Monday 16 June 2014

ఉపవాసం'తో ' మధుమేహానికి చెక్

ఉపవాసం'తో ' మధుమేహానికి చెక్

Published at: 16-06-2014 05:24 AM
వాషింగ్టన్: మధుమేహ వ్యాధి ప్రారంభస్థాయిలో (ప్రిడయాబెటిక్) ఉన్న వారికి వ్యాధి నిరోధించడంలో ఉపవాసం ఓ ఆయుధంగా ఉపయోగపడుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిరాహార స్థితిలో తనకు కావాల్సిన శక్తిని శరీరం కొవ్వు నిల్వలను కరిగించడం ద్వారా సమకూర్చుకుంటుందని దీంతో మధుమేహం రాక నెమ్మదిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈమేరకు 10 నుంచి 12 గంటలపాటు నిరాహారంగా ఉండడం వల్ల శరీరం తనకు కావాల్సిన శక్తికి ఇతర మార్గాలను అన్వేషిస్తుందని, శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు నిల్వలను కరిగిస్తుందని ముర్రేలోని ఇంటెర్‌మౌంటెన్ మెడికల్ సెంటర్ (ఐఎంసీ) పరిశోధకులు వివరించారు. శరీరం కొవ్వు కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను గ్రహించి శక్తిగా మార్చుకుంటుందని చెప్పారు. ప్రీడయాబెటిక్ స్థితి నుంచి మధుమేహం బారిన పడకుండా తప్పించుకునేందు ఉపవాసం దివ్యౌషధంగా పనిచేస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన బెంజమిన్ హార్నె తెలిపారు.
2011లో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో ఉపవాస ప్రభావాన్ని పరిశీలించినపుడు... రోజంతా నీటిని మాత్రమే తీసుకుంటూ నిరాహారంగా గడిపిన వారిలో గ్లూకోజ్ నిల్వలతోపాటు బరువు తగ్గడం గమనించామని తెలిపారు. దీనికి విరుద్దంగా రోజు మొత్తంలో ఒకపూట ఆహారాన్ని మానేసిన వారిలో.. కొవ్వు నిల్వలు పెరిగాయన్నారు. గత పరిశోధనల ఫలితాలను, తాజా ఆవిష్కరణలను పోల్చి నిశితంగా పరిశీలించగా.. మధుమేహానికి దారితీసే ప్రమాదాన్ని ఉపవాసం తగ్గించగలదనే నమ్మకం కలిగిందని చెప్పారు. దీనికోసం 30 నుంచి 69 ఏళ్ల వయసున్న స్త్రీ,పురుషులపై ప్రయోగం చేశారు. ఇందులో పాల్గొన్న వలంటీర్లు ఉపవాసం ప్రారంభించిన కొత్తలో కొలెస్ట్రాల్ స్థాయులు స్వల్పంగా పెరిగాయి.. ఆరు వారాలు పూర్తయ్యేనాటికి 12 శాతం తగ్గాయని, దాంతోపాటు వారు బరువు కూడా తగ్గారని హార్నే వివరించారు. దైనందిన కార్యకలాపాల కోసం శరీరానికి అవసరమయ్యే శక్తి కొలెస్ట్రాల్ కరిగించడం ద్వారా సమకూరడమే దీనికి కారణమని, మధుమేహాన్ని నిరోధించడంలో ఉపవాసం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోందని చెప్పారు.

No comments:

Post a Comment