Monday 16 June 2014

60 వేల ఎకరాల కోసం 70 వేల ఎకరాలను ముంచుతారా?

60 వేల ఎకరాల కోసం 70 వేల ఎకరాలను ముంచుతారా?

Published at: 16-06-2014 04:24 AM
హైదరాబాద్: అరవై వేల ఎకరాలకు నీరందించే పోలవరం ప్రాజెక్టు కోసం 70 వేల ఎకరాల భూమిని ముంచుతారా? అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. ఇంతటి అన్యాయమైన ప్రాజెక్టును వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర స్థాయి విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఎల్‌బీనగర్‌లోని త్రివేణి జూనియర్ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, 3లక్షల మంది గిరిజన, ఆదివాసీలను నిర్వాసితులను చేసే పోలవరం ప్రాజెక్టును తెలంగాణ సమాజం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం డిజైన్ మార్చటం వల్ల ఖర్చు తగ్గటంతో పాటు ముంపు ప్రాంతాలు తగ్గుతాయన్నారు. తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ముంపు ప్రాంతాలున్నాయని, ఆ ప్రాంతాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. సంపూర్ణ తెలంగాణ రాలేదని, ఉమ్మడి రాజధాని, పోలవరం అంశం, ఆస్తుల పంపకాలు ఇంకా వివాదంగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఈ నెల 21న ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలకు ఢిల్లీ నుంచి రిటైర్డు ఐఏఎస్ అమితావ్ పాండే హాజరవుతున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. దళితులు, ఆదివాసీలు, ఉద్యమ సంఘాలతో కలిసి పోలవరం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.

No comments:

Post a Comment