Sunday 22 June 2014

రుణమాఫీ 5 మార్గాలు

రుణమాఫీ 5 మార్గాలు

Published at: 23-06-2014 04:58 AM
లక్షన్నర రూపాయల వరకూ రద్దు
చంద్రబాబు ముమ్మర కసరత్తు
ముందుగా రీ షెడ్యూలు
కొత్త రుణాలు మంజురు
స్వయంగా రంగంలోకి
దిగుతున్న ముఖ్యమంత్రి
25న రిజర్వు బ్యాంకుతో
కోటయ్య కమిటీ చర్చలు
26,27 తేదీల్లో ఢిల్లీకి బాబు
మోదీ, జైట్లీతో మంతనాలు
అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రూ. లక్షన్నర వరకు రుణ మాఫీ చేసి తీరాలన్న కృత నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇందుకు పంచ ముఖ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
రుణ మాఫీ పథకం అమలుకు సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు మార్గాలను ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీని అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నేరుగా రంగంలోకి దిగనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా తొలుత రుణాలను రీ షెడ్యూలు చేయడానికి, వాటిపై ఐదేళ్లపాటు మారటోరియం విధించడానికి ఆర్బీఐని ఒప్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ అనుమతి తీసుకునేందుకు ఈనెల 25న కోటయ్య కమిటీ ముంబై వెళ్లబోతోంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో.. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. రుణాల రీ షెడ్యూలు, మారటోరియంపై ఆ ఇద్దరి నుంచి ఎలాగైనా హామీ తీసుకోవాలన్న ప్రయత్నాల్లో కమిటీ ఉంది. అదే సమయంలో, ఈనెల 26, 27 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతోనూ రీ షెడ్యూలు, రుణ మాఫీపై చర్చించనున్నారు. బాండ్లను ష్యూరిటీగా పెట్టి రుణ మాఫీ చేయాలని భావించిన చంద్రబాబు ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్‌తో మాట్లాడడమే కాకుండా ఆర్బీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కానీ, ఆర్బీఐ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదే విషయాన్ని మోదీ, జైట్లీలకు చెప్పి ఆర్బీఐని ఒప్పించేలా ఆదేశాలు జారీ చేయించాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారని తెలిసింది. రుణాల రీ షెడ్యూలు, మారటోరియానికి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. సమస్య అక్కడితో పరిష్కారం అయినట్లే. దాంతో, రుణ మాఫీకి విధి విధానాలను ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ, ఇందుకు కేంద్రం, ఆర్బీఐ అంగీకరించకపోతే రెండో మార్గంగా ప్రభుత్వమే బ్యాంకులకు బాండ్లను జారీ చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
మారటోరియానికి అంగీకరించకపోతే ఇదే విషయాన్ని ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేయనున్నారని తెలిసింది. ప్రభుత్వం తరఫున బాండ్ల జారీకి కూడా ఆర్బీఐ, కేంద్రం అంగీకరించకపోతే ఎఫ్ఆర్‌బీఎం చట్టం అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు కోరనున్నారు. ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం.. నిర్దేశిత పరిమితికి మించి కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి వీల్లేదు. ఆర్బీఐ, కేంద్రం అంగీకరించకపోతే కొత్తగా అప్పులు తెచ్చుకుంటే తప్పితే రుణ మాఫీ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్రం కొత్తగా ఏర్పడడం.. పెద్దఎత్తున ఆర్థిక లోటు ఉండడం తదితర కారణాలను చూపి ఎఫ్ఆర్‌బీఎం చట్టం పరిధి నుంచి మినహాయింపు పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తే కొత్తగా అప్పులు ఇవ్వడానికి చాలా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, రుణ మాఫీ పథకం అమలు కూడా సులభమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ, ఎఫ్ఆర్‌బీఎం చట్టం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కూడా ఆర్బీఐ, కేంద్రం అంగీకరించకపోతే.. అప్పటి వరకు తాము చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోతే, విధిలేని పరిస్థితుల్లో రైతులు తీసుకున్న రుణాల్లో 50 శాతాన్ని తక్షణమే బ్యాంకులకు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 50 శాతం మొత్తానికి రైతులకే బాండ్లను జారీ చేయాలని యోచిస్తోంది. సగానికి సగం రుణాలను తక్షణం చెల్లించాలన్నా ప్రభుత్వానికి దాదాపు రూ.30 వేల కోట్ల వరకు అవసరమని, ఆ మొత్తం సర్దుబాటు కాని పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకే బాండ్లను జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిసింది. దీని ప్రకారం, ఇప్పుడు రుణాలను రైతులే చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు రైతుకు ప్రభుత్వం బాండ్లను జారీ చేస్తుంది. రాబోయే ఐదేళ్లలో విడతల వారీగా ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. అన్ని ప్రయత్నాలూ విఫలమైతే చివరి దశలో ఈ దిశగా ఆలోచించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తంమీద, యూపీఏ ప్రభుత్వం అమలు చేసినట్లు ఇష్టారాజ్యంగా కాకుండా స్పష్టమైన విధివిధానాలతో పకడ్బందీగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలన్న గట్టి పట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యూపీఏ హయాంలో రుణమాఫీ పేరిట కాంగ్రెస్ రైతులకే పథకాన్ని వర్తింపజేసి కొన్ని బోగస్ రుణాలను రద్దు చేశారన్న ఆరోపణలు వచ్చాయని, ఆ చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం నెరవేర్చాలన్న పట్టుదలతో భారీ కసరత్తే చేస్తోంది.
ముందుగా రుణాల రీ షెడ్యూలు: రుణ మాఫీ ప్రక్రియ అమల్లో జాప్యం జరుగుతుండడం.. ఖరీఫ్ ముంచుకు వస్తున్న నేపథ్యంలో ముందుగా రైతుల రుణాలను రీ షెడ్యూలు చేయించి, కొత్తగా రుణాలను మంజూరు చేయించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్బీఐ నుంచి జవాబు వచ్చేలోపు రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు.. ముందుగా రుణాలను రీ షెడ్యూలు చేయించి ఖరీఫ్‌లో రైతులకు కొత్తగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి, సకాలంలో వర్షాలు కురిస్తే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యేది. రుణాల కోసం రైతులు క్యూల్లో ఉండేవారు. రుతు పవనాలు ఆలస్యం కావడంతో రైతులు కూడా పెద్దగా హడావుడి పడడం లేదు. ఒకటి రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే రైతులు ఖరీఫ్ పనులకు వెళతారు. ఈలోపులోనే వారికి రుణాలను అందజేస్తే సీజన్‌ను నష్టపోయే అవకాశం ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు.
కోటయ్య కమిటీతో సుదీర్ఘ భేటీ: రుణ మాఫీ విధి విధానాల ఖరారుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ ఆదివారం చంద్రబాబు తదితరులతో రెండు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైంది. లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తే ఎంత అవుతుంది? లక్షన్నర వరకు మాఫీ చేస్తే ఎంతవుతుంది? విధివిధానాలు ఎలా ఉండాలి? తదితర అంశాలపై చర్చించింది. లక్ష రూపాయల్లోపు రుణాలను మాఫీ చేస్తే రూ.25 వేల కోట్లు కావాలని; లక్షన్నర రూపాయల్లోపు రుణాలను మాఫీ చేస్తే రూ.35 వేల కోట్లు అవుతుందని బ్యాంకర్లు నివేదికలు ఇచ్చారు. లక్షన్నర వరకూ రుణాలను మాఫీ చేస్తే 96 శాతం మంది రైతులు లబ్ధి పొందుతారని వివరించారు. దీంతో, లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. లక్షన్నర వరకు ప్రతి రైతుకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేస్తారు. చిన్న సన్నకారు రైతు నుంచి పెద్ద రైతు వరకు మొత్తం అందరికీ.. రుణం ఎంతన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మాఫీ చేస్తారు. అయితే, సాగు కోసం తీసుకున్న బంగారం రుణాల విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. మహిళలు తీసుకున్న బంగారు రుణాలను మాఫీ చేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. రుణాల రీ షెడ్యూలు, రుణ మాఫీ విషయంలో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంటే.. బంగారంపై పురుషులు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. లక్షన్నర వరకు మహిళలు తీసుకున్న బంగారు రుణాలను కూడా కలిపితే రూ.40 వేల కోట్ల వరకు అవుతుందని; పురుషులు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాల్సి వస్తే ఆ మొత్తం రూ.46 వేల కోట్లను దాటుతుందని వివరిస్తున్నారు. డ్వాక్రా రుణాలను కూడా కలిపితే మాఫీ చేయాల్సిన మొత్తం రూ.60 వేల కోట్ల వరకు ఉంటుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. మొత్తం అన్ని రుణాలనూ కలిపితే మాఫీ చేయాల్సిన మొత్తం రూ.84 వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కాగా, చంద్రబాబు రుణ మాఫీ పథకాన్ని ప్రకటించిన తర్వాత.. ఎన్నికలకు ముందు ఆరు నెలల్లో బంగారం కుదువ పెట్టిన రుణాలు రూ.11 వేల కోట్లు పెరిగినట్లు బ్యాంకర్లు నివేదించారు. వీటిని ఏం చేయాలనే దిశగా కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
ఏపీ ఐదు వ్యూహాలు ఇవే
1. రీషెడ్యూలు, మారటోరియానికి ఆర్టీఐని ఒప్పించడం లేదా
2.బాండ్ల జారీకి ఆర్టీఐ, కేంద్రం అనుమతి తీసుకోవడం లేదా
3. ఎఫ్ఆర్‌బీఎం చట్టం నుంచి మినహాయింపు కోరడం లేదా
తద్వార కొత్త అప్పులు తెచ్చి పథకాన్ని అమలు చేయడం లేదా
4. సగం రుణం తక్షణ చెల్లింపు..మిగిలిన సగానికి బాండ్లు లేదా
5. రైతులకే బాండ్లు జారీ..ఐదేళ్లలో తిరిగి చెల్లింపు

No comments:

Post a Comment