలం
వక్ఫ్ భూములు కాదని సుప్రీంలో అప్పటి సర్కారు పిటిషన్
వక్ఫ్ అని తేలితే భూమికి భూమి లేదా పరిహారమిస్తామని స్పష్టీకరణ
టీ సర్కారుకు ఇదే ఎదురు దెబ్బ
పిటిషన్ ఉపసంహరించుకుంటే వక్ఫ్ భూములని అంగీకరించినట్లే
భూమి లేదా పరిహారం ఇవ్వాల్సిందే
1654 ఎకరాలు లేదా 16 వేల కోట్లు చెల్లించక తప్పదు
ఆ భూముల్లోనే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తదితర సంస్థలు
'వక్ఫ్ భూముల' వ్యవహారంలో తెలంగాణ సర్కారు వైఖరి దానికే గుదిబండగా మారనుందా!? పరాధీనమైన ఆ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఖజానా పాలిట అలవిగాని ఖర్చుగా పరిణమించనుందా!? ఔననే అంటున్నాయి అధికార వర్గాలు! ఇందుకు కారణం.. 'అవి ప్రభుత్వ భూములు' అని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం నిర్ధారించడం! ఒకవేళ, అవి వక్ఫ్ భూములని తేలితే భూమికి భూమి లేదా పరిహారం ఇస్తామని కోర్టుకు హామీ ఇవ్వడం!
(హైదరాబాద్ -ఆంధ్రజ్యోతి) వక్ఫ్ భూముల వివాదానికి కేంద్ర స్థానం రంగారెడ్డి జిల్లాలోని మణికొండ గ్రామం. నిజాం హయాంలో ఇది జాగీర్ గ్రామం. పోలీసు యాక్షన్ జరగడం.. జాగీర్ వ్యవస్థ రద్దు కావడంతో 1949 అక్టోబర్ 3న ప్రత్యేక ఉత్తర్వు (జీవో 1) ద్వారా మణికొండ గ్రామం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. కాలక్రమేణా హైదరాబాద్ అభివృద్ధి చెందడం, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడంతో మణికొండ వంటి శివారు ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. ఇక్కడి భూములను రైతులతో పాటు సామాన్యులూ కొనుక్కున్నారు. హైటెక్ సిటీ ఏర్పాటు, ఇతర ఐటీ కంపెనీల రాకతో మణికొండ బంగారు భూమిగా మారింది. అదే సమయంలో, వైఎస్ ప్రభుత్వం జలయజ్ఞం తదితర ప్రాజెక్టులకు ఆదాయం కోసం అన్వేషించింది. తొండలు గుడ్లు పెట్టని భూములు కూడా ఎకరా కోటి నుంచి పది కోట్లకు అమ్ముడుపోవడం చూసి భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మణికొండలోని 1654 ఎకరాలను వేలం వేసింది. దీంతో, ల్యాంకో హిల్స్, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి సంస్థలతోపాటు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడి భూమిని బహిరంగ వేలంలో కొనుగోలు చేశాయి. ఈ వేలం ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్వహించింది. ఏపీఐఐసీ నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరానికి రూ.4.28 కోట్లు చొప్పున 108.05 ఎకరాలను ల్యాంకో హిల్స్ కొనుగోలు చేసింది. అక్కడే ఉన్న మరికొన్ని భూములను ఇన్ఫోసిస్, ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్, విప్రో, పోలారిస్ తదితర అంతర్జాతీయ సంస్థలకు కేటాయించింది! అలాగే, టీఎన్జీవోల హౌజింగ్ సొసైటీకి కూడా ఇక్కడ భూములు కేటాయించింది. అప్పట్లోనే ప్రభుత్వ చర్యను టీఆర్ఎస్ సహా తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. ఆ భూములు వక్ఫ్ భూములని ఆరోపించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, ఈ విషయం తొలుత హైకోర్టుకు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లింది. ల్యాంకో భూముల కొనుగోలును రద్దు చేయాలని దర్గా హజరత్ హుస్సేన్ షా వలీ తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు వచ్చినపుడు వైఎస్ ప్రభుత్వం... 'ల్యాంకోకు గానీ మిగిలిన సంస్థలకు గానీ కేటాయించింది ప్రభుత్వ భూములే.. వక్ఫ్ భూములు కాదు' అని అఫిడివిట్ దాఖలు చేసింది. 'అంతిమంగా అవి వక్ఫ్ భూములని తేలితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రతిగా నగదు లేదా ప్రత్యామ్నాయంగా భూమి అయినా ఇవ్వగలదు' అని హామీ ఇచ్చింది. ఇదే తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారనుంది.
పరిహారం రూ.16 వేల కోట్లకు పైమాటే!!
ల్యాంకో కొనుగోలు చేసినవి వక్ఫ్ భూములేనని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వక్ఫ్ భూములు కావంటూ సుప్రీంలో ఉన్న అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటామని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఇదే జరిగితే తెలంగాణ ప్రభుత్వం కోర్టులో గత సర్కారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి. అంటే వక్ఫ్ బోర్డుకు అంతే భూమి, లేదా భారీ పరిహారం చెల్లించేందుకు సిద్ధపడాలని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతిమంగా, తెలంగాణ ప్రభుత్వానికే భారంగా మారుతుందని పేర్కొంటున్నాయి. మణికొండలో ప్రభుత్వం వేలం వేసింది, కేటాయించింది మొత్తం 1654 ఎకరాలు. అవి వక్ఫ్ భూములేనని ప్రభుత్వం నిరూపిస్తే, ఆ మేరకు దర్గా హజరత్ హుస్సేనీ షా వలీకి మరోచోట ప్రభుత్వమే 1654 ఎకరాల భూమిని చూపించాల్సి ఉంటుంద. లేదా అంతమొత్తానికీ విలువకట్టి ఆ మేరకు దర్గాకు నగదు చెల్లించాలి. ఎకరా కనీసం 10 కోట్లు ఉందనుకున్నా, 16540 కోట్లు దర్గాకు టీ సర్కారు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ల్యాంకో వ్యవహారానికి వస్తే, ఆ సంస్థ ఆనాడు ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో, ఎక్కువ ధర పాడడం ద్వారా ఆ భూముల్ని కొనుగోలు చేసింది. వక్ఫ్ భూముల పేరిట ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోదలిస్తే, ల్యాంకో సంస్థకు నాటి మొత్తం దాదాపు 462 కోట్ల రూపాయలను వడ్డీతో సహా వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక, ల్యాంకో సంస్థ ఆ భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు కూడా విలువ కట్టి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా తడిసి మోపెడయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఒక వేళ అందుకు సిద్ధపడి ల్యాంకో నుంచి భూములు వెనక్కి తీసుకోవాలనుకున్నా... ప్రభుత్వమే కేటాయింపులు జరిపిన అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలను ఏం చేస్తారన్నది అసలు ప్రశ్న. ఇండియన్ బిజినెస్ స్కూల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పొలారిస్ వంటి కంపెనీలను ఆ భూముల నుంచి తరలించడం సాధ్యమా? హైదరాబాద్‌ను జాతీయ ఐటీ రాజధానిగా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు ఆ రంగంలోని అంతర్జాతీయ కంపెనీలకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటే ఎలాంటి సమస్యలొస్తాయి? హైదరాబాద్ ఇమేజ్ ఏమవుతుంది? కొత్తగా అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో కాలు మోపగలవా? మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పొలారిస్, ఐఎస్‌బీ లాంటి అంతర్జాతీయ సంస్థలకిచ్చిన భూములను వెనక్కు తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళతాయి? అని రెవెన్యూ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వాటిని పక్కనపెట్టి.. కేవలం ల్యాంకో భూములనే వెనక్కు తీసుకోవడం ఆచరణ సాధ్యమైన పని కాదని కూడా పేర్కొంటున్నాయి. ఒకవేళ కంపెనీలకు పరిహారం చెల్లించాల్సి వస్తే భూమితోపాటు, నిర్మాణాలకు కూడా విలువ చెల్లించాల్సి ఉంటుందని, అప్పుడు పరిహారం విలువ 25 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నివేదిక తారుమారు
ల్యాంకోకు కేటాయించినవి వక్ఫ్ భూములేనని వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు వక్ఫ్ బోర్డు సర్వే కమిషనరేట్ సర్వే నివేదికను అందజేసింది. అదే నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఆ నివేదికను పరిశీలిస్తే అనధికార మార్పులు, చేర్పులు చేసి టాంపరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సర్వే ప్రొఫార్మాలో కీలకమైన అంశాల్లో లోపాలున్నాయి. గ్రామం, వార్డు కింద మణికొండకు బదులు దర్గా హుస్సేనీ షా వలీ అని పేర్కొన్నారు. అలాగే, వక్ఫ్ ఆస్తుల వివరాలు అన్న కాలమ్‌లో తొలుత నిల్ ( ఏమీ లేవు) అని రాశారు. ఆ తర్వాత దానిని మరొకరు కొట్టి వేసి, మణికొండ జాగీర్‌లో వివిధ సర్వే నెంబర్ల కింద ఇనామ్ భూములు ఉన్నట్లు రాశారు. అంతేనా.. ప్రొఫార్మాలోని అన్ని అంశాలను ఒక వ్యక్తి రాస్తే.. కేవలం వక్ఫ్ ఆస్తుల వివరాలను మరొక వ్యక్తి రాశారు. అలాగే, ఈ భూములన్నీ రాజేంద్రనగర్ తహసిల్ పరిధిలోకి వస్తాయని, కానీ.. నివేదికలో శేరిలింగంపల్లి తహసిల్దార్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. సంతకాల ఫోర్జరీపై నాటి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సూర్యారావు ఫిర్యాదు మేరకు మాజీ వక్ఫ్ సర్వే కమిషనర్ మునవర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ టీవీవీ ప్రసాద్‌లపై 2007 సెప్టెంబర్ 20న కేసు నమోదైంది. 2011, జూలై 7న ఛార్జిషీట్ దాఖలైంది.
వైఎస్ సర్కారు వాదన ఏమిటి?
మణికొండలో వేలం వేసినవి, సంస్థలకు కేటాయించినవి పోరంబోకు భూములని గత 50 ఏళ్ల రెవెన్యూ, సర్వే రికార్డులు స్పష్టం చేస్తున్నట్టు వైఎస్ ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన వివరణలో పేర్కొంది. 1322 ఫస్లీ (ఆదేశం)లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని తెలిపింది. హైదరాబాద్ రెగ్యులేషన్ (జాగీర్ రద్దు చట్టం)ను ప్రభుత్వం 1949లో తీసుకొచ్చిందని, అప్పుడే మణికొండ జాగీర్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చిందని, అదే సమయంలో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది మాత్రం 1954లో అని వివరిస్తోంది. వక్ఫ్ చట్టం అమల్లోకి రాకముందే మణికొండ జాగీర్ రద్దు కావడమే కాకుండా దాని భూములు ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయని స్పష్టం చేస్తోంది.

No comments:

Post a Comment