Monday 9 June 2014

సెంటిమెంట్.. సీనియారిటీ..

సెంటిమెంట్.. సీనియారిటీ..

Published at: 09-06-2014 08:59 AM
డిప్యూటీ సీఎంలుగా రాజప్ప, కేఈ ఎంపిక నేపథ్యం
సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు పెద్దపీట
సమీకరణాలు కుదరక కడపకు చాన్స్ మిస్
పరుగెత్తే జట్టు కోసం కొత్తవారికి అవకాశం
హైదరాబాద్, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైన చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తిల ఎంపికకు ప్రాంతీయ సమీకరణాలు దోహదం చేశాయి. కాపు, బీసీ వర్గాల నుంచి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించారు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాలనుంచే ఆ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు అనుకోవడంతో చిన రాజప్పకు అవకాశం వచ్చింది. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి పదహారు సంవత్సరాలుపాటు అధ్యక్షుడిగా పనిచేయడం, పార్టీని ఏనాడూ వీడకుండా అంకితభావంతో ఉండటం ఈ పదవి దక్కడానికి దారితీశాయి. అదే జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు పార్టీలో అత్యంత సీనియర్ అయినా కాపులకు అక్కడినుంచే ఇవ్వాలన్న అభిప్రాయంతో రాజప్పకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండటం సాధ్యం కాకపోవడంతో యనమల అవకాశం కోల్పోయారు. రాయలసీమలో ఉన్న మరో సీనియర్ బీసీ నేత కేఈ కృష్ణమూర్తికి ఆ అవకాశం వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేఈకి రాయలసీమలో పోటీ లేదు. తన మంత్రివర్గ సభ్యుల ఎంపికలో చంద్రబాబు సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ సమతూకం కోసం ప్రయత్నం చేశారు. టీడీపీ కోటా కింద తీసుకున్న పదిహేడు మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ వర్గాలకు చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు.
మిగిలిన తొమ్మిది మందిలో కమ్మ మూడు, కాపు మూడు, రెడ్డి రెండు, ఒక వైశ్య కులం వారు ఉన్నారు. బీసీల్లో కొప్పుల వెలమ, తూర్పు కాపు, గౌడ, యాదవ, మత్స్యకార వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. ఎస్సీల్లో మాదిగ, మాల ఉప కులాలు రెంటికీ చెరొకటి ఇచ్చారు. ఎస్టీల నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కొత్త కావడంతో ఆయనకు కొంతకాలం ఏదైనా కార్పొరేషన్ పదవి ఇచ్చి తర్వాత మంత్రి పదవి ఇచ్చే యోచనతో పక్కన ఉంచారు. మొత్తంగా రాయలసీమకు నాలుగు, ఉత్తరాంధ్రకు నాలుగు, ఉత్తర కోస్తాకు నాలుగు, దక్షిణ కోస్తాకు ఏడు మంత్రి పదవులు లభించాయి. రాయలసీమలో ఒక్క కడప జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. అక్కడ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మొదటిసారి గెలిచిన వారు కావడంతో ప్రస్తుతం అవకాశం ఇవ్వలేదు. మంత్రుల ఎంపికలో కొన్ని ఆసక్తికర సమీకరణాలు ప్రభావం చూపాయి. గౌడ సామాజిక వర్గం నుంచి కేఈ కృష్ణమూర్తికి అవకాశం రావడంతో అదే సామాజిక వర్గంలోని సీనియర్లు గౌతు శివాజీ, కాగిత వెంకట్రావులకు అవకాశం రాలేదు. కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ కోటా నుంచి ఇచ్చే మంత్రి పదవులు మూడుకు మించకుండా చూసుకోవాలని చంద్రబాబు అనుకోవడంతో ఆ సామాజిక వర్గంనుంచి ఆశలు పెట్టుకొన్న బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ, దామచర్ల జనార్దన్, కె. రామకృష్ణ వంటివారికి అవకాశం రాలేదు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఇద్దరికి మించకుండా చూసుకున్నారు.

No comments:

Post a Comment