Monday, 9 June 2014

కేసీఆర్ మహాత్ముడు

కేసీఆర్ మహాత్ముడు

Published at: 09-06-2014 08:53 AM
నిజాం తర్వాత రెండు వర్గాలు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
నమాజ్ చేశాక బాధ్యతల స్వీకారం
హైదరాబాద్, జూన్ 8: 'కేసీఆర్ ఒక మహాత్ముడు... తెలంగాణ జాతిపిత, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించారు... తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతాం' అని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీ అన్నారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిగా ఆదివారం ఉదయం 11 గంటలకు డీ బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు నమాజ్ చేసి, పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 'నిజాం కాలం తర్వాత రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజాం హయాంలో ప్రధానిగా రాజా కిషన్ పర్షాద్ పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా నాకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తా... తెలంగాణ సెక్యులర్ రాజ్యం.. సెక్యులరిజాన్ని మరింత బలోపేతం చేస్తా' అని ప్రకటించారు. '14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది...నాకిచ్చిన పదవిని మరింత బాధ్యతతో నిర్వర్తిస్తా' అని చెప్పారు. 'శాఖలో ఉద్యోగులందరితో కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తా, పేద ప్రజలకు మరింత మెరుగైన పద్ధతిలో సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటాం' అని ప్రకటించారు. 'ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అంటూ అంతరాలు పెంచొద్దు, పాతబస్తీ అంటూ వెనక్కినెట్టొద్దు... పాతబస్తీలో అంతరాలు నివారిస్తా. రెవెన్యూలో చాలా సమస్యలున్నాయి... వీటినన్నింటికీ పరిష్కారం చూపుతా. ఖాళీలను భర్తీ చేస్తాం, ప్రజలకేం సమస్య ఉన్నా... నేరుగా నా దృష్టికి తేవొచ్చు' అని చెప్పారు. 'రాబోయే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం' అన్నారు. కాగా.. మహమూద్ అలీ చాంబర్‌లో మహాత్మగాంధీ, కేసీఆర్ ఫొటోలు పక్కపక్కనే కన్పించాయి.

No comments:

Post a Comment