భూములు లెక్క తేలుద్దాం!
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పది జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూములు వెతికే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. భూములు ఏ దశలో ఉన్నాయి... వేటిలో నిర్మాణాలున్నాయి.. ఏయే భూములు ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరించాలని పది జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం(యూఎల్‌సీ) పరిధిలోని భూములతోపాటు అన్ని రకాల భూముల ఆచూకీ కనిపెట్టాలని నిర్దేశించింది. సర్వేను ఏకకాలంలో కాకుండా దశలవారీగా చేపట్టాలని కోరింది. అయితే ప్రభుత్వం దృష్టి తొలుత హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలపైనే ఉంది. ఈ జిల్లాల్లో భూముల సర్వే పూర్తయితే చాలా వరకు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం భూముల సర్వేను రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు. 15 మంది సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లతో కూడిన బృందాన్ని ఇప్పటికే జిల్లాకు పంపించారు. వీరి చేతికి ప్రభుత్వ భూములు ఉన్న సర్వే నెంబర్లు, రెవెన్యూగ్రామాల చిట్టాను పెట్టి, భూముల వేటకు పంపనున్నారు. వీరే కాకుండా జిల్లాకు చెందిన సిబ్బంది కూడా ఈ సర్వేలో పాలుపంచుకోనున్నారు. హైదరాబాద్‌లో పని ముగించుకున్న తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఈ బృందం పర్యటించనుంది. ప్రతి జిల్లాల్లో పదిరోజుల పాటు సర్వేలు జరుగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సర్వే పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆ రెండు జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌కలెక్టర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం. సర్వే పూర్తి చేసి జూలై 5 నాటికి నివేదికను సిద్ధం చేయాలని హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ భూముల వివరాలు సిద్ధంగా ఉన్నాయి. ల్యాండ్ ఆడిట్ కింద జిల్లాలో భూముల వివరాలన్నీ యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. అయితే మిగులు భూముల వివరాలను మాత్రం సేకరించాల్సి ఉంది.
No comments:
Post a Comment