Monday, 16 June 2014

ఎక్కడిదాకా వెళ్తానో చూస్తారా?

ఎక్కడిదాకా వెళ్తానో చూస్తారా?

Published at: 16-06-2014 05:27 AM
కోల్‌కతా, జూన్ 15: బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ప్రతిస్పందనగా ఆ పార్టీ రెండు బృందాల నాయకులను పంపించడంతో చిరాకెత్తిపోయిన ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. తాను కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో తెలుసుకునేందుకు తమ ఎంపీల బృందాన్ని పంపుతానని హెచ్చరించారు. "ఇక ఇప్పటి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలాంటి దాడులేమైనా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు తృణమూల్ పార్టీ తరఫున నేను కేంద్ర బృందాన్ని పంపుతాను. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు వారేం చేస్తున్నారో అదే నేను చేస్తాను. అల్లర్లను రేకెత్తించడానికి ఆ పార్టీ సీపీఎం గూండాలతో చేతులు కలిపిందనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో దానిని సహించలేము'' అంటూ ఆమె మండిపడ్డారు. తాను తమ పార్టీ 46 ఎంపీలనూ ఢిల్లీకి పంపుతానని అన్నారు. 'నేనెక్కడి దాకా వెళ్తానో చూడాలనుందా?' అని బీజేపీపై ఆమె విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆ పార్టీ.. కాంగ్రెస్ లాగానే వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు మమతదే బాధ్యతని, దానిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇది స్వతంత్ర దేశమని, ఆమె ఏదనుకుంటే అది చేసుకోవచ్చని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై ఇలాగే దాడులు కొనసాగి, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేంద్రం చర్యలు తీసుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.

No comments:

Post a Comment