Monday, 16 June 2014

సీఎం పదవి ముళ్ల కిరీటమే

సీఎం పదవి ముళ్ల కిరీటమే

Published at: 17-06-2014 04:38 AM
అనాథలా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్
సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటా...అభివృద్ధి చేస్తా
కుప్పం పర్యటనలో చంద్రబాబు
(ఆంధ్రజ్యోతి-చిత్తూరు)
"కాంగ్రెస్ కుట్ర రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ అనా«థగా ఆవిర్భవించింది. సచివాలయంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలియదు. రాజధాని ఎక్కడో తెలియదు. వాటికి తోడు సాగునీటి సమస్యలు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులవుతున్నా నాకు ఇంత వరకూ హైదరాబాదులో కార్యాలయం లేదు. అయినా అధైర్యపడవద్దు. పునాది నుంచీ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం'' అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం తొలిసారి సొంత జిల్లాకు వచ్చారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె, కుప్పంలో జరిగిన బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించారు. అందరూ భావించే విధంగా ముఖ్యమంత్రి పదవి స్వర్ణ కిరీటమేమీ కాదని అదో ముళ్ల కిరీటమని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అన్నీ సమస్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వనరులు లేవని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా ఉందని పేర్కొన్నారు. విభజనతో అనేక ఇబ్బందులు, సమస్యలు తలెత్తాయన్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరీ నదులున్నా సాగునీటి కష్టాలు తప్పవని చెప్పారు. రాష్ట్రాన్ని పునాదుల నుంచీ నిర్మించుకోవాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్నారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు అనేక హామీలిచ్చానని గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకుంటానని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 22న రుణమాఫీ విషయమై రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నానని, అటు తర్వాత ఢిల్లీకి వెళ్లి రిజర్వు బ్యాంకు అధికారులతో కూడా చర్చిస్తానన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
కుప్పం ప్రజలపై వరాల జల్లు

కుప్పం ప్రజలపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. పాతికేళ్లుగా రాజకీయంగా తనకు మద్దతిచ్చి గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమాన్ని, పథకాన్నీ చేపట్టాలన్నా తొలుత కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించారు. గతంలో అమలైన త్రీ కేఆర్ ప్రాజెక్టు కింద రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మంచి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, పొరుగునే ఉన్న తమిళనాడుకు రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తానని హామీలిచ్చారు.


ఆంధ్ర ముఖ్యమంత్రి పదవి ఓ ముళ్ల కిరీటం, డ్వాక్రా సంఘాల రుణాలు, రైతు రుణాలు మాఫీచేస్తా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా:బాబు

Published at: 16-06-2014 17:53 PM
రామకుప్పం, జూన్ 16 : ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటం వంటిదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా సోమవారం సొంత నియోజకవర్గం రామకుప్పం పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆర్థిక వనరులు లేవని, జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవని, కష్టపడి డబ్బులు సంపాదించాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ... ప్రజల జీవితాలు బాగు పడాలంటే చాలా చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు.
కష్టపడడం తనకు కొత్తకాదని, 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంలో మనం భాగస్వాములమని, కేంద్ర సహకారం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేయాలంటే దానికి నిధులు కావాలని, సహకరించే విధానం కావాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల ఆశీస్సులు కావాలని, నిండు మనసుతో సహకరించాలని ఆయన కోరారు.
డ్వాక్రా సంఘాలకు అండగా ఉంటానని, రైతుల రుణ మాఫీతో సహా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని చంద్రబాబు నాయుడు మరొకసారి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలవల్ల ప్రజలు పూర్తిగా చితికిపోయారని, నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తానని, రైతులకు రుణ మాఫీ చేసి పూర్తిగా ఆదుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పేదవాళ్లకోసం చాలా హామీలు ఇచ్చానని, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ ఇప్పిస్తామని ... అన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు మరోసారి హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన హామీలు అమలు చేస్తాను తప్ప వెనుతిరిగేది లేదని ఆయన స్పష్టం చేశారు. శరీరంలో చివరి రక్తం బొట్టు ఉన్నంతవరకు రైతాంగానికి న్యాయం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకుని ఏపీని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. నీరు-మీరు కార్యక్రమంతో కరువును ఎదుర్కొంటామని బాబు వెల్లడించారు.

No comments:

Post a Comment