Saturday 21 June 2014

వీలైనంత త్వరగా వెళ్లిపోదాం

వీలైనంత త్వరగా వెళ్లిపోదాం

Published at: 21-06-2014 03:47 AM
మన సచివాలయాన్ని అసెంబ్లీని నిర్మించుకుందాం
సమిష్టి తత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం
సభ్యులు బాధ్యతాయుతంగా మెలగాలి
ఆం«ధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
హైదరాబాద్, జూన్ 20: "రాష్ట్రం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు లేనప్పుడు ప్రతిపక్షం సహకరించాలి. సభలో రాజకీయాలు చేసి పైచేయి సాధించాలనుకోవడంకన్నా సభద్వారా ప్రజలకు ఏంచేశామో ప్రతి సభ్యుడూ ఆలోచించాలి'' అని ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సరైన వసతులు, ఏర్పాట్లు లేకపోయినా వీలైనంత త్వరగా అక్కడికి వెళ్లిపోయి అభివృద్ధి చేసుకోవాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. మన అసెంబ్లీ, మన సచివాలయం నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. శాసనసభలో సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును టీవీ ప్రసారాల ద్వారా ప్రజలు గమనిస్తుంటారని, తమ ప్రాంత ఎమ్మెల్యే వారి నియోజకవర్గం గురించి మాట్లాడారా లేదా అన్నది వారికి తెలుస్తుందని ఆయన చెప్పారు.చాలా మంది సభ్యులు.. ఒక అంశంపై మాట్లాడమంటే మరో అంశం మాట్లాడుతూ పెద్దగా అరుస్తూ ఆరోపణలు చేస్తుంటారని అది సరికాదని స్పీకర్ అభిప్రాయపడ్డారు. సభలో రాజకీయాలు చేసి పైచేయి సాధించాలనుకోవడం కన్నా ప్రజలకోసం సభద్వారా ఏమి సాధించారన్నది ఆలోచించుకోవాలని సభ్యులకు సూచించారు. తాను వ్యక్తిగతంగా అధికార పార్టీకి చెందిన వాడినైనా సభ హుందాగా, సజావుగా జరగటానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
సమయం వృథా కాకూడదని, కొత్తగా ఎన్నికయిన వారికి కూడా అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. అన్నింటికన్నా ప్రజలకు ప్రయోజనం కలిగేలా సభ నడపడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అధికారాల కన్నా కూడా బాధ్యతలే తనకు మిన్న అని కోడెల వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో ఎక్కువగా చర్చ జరగకుండా గిలిటెన్ చేస్తూండే వారని, ఈసారి బడ్జెట్ సహా ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో చర్చ జరిగేలా సభ నిర ్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సభలో 47 మందికి మాట్లాడటానికి అవకాశమిచ్చామని, అధికారపక్షానికి చెందిన వారు 25 మంది మాట్లాడితే... ప్రతిపక్షం వాళ్లు 22 మంది మాట్లాడారని చెప్పారు. స్పీకర్‌గా బాధ్యతలు, పరిధులు తనకు తెలుసునని సభ నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభలో దాదాపు 90 మంది ఉన్నారని, వారందరికీ చట్టాలు గురించి, అసెంబ్లీ సంప్రదాయాల గురించి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపైన వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు కొత్త రాష్ట్రానికి తొలి స్పీకర్ గా నరసరావుపేటకు చెందిన నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారనిగుర్తు చేశారు. సమైక్య ఆంధ్ర నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్పీకర్ అయ్యే అవకాశం నరసరావుపేట నుంచే వచ్చిన తనకు రావడం అదృష్టమని చెప్పారు. ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోయినప్పుడు తాము కర్నూలు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో ఉన్నామని గుర్తుచేశారు. క్యాంపస్‌లో సరైన అవస్థాపన సౌకర్యాలు లేకపోయినా కొన్నాళ్లు టెంట్ల కింద క్లాసులు జరిగిన రోజులున్నాయన్నారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లో సరైన వసతులు, ఏర్పాట్లు లేకపోయినా వీలైనంత త్వరగా అక్కడికి వెళ్లిపోయి అభివృద్ధి చేసుకోవాలని తన వ్యక్తిగత అభిప్రాయమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు.
ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు
స్పీకర్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉందని కోడెల శివప్రసాదరావు అన్నారు. సభాపతిగా బాధ్యతలు చేపట్టిన కోడెల అసెంబ్లీలో సభ్యులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో మనం నాలుగురోడ్ల కూడలిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ జమా ఖర్చులు సభలో చర్చకు వస్తాయని, అలాంటి సమయాల్లో అందరూ సహకరించుకోవాలన్నారు. స్పీకర్‌గా ఎన్నికైన తనకు పార్టీలు లేవని అధికార, ప్రతిపక్షాలను సమానంగా చూస్తానని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, మంత్రులు సన్నద్ధమై రావాలని సూచించారు. అందరం సహకరించుకుందామని, త్వరలో మన రాష్ట్రంలో మన అసెంబ్లీ, మన సచివాలయం నిర్మించుకుందామని పిలుపునివ్వగా సభ్యులందరూ బల్లలు చరిచారు.

No comments:

Post a Comment