Monday 16 June 2014

ప్రతిపాదనలు మళ్లీ ఇవ్వండి

ప్రతిపాదనలు మళ్లీ ఇవ్వండి

Published at: 17-06-2014 04:00 AM
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపాదనలను విడివిడిగా సేకరించాలని 14వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. తాజా ప్రతిపాదనలను జూలైనాటికి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. వాస్తవానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలోనే ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు అందాయి. అయితే, సంఘం కాలపరిమితి వచ్చే సెప్టెంబరుతో ముగుస్తోంది. ఆలోగా అన్ని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం నివేదికను ఇవ్వాల్సి ఉంది. కానీ, ఈలోగా రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. దాంతో, రెండు రాష్ట్రాల నుంచి విడివిడిగా ప్రతిపాదనలను తీసుకోవాల్సి వచ్చింది. ఆగస్టు రెండో వారంలో ఆర్థిక సంఘం చైర్మన్ రెండు రాష్ట్రాలకు విచ్చేసి.. ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం కాబోతున్నారు. దానికి సన్నాహకాలు, కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి ఆర్థిక సంఘ ప్రతినిధులు ఝా, చక్రవర్తి తదితరులు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ ఆర్థిక, ఇతర శాఖల అధికారులను సోమవారం కలుసుకున్నారు.
జూలై నెలాఖరుకల్లా ప్రతిపాదనలను తమకు అందజేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు, రెవెన్యూ ఆదాయ మార్గాలు, వనరులు, రెవెన్యూ వ్యయం, అవసరాలు, ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయంలో ప్రభుత్వ సిబ్బంది వేతనాల భారం, పింఛన్‌దారుల భారం.. ఇతర సంక్షేమ పథకాల భారం, తదితర అంశాలన్నింటిపైనా ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని వివరించారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎలా ఉండాలి? స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపైనా ప్రతిపాదనలను అందజేయాలని సూచించారు. విభజన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? బడ్జెట్ ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి? వంటి అంశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం తెలపాల్సి ఉంటుంది. వాస్తవానికి, రాష్ట్ర విభజన ముందు వరకు అంటే తెలంగాణ అపాయింటెడ్ డే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చమురు తదితర కంపెనీలు ఎక్కడ అమ్మకాలు జరిపినా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న తమ తమ కార్పొరేట్ కార్యాలయాల నుంచే అమ్మకపు పన్నును చెల్లించాయి. విభజన తర్వాత ఏ రాష్ట్రంలోని అమ్మకపు పన్నును ఆ రాష్ట్రంలోనే చెల్లిస్తారు. కనక, ఈ పరిణామం తెలంగాణ రెవె న్యూ ఆదాయంలో ఎంత ప్రభావం చూపుతుందని కూడా అంచనా వేయాలని సంఘ ప్రతినిధులు సూచించారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గత ఐదేళ్ల ప్రాతిపదికగా ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తు రెవెన్యూ అవకాశాలు, వ్యయ భారాలను అంచనా వేసి ప్రతిపాదనలను తయారు చేయడం ఇప్పటి వరకు అనుసరిస్తున్న సంప్రదాయమని, ప్రస్తుతం రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినందున.. ప్రతిపాదనలను ఎలా తయారు చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు ప్రశ్నించారు. దానిపై తమకు కూడా ఎలాంటి అవగాహన లేదని, ఈ అనుభవం తమకు కూడా కొత్త కాబట్టి.. రాష్ట్ర అధికారులే వాస్తవిక అంచనాలను తయారు చేసి ఇవ్వాలని సూచించారు.

No comments:

Post a Comment