Monday 9 June 2014

ప్రయోగాల కేబినెట్

ప్రయోగాల కేబినెట్

Published at: 09-06-2014 08:59 AM
ప్రయోగాలకు టీడీపీ అధినేత పెద్దపీట
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
రాజకీయాల్లో ప్రయోగాలకు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు మరో ప్రయోగం చేశారు! కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ప్రగతి పథంలో పయనింపజేయడానికి ఎక్కువమంది కొత్త వారినే తన బృందంగా ఎంచుకున్నారు! సీనియర్లకు పెద్దపీట వేశారు! కొత్తవారినీ ప్రోత్సహించారు! సీనియర్లు, జూనియర్లు రెండింటిలోనూ ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న విధేయులకే ప్రాధాన్యం ఇచ్చారు! పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు ఉన్నా తన మంత్రివర్గం పాత కొత్తల మేలు కలయికగా ఉండాలన్న లక్ష్యంతో చంద్రబాబు కొత్త వారికి పెద్ద సంఖ్యలో చోటు కల్పించారు. పదేళ్ల కిందట తాను ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఉన్న మంత్రివర్గం కాకుండా కొత్తదనంతో ప్రజల ముందుకు వెళ్లాలని నిశ్చయించిన ఆయన.. అదే తరహాలో మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. 19 మంది మంత్రుల్లో 14 మంది మొదటిసారి మంత్రులయ్యారు. వీరిలో 8మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారు కావడం విశేషం. ఇక, కేబినెట్లో కేవలం ఐదుగురు మాత్రమే మాజీ మంత్రులు. కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వీరిలో ఉన్నారు. వీరిలో మొదటి నలుగురూ గత టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రులు కాగా గంటా మాత్రం పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. తాజాగా మంత్రులైన వారిలో డి.ఉమామహేశ్వరరావు, పి.పుల్లారావు, కె.అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, పి.రఘునాధరెడ్డి, పి.సుజాతకు గతంలోనే ఎమ్మెల్యేలు. మంత్రులుగా మాత్రం మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, నిమ్మకాయల చినరాజప్ప, కిమిడి మృణాళిని, శిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, రావెల కిశోర్ బాబు, బీజేపీకి చెందిన కె.శ్రీనివాస్, మాణిక్యాలరావు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతూనే మంత్రులయ్యారు. వీరిలో రాజప్ప, రాఘవరావు, కామినేని శ్రీనివాస్‌లకు గతంలో ఎమ్మెల్సీలుగా చేసిన అనుభవం ఉంది. మృణాళిని గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. నారాయణ రెండు సభల్లో దేనిలోనూ సభ్యుడు కూడా కాకుండానే ఏకంగా మంత్రి పదవిని పొందడం విశేషం.
రాజకీయ కుటుంబాలకు ప్రాధాన్యం
ప్రముఖ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన ఐదుగురికి చంద్రబాబు మంత్రివర్గంలో పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లాలో దివంగత ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి వచ్చింది. విజయనగరం జిల్లా నుంచి మంత్రి పదవి పొందిన మృణాళిని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు మరదలు. ఆమె భర్త గణపతిరావు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు. వివాహం తర్వాత శ్రీకాకుళం వెళ్లి అక్కడ జడ్పీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆమె.. ఈసారి ఎన్నికల్లో పుట్టిల్లు విజయనగరం జిల్లా చీపురుపల్లి వచ్చి బొత్స సత్యనారాయణపై పోటీ చేసి గెలిచారు. దివంగత పరిటాల రవీంద్ర సతీమణి సునీతకు అనంతపురం జిల్లా నుంచి అవకాశం వచ్చింది. కృష్ణా జిల్లా నుంచి మంత్రులైన ఇద్దరూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. దివంగత దేవినేని వెంకటరమణ సోదరుడు ఉమాకు మంత్రి పదవి అవకాశం వచ్చింది. అదే జిల్లా నుంచి ఇప్పుడు మంత్రి అయిన కొల్లు రవీంద్ర మామ నడికుదిటి నరసింహరావు గతంలో మంత్రిగా చేశారు.
విద్యా సంస్థలు.. వ్యాపారాలు
ప్రస్తుత మంత్రుల్లో కొందరికి విద్యా రంగంలో విద్యా సంస్థలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం పొందిన నారాయణ రాష్ట్రంలో పేరు పొందిన నారాయణ విద్యా సంస్థల యజమాని. అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథరెడ్డికి పలు విద్యా సంస్థలు ఉన్నాయి. దేవినేని ఉమా కుటుంబం ఒక ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహిస్తోంది. మంత్రి గంటా వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అయ్యన్నపాత్రుడు కుటుంబానికి కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఆయన కుమారుడు ఒక టీవీ చానల్‌కు యజమానిగా ఉన్నారు. అయ్యన్న గతంలో సినిమాలు కూడా తీశారు. ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు గ్రానైట్ వ్యాపార రంగంలో ప్రముఖుడు. పత్తిపాటి పుల్లారావు పత్తి వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
విధేయతకు గుర్తింపు.. చిన్న రాజప్ప
పుట్టిన తేదీ: 1.10.1953
వయస్సు : 61... విద్య : ఎంఏ,
నియోజకవర్గం: పెద్దాపురం, తూర్పుగోదావరి
తొలినాళ్లనుంచి తెలుగుదేశంపార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఎన్నడూ పార్టీని వీడని వ్యక్తిగా... వివాదరహితుడిగా పేరొందారు. 1985-90లో ఉప్పలగుప్తం మండల పరిషత్ అధ్యక్షులుగా, 2007-13లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగాను, 1992లో ఏపీహెచ్ ఎంఐడీసీ చైర్మన్‌గాను, 1995లో పౌరసరఫరాల రాష్ట్ర చైర్మన్‌గాను బాధ్యతలు నిర్వహించారు. 1992నుంచి మధ్యలో రెండు సంవత్సరాలు మినహా ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.
కేఈ.. సీనియర్‌మంత్రి
పేరు : కేఈ కృష్ణమూర్తి
పుట్టిన తేదీ : 02-10-1938
వయస్సు : 76, విద్యార్హత : ఎంఏ ఎల్ఎల్‌బీ
నియోజకవర్గం: పత్తికొండ, కర్నూలు జిల్లా
తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో ప్రవేశించిన కృష్ణమూర్తి.. కాంగ్రెస్‌పార్టీ తరఫున 1978, 83ల్లో డోన్ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత టీడీపీలో చేరి 85లో ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్‌లో చేరారు.1989లో కాంగ్రెస్‌నుంచి గెలిచి మర్రిచెన్నారెడ్డి సర్కారులో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత మళ్లా టీడీపీలో చేరి 1999లో కర్నూలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనన 2014లో పత్తికొండ కు మారి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో స్థానం సంపాదించారు.
అన్నయ్య కోటాలో
పేరు: కింజరాపు అచ్చెన్నాయుడు
పుట్టిన తేదీ : 1971మార్చి 26
వయస్సు : 43
విద్యార్హతలు : బీఎస్సీ, కృష్ణా కాలేజ్, విశాఖ.
నియోజకవర్గం: టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
ఎర్రన్నాయుడి సోదరుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన అచ్చెన్నాయుడు.. ఆయన ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1996, 1999, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి మంత్రి పదవి చేపట్టారు.
మహిళా కోటాలో మృణాళిని
పేరు : కిమిడి మృణాళిని
పుట్టిన తేదీ : మార్చి 5, 1958
వయస్సు : 56
విద్య : ఎంబీబీఎస్
నియోజకవర్గం: చీపురుపల్లి, విజయనగరం జిల్లా
1985లో రాజకీయ రంగప్రవేశం చేసిన మృణాళిని అంతకు ముందు తెర్లాం మండలం పెరమాళి పీహెచ్‌సీ ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా చైర్‌పర్సన్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఎచ్చెర్ల శాసనసభ్యుడు కళా వెంకట్రావు ఈమెకు బావ అవుతారు. ఈమె భర్త కిమిడి గణపతిరావు కూడా మాజీ ఎమ్మెల్యేనే కావడం గమనార్హం. ఈమె తన పుట్టిన జిల్లా అయిన విజయనగరంలోని చీపురుపల్లినుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణను మట్టికరిపించారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి బాధ్యతలు చేపట్టారు.
అయ్యన్నకు మరో అవకాశం
పేరు: చింతకాయల అయ్యన్నపాత్రుడు
పుట్టిన తేదీ : 04-09-1956
వయస్సు : 58
విద్యార్హతలు : బీఏ
నియోజకవర్గం : నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా
టీడీపీ ఆవిర్భావంనుంచి పార్టీలో ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు పోటీ చేసి, ఆరుసార్లు గెలుపొందారు. 1996లో అనకాపల్లి ఎంపీగా గెలిచి, 1998లో ఓడిపోయారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో పలుమంత్రిత్వ శాఖలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ అయ్యన్న మంత్రి పదవిని చేపట్టడం గమనార్హం. టీడీపీ ఆవిర్భావం అనంతరం విశాఖ జిల్లాలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత ఒక్క అయ్యన్నకే దక్కుతుంది.
గంటా.. ఈసారి టీడీపీ మంత్రి..
పేరు : గంటా శ్రీనివాసరావు
పుట్టిన తేదీ : 01-12-1960
వయస్సు : 53
విద్యార్హతలు : బీకాం, బీఎల్
నియోజకవర్గం : భీమిలి, విశాఖపట్నం జిల్లా
1999లో టీడీపీలో చేరిన గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో చోడవరంనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో పీఆర్పీలో చేరి అనకాపల్లినుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిరంజీవి పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో గంటా మంత్రి పదవిన పొందారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలోకి తిరిగి ప్రవేశించారు. భీమిలినుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు.
యనమల.. సీనియారిటీకి పట్టం
పేరు : యనమల రామకృష్ణుడు
పుట్టిన తేదీ : 12.5.1951
వయస్సు : 63
విద్యార్హతలు : ఎంఏ., ఎల్ఎల్‌బీ
నియోజకవర్గం : ఎమ్మెల్సీ
ఎన్టీఆర్‌పిలుపుతో 1983లో టీడీపీలో చేరిన యనమల రామకృష్ణుడు.. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంనుంచి 1983, 1985, 1989, 1994, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో తొలిసారి ఓటమిపాలయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంలో 1995-1999 మధ్యకాలంలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత రాష్ట్ర ఆర్థికశాఖ, న్యాయశాఖ, పురపాలకశాఖ, సహకారశాఖ మంత్రిగాను, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. టీడీపీలో పలు కీలక పదవులు నిర్వహించారు.
సుజాత.. టీచర్ నుంచి మంత్రి
పేరు : పీతల సుజాత
పుట్టిన తేదీ : 13-08-1973
వయస్సు : 41,
విద్య : బీఎస్సీ, బీఈడీ, ఎంఏ లిటరేచర్
నియోజకవర్గం: చింతలపూడి, పశ్చిమగోదావరి
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పీతల సుజాత ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నేతగా ఉన్న తండ్రి వరప్రసాద్ వారసత్వంతో ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో సుజాత ఆచంట నియోజకవర్గం టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. ప్రతీ కార్యక్రమంలోను బాధ్యతాయుతంగా పీతల సుజాత పాల్గొనడంతో చంద్రబాబు దృష్టిలో పడ్డారు. ఇప్పుడు మరోసారి గెలుపొంది మహిళా కోటాలో మంత్రి పదవి దక్కింది.
మిత్రపక్షం కోటాలో..
పేరు : పైడికొండల మాణిక్యాలరావు
పుట్టిన తేదీ: 01-11-1961
వయస్సు : 52
విద్యార్హత : బీఏ
నియోజకవర్గం : తాడేపల్లిగూడెం,
పశ్చిమగోదావరి జిల్లా
చిన్నతనంనుంచి ఆర్ఎస్ఎస్‌తో సన్నిహిత సంబంధాలున్న మాణిక్యాలరావు.. బీజేపీ ఆవిర్భావ సమయంనుంచి ఆ పార్టీకి సేవలందిస్తున్నారు. 1998-2004 కాలంలో పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. జిల్లాలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి 30 మండలాల్లో మానవతా శాఖల ద్వారా శీతల శవపేటికలను ఉచితంగా అందిస్తున్నారు. ఏడు శాంతి రథాలను ఏర్పాటు చేసి ఉచితంగా పార్థీవ దేహాలను తరలిస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మిత్రపక్షం కోటాలో మంత్రి పదవి చేపట్టారు.
నారాయణ.. మేధావుల కోటాలో
పేరు : పొంగూరు నారాయణ
పుట్టిన తేదీ : 15-06- 1957
వయస్సు : 57
చదువు : ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ
నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఎంతో గుర్తింపు పొందిన పీ నారాయణ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏదీ కాకపోయినా మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా చంద్రబాబుతోగల సాన్నిహిత్యంతో తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా నిలిచారు. 12 రాష్ట్రాల్లో విద్యాసంస్థలను నెలకొల్పిన నారాయణ.. తొలిసారి మంత్రి పదవిని చేపట్టారు.
బొజ్జల.. మూడోసారి మంత్రిగా
పేరు : బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
నియోజకవర్గం: శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
పుట్టిన తేదీ: 19-04-1948
వయస్సు : 66
చదువు: బీఎస్సీ, బీఎల్
చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన బొజ్జల గతంలో చంద్రబాబు కేబినెట్‌లో రెండు పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తొలిసారిగా 1989లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1994, 1999, 2009, 2014 లో జరిగిన ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2004లో మాత్రమే ఆయన ఓటమి చెందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల .. 1996, 2001ల్లో మంత్రిగా బాధ్యతలునిర్వర్తించిన ఆయన ఇప్పుడు మరోసారి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
ఉమా.. చిరకాల వాంఛ నెరవేరింది
పేరు : దేవినేని ఉమా మహేశ్వరరావు
పుట్టిన తేదీ : మార్చి 29, 1962
వయస్సు: 52
విద్య : బీఎస్సీ, బీటెక్
నియోజకవర్గం: మైలవరం, కృష్ణా జిల్లా
సోదరుడు దేవినేని రమణ మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జిల్లా టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా రెండేసిసార్లు పదవులు నిర్వహించారు. ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొందారు. నందిగామ నియోజకవర్గం నుంచి 1999, 2004 సంవత్సరాలలోను, 2009, 2014లో మైలవరం నుంచి గెలుపొందారు. మంచి వాగ్ధాటి కల ఉమా .. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో అధికారపక్షం చేసే తప్పులను ఎండగట్టడంలో ముందుండేవారు. ఇప్పుడు తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కొల్లుకు లక్కీ చాన్స్
పేరు : కొల్లు రవీంద్ర
పుట్టిన తేదీ : జూన్ 20, 1972
వయస్సు: 44
నియోజకవర్గం: మచిలీపట్నం, కృష్ణా జిల్లా
1999నుంచి టీడీపీలో చేరి పార్టీ పటిష్ఠతకు కృషి చేశారు. రు. 2004లో ఆయన మామ నడకుదిటి నరసింహారావు పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2009లో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2009లో బందరు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.2014లో మరోసారి బందరు నుంచే పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన తొలిసారే మంత్రి పదవి చేపట్టి సంచలనం సృష్టించారు. సామాజిక సమీకరణల్లో భాగంగా ఈ యనకు ఈ అవకాశం దక్కింది.
కామినేనికి బంపర్ ఆఫర్
పేరు: కామినేని శ్రీనివాస్
పుట్టిన తేదీ : 03-12-1947
వయస్సు : 66
విద్యార్హత: ఎంబీబీఎస్
నియోజకవర్గం: కైకలూరు, కృష్ణా జిల్లా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా ఉన్నారు. ఆవిర్భావ సమయంలో మొదటి 100 మందిలో 80వ నెంబర్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. 1984లో ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కైకలూరు పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడుతో ఉన్న సాన్నిహిత్యంతో తాజా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిరు. మిత్రపక్షం కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు.
పరిటాల బ్రాండ్‌నేమ్‌తో..
పేరు : పరిటాల సునీత
పుట్టిన తేదీ : 28-5-1970
వయస్సు : 44, విద్యార్హత : ఎస్ఎస్‌సి.
నియోజకవర్గం : రాప్తాడు, అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన పరిటాల రవీంద్ర.. 2005లో హత్యకు గురవడంతో ఆయన భార్య సునీత రాజకీయ రంగప్రవేశం చేశారు. అదే సంవత్సరంలోనే జరిగిన ఉప ఎన్నికల్లో పెనుకొండ నుంచి టీడీపీ తరఫున బరిలో దిగిన సునీత విజయం సాధించారు. 2009లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. టీడీపీ తరుపున పోటీ చేసి తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ విజయం సాధించారు. వరుసగా మూడోసారి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్‌లో స్థానం సంపాదించారు.
ప్రత్తిపాటి.. తొలిసారి మంత్రిగా
పేరు : ప్రత్తిపాటి పుల్లారావు
పుట్టిన తేదీ : 29-5-1960
వయస్సు : 55, విద్యార్హత : బీకాం
అసెంబ్లీ స్థానం : చిలకలూరిపేట
1999లో టీడీపీ తరఫున రాజకీయ ఆరంగేట్రం చేశారు. చిలకలూరిపేట నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి 1999, 2009, 14 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2006 నుంచి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. గుంటూరు జిల్లానుంచి ఈసారి తీవ్ర పోటీ నెలకొనగా.. జిల్లా పార్టీ రథసారథి అయిన పత్తిపాటికి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో ఆయన తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రావెల.. అనూహ్యంగా అమాత్యపదవి
పేరు : రావెల కిశోర్ బాబు
పుట్టినతేది : మార్చి 11, 1959
వయస్సు : 55, విద్యార్హత : ఎంఏ ఎంఫిల్
నియోజకవర్గం : ప్రత్తిపాడు (ఎస్సీ), గుంటూరు జిల్లా
ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లో ప్రవేశించిన రావెళ్ల కిశోర్ టీడీపీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గంనుంచి పోటీ చేసి గెలుపొందారు. రాజకీయ నేపథ్యంలేకుండా వచ్చిన ఆయన 7 వేల మెజార్టీతో విజయం సాధించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రి వర్గంలో చంద్రబాబు స్థానం కల్పించారు. ఉన్నత విద్యావంతుడిగా, ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకు ఉన్న అనుభవం ఆయనకు మంత్రి పదవి రావడానికి దోహదం చేసింది.
శిద్దా.. తొలిసారి నెగ్గి
పేరు : శిద్దా రాఘవరావు
పుట్టిన తేదీ : 10--8-1957
వయస్సు : 56, నియోజకవర్గం : ప్రకాశం జిల్లా దర్శి
విద్యార్హతలు: డిగ్రీ(బికాం)
టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం ప్రొత్సాహంతో 1999లో టీడీపీలో చేరారు. 2004 ఎన్నికల్లో ఒంగోలు ఆసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2007నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2014 ఎన్నికలలో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షునిగా, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు.
పల్లె.. మాస్టారు మంత్రయ్యారు
పేరు : పల్లె రఘునాథ్‌రెడ్డి
పుట్టిన తేదీ : 18-4-1954
వయస్సు : 60
విద్యార్హత : ఎమ్మెస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ
నియోజకవర్గం: పుట్టపర్తి, అనంతపురం జిల్లా
రాజకీయ ఆరంగ్రేటం : లెక్చర్‌గా పనిచేస్తూ రాజకీయాల్లో ప్రవేశించిన పల్లె రఘునాథరెడ్డి అనంతపురం రాజకీయాల్లో తనకంటూ ఓప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1997 గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. 1999లో మొదటి సారిగా నల్లమాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. 2009, 2014 పుట్టపర్తి నియోజకవర్గంనుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీపట్ల నిబద్ధతతో పనిచేస్తూ ఇప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

No comments:

Post a Comment