Sunday 22 June 2014

పుట్టుకే ప్రాతిపాదిక

పుట్టుకే ప్రాతిపాదిక

Published at: 23-06-2014 04:59 AM
విద్యార్థితోపాటు తండ్రి కూడా ఇక్కడే పుట్టి ఉండాలి!
అప్పుడే రీయింబర్స్‌మెంట్,
ఉపకార వేతనాలు?
విధివిధానాలను
పరిశీలిస్తున్న టీ-సర్కారు
కమిటీ నివేదిక
ఆధారంగానే కొత్త పాలసీ
ఈ పాస్ సాఫ్ట్‌వేర్‌లోనూ
వడపోత మార్పులు
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): బోధన ఫీజులు, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఉపకారవేతనాల చెల్లింపునకు నూతన విధానం తీసుకురావడానికి రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో తెలంగాణ బిడ్డలకే ఫీజులు అన్న ప్రధాన నినాదంతో ఈ విధానం పురుడు పోసుకుంటున్నట్లు తెలిసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన అఖిలపక్ష భేటీలో ఫీజుల చెల్లింపు విధానంపై వెలువడిన అభిప్రాయాలు, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రామాణికంగా తీసుకొని అధికారులు ఫీజుల విధానంపై అధ్యయనం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన అత్యున్నత స్థాయి భేటీలోనూ ఫీజులు ఎవరికి అమలు చేయగలమో పరిశీలన చేయండి'' అని ప్రభుత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత అధికారుల బృందం ఫీజుల చెల్లింపు విధానాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా తెలంగాణ బిడ్డలు ఎవరో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నిజానికి స్థానికతతోపాటు ఇతర అంశాలను నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించాలనుకున్నారు. వివిధ వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.... తొలుత అధికారుల స్థాయిలోనే ఒక నివేదికను రూపొందించాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై రెండు భేటీలు జరిగినట్లు తెలిసింది. స్థానికతను తేల్చడానికి విద్యార్థి తోపాటు తండ్రి జన్మస్థలాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనుకుంటున్నారు. దీని వల్ల తెలంగాణ విద్యార్థులు ఎవరు? ఇతర రాష్ట్రాల వారెవరు? అనే విషయంపై స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు. "విద్యార్థి తల్లిదండ్రులు తెలంగాణలోనే జన్మిస్తే ఆ విద్యార్థి తెలంగాణ బిడ్డే. తల్లిదండ్రులది ఇతర రాష్ట్రాలై, వారి పిల్లలు హైదరాబాద్‌లోనో మరో ప్రాంతంలోనో జన్మిస్తే? ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. ఈ కోవకు చెందిన విద్యార్థులను నాన్‌లోకల్‌గా చూడాలా? లేక తెలంగాణ బిడ్డలుగానే పరిగణించాలా? వంటి సందేహాలపై అధికారులు నిశ్చితాభిప్రాయానికి రాలేకపోతున్నారు. అఖిలపక్షంలో వచ్చిన సూచనల ఆధారంగా, ఈ కోవకు చెందిన విద్యార్థులను తెలంగాణేతరులుగానే చూడాలని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. " ఓ మరాఠీ కుటుంబం బ్రతుకుదెరువుకోసం పదేళ్లక్రితం తెలంగాణకు వ స్తే వారికి ఇక్కడే కలిగే సంతానం తెలంగాణ బిడ్డలవుతారా? ఓ గోదావరి జిల్లాకు చెందిన కుటుంబం ఉద్యోగ రీత్యా 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు బదిలీపై వచ్చి ఇక్కడ పనిచేస్తుండగా వారికి ఇక్కడ కలిగే సంతానం తెలంగాణ బిడ్డలేనా? ఈ సమస్యలపై స్పష్టత ఉంటేనే ఫీజుల పథకం సవ్యంగా అమలు చేయగలం. తెలంగాణ వారికే ఫీజులు అని ప్రభుత్వం మాకు స్పష్టం చేసింది కాబట్టి... తెలంగాణ వారెవరో తేల్చడం మా పని'' అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. నూతన ఫీజుల చెల్లింపు విధానంలో అనేక ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, స్థానికత అంశం ఆధారంగా ఈపాస్ డాట్ కామ్‌లో కీలక మార్పులు తీసుకురాబోతున్నారు.
ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి బోధనా ఫీజు, ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి స్థానికత అంశంగా ఉండేది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌కు ఆయా రాష్ట్రాలే స్థానికత అవుతాయి. అయితే, విద్యార్థుల స్థానికతను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విద్యార్థితోపాటు, తండ్రి స్థానికత ««ద్రువీకరణ పత్రాన్ని కూడా దరఖాస్తు ఫారంతో పాటు ఈపాస్‌డాట్‌కామ్‌కు అప్‌లోడ్ చేసేలా సాప్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నారు. దరఖాస్తు అప్‌లోడ్ చేయగానే ఆ విద్యార్థి తెలంగాణ ప్రాంతానికా లేక ఆంధ్రా ప్రాంతానికి చెందినవారా అని తెలుసుకునేందుకు వీలుగా స్థానికతపై రెండు అప్షన్లు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. " తండ్రి స్థానికత, విద్యార్థి స్థానికత రెండూ ఒకటే అయితే ఒకలా, తండ్రిది ఒక రాష్ట్రం విద్యార్థి నేటివిటీ మరో రాష్ట్రమైతే స్థానికత మరోలా వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను అందించడమేకాక ఈపాస్‌ను పర్యవేక్షిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)తో కూడా ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది. నిజంగా ఇది అమల్లోకి వస్తే దరఖాస్తుల దశలోనే పెద్ద వడపోత జరగనుంది. తెలంగాణ బిడ్డలు ఎవరు? ఇతరులు ఎవరో స్పష్టంగా తేలిపోతుంది. ఇందుకోసం విద్యార్థుల నుంచి తాజా స్థానికత సర్టిఫికెట్లు కోరాలని అధికారులు భావిస్తున్నారు. స్థానికత సర్టిఫికెట్ల జారీలో మీ సేవా కేంద్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
ఈ మేరకు ఈ పాస్‌డాట్‌కామ్‌లోనూ తాజా స్థానికత సర్టిఫికెట్లు మాత్రమే స్వీకరించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2013 లేదా అంతకన్నా పాత స్థానికత సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేస్తే వాటిని పరిగణించకుండా.. 2014 సర్టిఫికెట్లనే అనుమతించేలా మార్పులు చేయాలని భావిస్తున్నారు. రేషన్‌కార్డును కూడా తప్పనిసరి చేయనున్నారు. ఇక ఇప్పటికే విద్యాసంస్థల్లో ప్రవేశాల విధానం వేరు, బోధనా ఫీజుల అంశం వేరని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
రెన్యువల్ విద్యార్థుల సంగతేంటి?: ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు, స్థానికత అంశంపై అధికారులు కొన్ని గణాంకాలు రూపొందించారు. 2013-14లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రవేశాల మేరకు తెలంగాణలో 24,199 మంది ఆంధ్రా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి ఫీజు దాదాపు రూ.140 కోట్లు ఉంటుందని అంచనావేశారు. వృత్తివిద్యాకాలేజీల్లో ప్రవేశాలు పొందిన ఆంధ్రా విద్యార్థులు మరో రెండుమూడేళ్లు తెలంగాణలోనే చదువుకోవాల్సి ఉంటుంది. వారి ఫీజులు, ఉపకారవేతనాలు ఎవరు చెల్లించాలన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏపీప్రభుత్వమే ఆ ఫీజులు చెల్లించాలని తెలంగాణ అధికారులు గట్టిగా చెబుతున్నారు. సీఎస్ఎస్( కేంద్ర ప్రాయోజిత పథకాలు) కింద వారి ఫీజులు తెలంగాణ ప్రభుత్వమే భరించాలని ఏపీ అధికారులు చెబుతున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే నూతన ఫీజుల విధానంలో రెన్యువల్ విద్యార్థుల ఫీజుల చెల్లింపుపై ఏం నిర్ణయిస్తారో చూడాల్సిందే.

No comments:

Post a Comment