Monday 16 June 2014

అన్ని ఫారాల్లో అమ్మ పేరు

అన్ని ఫారాల్లో అమ్మ పేరు

Published at: 17-06-2014 04:02 AM
న్యూఢిల్లీ, జూన్ 16: లింగ సమానత్వం దిశగా విశ్వవిద్యాలయ నిధి వితరణ సంఘం (యూజీసీ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకపై విద్యా సంబంధ పత్రాలన్నిటిలో తల్లి పేరును చేర్చాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు దరఖాస్తులు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఇతర ఫారాలన్నిటిలో విద్యార్థుల తండ్రితోపాటు తల్లి పేరుకు చోటు కల్పించాలని స్పష్టం చేసింది. తద్వారా తండ్రులు మరణించిన విద్యార్థులు, విడాకులు పొందిన, వేరుపడినవారి పిల్లలకు భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా చూడవచ్చునని నిర్దేశించింది. అలాగే ఇష్టానుసారం కోర్సులు ప్రవేశపెట్టడం చట్ట విరుద్ధమని హెచ్చరిస్తూ వైస్ చాన్స్‌లర్లకు తాఖీదు పంపింది. కొత్త కోర్సులకు ఆరు నెలల ముందే తమ ఆమోదం కోరాలని స్పష్టం చేసింది. అలాగే ఆయా కోర్సులకు ఆమోదయోగ్యతను విశదీకరించాలని పేర్కొంది. ఢిల్లీ వర్సిటీ (డీయూ) 'ఫోర్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్' (ఎఫ్‌వైయూపీ-నాలుగేళ్ల డిగ్రీ)ను ప్రవేశపెట్టడంపై వివాదం నేపథ్యంలో నోటీసులు పంపడంతోపాటు తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని డీయూను కూడా ఆదేశించింది. అంతకుముందు 'సేవ్ డీయూ' పేరిట ఏబీవీపీ, డీయూఎస్‌యూ విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అనంతరం మరికొన్ని సంఘాల నేతలతో కలిసి మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి వినతిపత్రం సమర్పించాయి. ఆమె అందుబాటులో లేకపోవడంతో సీనియర్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాయి. ఎఫ్‌వైయూపీపై యూజీసీ ఈ నెల 13నే ఆదేశాలిచ్చినా అవేమీ తమకు అందలేదని వైస్ చాన్స్‌లర్ మొండికేసినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా దీనిపై ఆమోదం కోసం ఈ నెల 21న వర్సిటీ విద్యామండలి సమావేశం నిర్వహించనున్నారని ఆరోపించాయి.

No comments:

Post a Comment