ఆంధ్రా విద్యుత్ ఆంధ్రాకే దక్కాలి
మదనపల్లె, జూన్ 15: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్యతో ప్రజలు, పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఉత్పత్తవుతున్న విద్యుత్తును 23 ఏళ్లపాటు యూనిట్ ధర రూ.1.10తో 1700 మెగావాట్ల మేర తెలంగాణకు సరఫరా చేయాలని బిల్లులో పొందుపరిచే హక్కు జైరాంరమేష్‌కు ఎవరిచ్చారని ఆంధ్ర మేధావుల వేదిక రాష్ట్ర అ«ధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ నిలదీశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ఏటా రూ.6900 కోట్ల భారం పడుతుందన్నారు. ఆంధ్రాలో ఉత్పత్తయ్యే విద్యుత్తు ఇక్కడి ప్రజల అవసరాలకుపోను మిగిలితే ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆదివారం ఆయన చిత్తూరుజిల్లా మదనపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని అభివృద్ధి పేరుతో రూ.లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి తెలంగాణలో పెట్టుబడులుపెట్టి అభివృద్ధిచేస్తే... ఇప్పుడేమో ఆస్తులు తెలంగాణకు, అప్పులు సీమాంధ్రకా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రజా నాయకుడా? లేదా అన్నది త్వరలోనే తేలిపోనుందని చలసాని పేర్కొన్నారు. కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను కేంద్రం మునుపటి ధరను పెంచి కొన్నట్లయితే ప్రధాని మోదీ కార్పొరేట్ రంగం చేతిలో కీలుబొమ్మగా మారినట్లేనని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment