Monday 16 June 2014

చండీగఢ్ మాకే కావాలి.. పంజాబ్, హర్యానాల మధ్య ఎడతెగని వివాదం

చండీగఢ్ మాకే కావాలి.. పంజాబ్, హర్యానాల మధ్య ఎడతెగని వివాదం

Published at: 16-06-2014 04:22 AM
చండీగఢ్... దేశంలోనే సుందర నగరం. ప్రణాళికబద్ధమైన నిర్మాణానికి ఈ నగరం ఓ తిరుగులేని ప్రతీక. పరిశుభ్రత, హరిత శోభకు పెట్టింది పేరు. ఈ కేంద్రపాలిత ప్రాంతం పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధాని. అంతేకాదు... ఈ నగరం మాదంటే... మాదేనంటూ నాలుగున్నర దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదానికి కేంద్రబిందువు. ఈ పోరుకు ముగింపు పలకటం ఎలాగో కేంద్రంసహా ఏ వ్యవస్థకూ సాధ్యంకాక పరిష్కారాన్ని కాలానికే వదిలేసిన పరిస్థితి. ఫలితంగా అప్పుడప్పుడూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేగుతూండటం పరిపాటిగా మారింది. ఈ గొడవ ఎప్పటికి తెగుతుందో కాలమే చెప్పాలి.
పుట్టుపూర్వోత్తరాలేమిటి?
దేశ విభజన (1947) తర్వాత పంజాబ్ రాజధానిగా ఉన్న లాహోర్ నగరం పాకిస్థాన్‌లో భాగమైపోయింది. దీంతో పంజాబ్ నవ్య రాజధాని నిర్మాణానికి భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సంకల్పించారు. దీన్ని భవ్య రీతిలో తీర్చిదిద్దే బాధ్యతను ప్రసిద్ధ ఫ్రాన్స్ వాస్తు నిర్మాణ శిల్పి లీ కార్బూసియర్‌కు అప్పగించారు. లాహోర్‌ను పోగొట్టుకున్న బాధాకర చారిత్రక జ్ఞాపకాన్ని తుడిచిపెట్టే రీతిలో భవిష్యత్తు కు ఆదర్శంగా నిలిచేదిగా కొత్త నగరాన్ని అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఆ మేరకు 1950 దశకంలో శివాలిక్ పర్వతపాదాల చెంత మొదలైన నగర నిర్మాణం 114 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అపూర్వ నిర్మాణ శైలితో చండీగఢ్ రూపుదాల్చింది. సమీపంలోని పురాతన చండీమాత ఆలయం ప్రతీకగా ఈ పేరు ఖరారైంది.
అటుపైన ఏం జరిగింది?
కాలక్రమంలో పంజాబ్ రాష్ట్ర విభజన కోరుతూ ఆందోళన ప్రారంభమైంది. ప్రజాకాంక్ష మేరకు కేంద్రం షా కమిషన్‌ను నియమించింది. దాని సిఫారసు మేరకు 1966 నవంబరు 1న హిందీ భాష మాట్లాడేవారిని వేరుపరుస్తూ హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో అంబాలా జిల్లా నడిబొడ్డున ఉన్న చండీగఢ్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది. ఆలోగా కొత్త రాజధాని నిర్మాణం కోసం పంజాబ్‌కు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామన్న కేంద్రం 45 ఏళ్లుగా నానుస్తూనే ఉంది. ఈలోగా చండీగఢ్‌పై హక్కు మాదేనంటూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది. ఉద్రిక్తతలు ఎంతకూ ఉపశమించకపోవడంతో ఓ సందర్భంలో చండీగఢ్‌ను రెండు ముక్కలు చేసి, రెండు రాష్ట్రాలకు చెరో భాగం ఇచ్చే ప్రతిపాదన వచ్చింది. నగరాన్ని పంజాబ్‌కు ఇచ్చేసి, రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలను హర్యానా రాష్ట్రానికి దఖలుపరచాలన్న మరో ప్రతిపాదనా వినిపించింది. కానీ, హర్యానావాసులు "చండీగఢ్ హమారా హై, సారేకీ సారా హై'' (చండీగఢ్ పూర్తిగా మాదే. మొత్తానికి మొత్తంమీద మాకే హక్కుంది) అంటూ నినదించారు.
ఆందోళనల స్వరూప స్వభావాలేమిటి?
చండీగఢ్ కోసం రెండు రాష్ట్రాల్లోనూ పోరాటం తీవ్రంగానే సాగింది. పంజాబ్‌లో 84 ఏళ్ల దర్శన్ సింగ్ ఫెరుమాన్ ఆమరణ దీక్ష చేపట్టారు. 74వ రోజున ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తుదిశ్వాస విడిచారు. హర్యానాలోనూ ఉదయ్ సింగ్ మాన్ నిరవధిక నిరశన చేపట్టారు. కానీ, సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్న హామీతో దీక్ష విరమించారు. అయినా ఆ చిచ్చు నేటికీ రగులుతూనే ఉంది. - సెంట్రల్ డెస్క్
తాజా పరిస్థితులు. పరిణామాలేవమిటి?
ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా చండీగఢ్‌ను పంజాబ్‌కే ఇవ్వాలంటూ ఎస్ఏడీ అధినేత, ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ శుక్రవారం విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎస్ఏడీ, బీజేపీకి మిత్రపక్షం కావడంతో దీనిపై ఎక్కడ సానుకూల స్పందన వెలిబుచ్చుతుందోనని హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హుడా ఆందోళనకు గురయ్యారు. "చండీగఢ్ హమారా థా, హమారా హై, ఔర్ హమారా హీ రహేగా'' (చండీగఢ్ ఎప్పట్నుంచో మాదే. ఇప్పుడూ మాదే... ఎప్పటికీ మాదిగానే ఉంటుందంతే) అంటూ గర్జించారు. "పంజాబ్ కొత్త రాజధాని నిర్మించాలని సిద్ధమైంది. చాలా కార్యాలయాలను మొహాలీకి తరలించింది. ఆ నగరానికి 'న్యూ చండీగఢ్'గా పేరు పెట్టాలని నిర్ణయించిందట. అది అనైతికం. ఆ పేరుమీద పూర్తి హక్కు హర్యానాదే. వాళ్లు మరో పేరు పెట్టుకోవాల్సిందే'' అన్నారు. "రాష్ట్ర విభజనకు ముందు అంబాలా జిల్లాలో భాగంగా ఉందికనుక చండీగఢ్ మాదేనని పంజాబ్ అంటోంది. అంబాలా ఇప్పుడు హర్యానాలో భాగం. లాహోర్, సిమ్లా కూడా ఒకప్పటి పంజాబ్ రాజధానులే. వాటిపై హక్కును ఎందుకు కోరడం లేదు?'' అని ప్రశ్నించారు.

No comments:

Post a Comment