Friday, 20 June 2014

జాతీయ విద్యా సంస్థలకు భూమి కోసం అన్వేషణ

జాతీయ విద్యా సంస్థలకు భూమి కోసం అన్వేషణ

Published at: 21-06-2014 08:23 AM
హైదరాబాద్, జూన్ 20: ఆంధ్రప్రదేశ్‌లో 11 జాతీయ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి కోసం అధికార యంత్రాంగం అన్వేషణ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్రాన్ని మూడు సర్క్యూట్లుగా విభజించి జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. విశాఖపట్నం, కృష్ణా-గుంటూరు, తిరుపతి కేంద్రాల పరిధిలో ఇవి ఉంటాయని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం, ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు భూసేకరణకు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కూడా భూసేకరణపై ఉన్నత విద్యాశాఖను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహాని, పలువురు ఉన్నతాధికారులతోపాటు విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ జిల్లాలో ఎంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందో కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 22లోగా భూములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్లు చెప్పారు. ఈ సమాచారం రాగానే ఈ నెల 23న ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఎయిమ్స్ నిర్మిస్తాం.. 250 ఎకరాలు ఇవ్వండి

Published at: 21-06-2014 08:23 AM
న్యూఢిల్లీ, జూన్ 20: ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో 10 రాష్ట్రాల్లో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తరహా ఆస్పత్రుల నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపట్టింది. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా, గుజరాత్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాల్లో ఆస్పత్రుల్ని నిర్మిస్తామంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖలు రాసింది. అయితే, ఇందుకుగాను ఒక్కో రాష్ట్రం ఉచితంగా 250 ఎకరాలకు పైగా స్థలాన్ని ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. ఆ స్థలానికి తగినంతగా విద్యుత్, నీటి సరఫరా ఉండేలా చూడాలని కోరింది. నెల రోజుల్లోగా స్థలాలను గుర్తించి తెలియజేయాలని, వాటిని పరిశీలించేందుకు బృందాలను పంపిస్తామని పేర్కొంది.

No comments:

Post a Comment