ముహూర్తం చూసుకుని ముందుకు!
ప్రభుత్వ ఏర్పాటు నుంచి అసెంబ్లీ సమావేశాల వరకూ.. ఆంధ్రప్రదేశ్ సర్కారు అన్నీ శుభముహూర్తాలనే ఎంచుకుని కార్యక్రమాలను చేపడుతోంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నుంచి.. ఫైళ్లపై తొలి సంతకం, అధికార నివాసమైన లేక్‌వ్యూలోకి అడుగు పెట్టడం వరకూ అన్నీ వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకే జరిగాయి. మంత్రులూ తమకు కేటాయించిన చాంబర్లలోకి సుముహూర్తాల్లో అడుగుపెడుతున్నారు. ఇక.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం, సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా అలాగే జరిగాయి. సభాపతి పీఠంపై కోడెల శివప్రసాద్‌ను కూడా ముహూర్తబలం చూసే కూర్చోబెట్టారు. డిప్యుటీ స్పీకర్‌గా మండలి బుద్ధప్రసాద్ కూడా నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తం చూసుకున్నారు. శాసనమండలి సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయని గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేసినా.. ఇదే సమయానికి ఉభయ సభలను ఉద్దేశించి ఆయన చేసే ప్రసంగం విషయంలో మళ్లీ మంచి సమయాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ఉంటుంది. కానీ ఈసారి ఆ సమయాన్ని ఉదయం 8.52 గంటలకు.. అందుకు అనుగుణంగా శాసనసభ భేటీని 9 గంటలకు బదులు 8.50కి మార్చారు.
No comments:
Post a Comment