Monday 16 June 2014

ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికం

ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికం

Published at: 17-06-2014 04:40 AM
జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
కేబుల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
తెలంగాణ వారి గుత్తాధిపత్యమా?: ఐజేయూ నేత అమర్
ప్రసారాల నిలిపివేత ప్రజాస్వామ్యానికే విఘాతం
ఇసుక,మద్యం మాఫియాల్లా ఎంఎస్‌వోల మాఫియా...!
ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి ఆందోళన
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని తెలంగాణ ఎంఎస్‌వోలు తీసుకున్న నిర్ణయాన్ని పలు పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని.. ఇది భావప్రకటన స్వేచ్ఛకు తీవ్రవిఘాతం కలిగించడమేనని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు.. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం.. భారత రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిని భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.శేఖర్, విరాహత్ అలీ అందులో పేర్కొన్నారు. టీవీ చానెళ్ల ప్రసార నాణ్యత, మంచిచెడ్డలను నిర్ణయించే అధికారాలను ఎంఎస్‌వోలు సొంతం చేసుకునే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకుని ప్రసారాలను పునరుద్ధరించాలని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎంఎస్‌వో వ్యవస్థపై, గుత్తాధిపత్యంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో.. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సిఫారసుల పూర్వరంగంలో.. తెలంగాణ ఎంఎస్ఓల చర్య ప్రమాదఘంటికలనుమోగిస్తున్నట్లవుతుందని, ఈ ధోరణి భావప్రకటనా స్వేచ్ఛకు తీవ్ర నష్టం చేస్తుందని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రకటనలో వివరించాయి. ఇక.. మాఫియాలా తయారై వ్యవస్థను శాసిస్తున్న కేబుల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.టీవీ ప్రసారాల నిలిపివేతపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న ప్రజాసంఘాలు, జర్నలిస్టు యూనియన్లు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పత్రికల ప్రచురణల్లో, టీవీ ప్రసారాల్లో అసత్యాలుంటే ప్రభుత్వాలు ఖండించవచ్చని.. తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయలేదని ఐజేయూ నేత దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రమంటే ఎంఎస్‌వోల గుత్తాధిపత్యమా అని ప్రశ్నించారు. మద్యం ఇసుక మాఫియాల్లా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎంఎస్‌వోలను కట్టడి చేయకపోతే టీవీ యాజమాన్యాలను బ్లాక్‌మెయిల్ చేసినట్లే ప్రభుత్వాలనూ బ్లాక్‌మెయిల్ చేస్తాయని ఐజేయూ నేత శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై ఏబీఎన్ ఎలాంటి వార్తా ప్రసారం చేయకపోయినా.. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైందన్న అక్కసుతో ఆ చానెల్ ప్రసారాలు నిలిపివేయడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. పౌరులకు సమాచారం తెలుసుకునే హక్కుందని, ప్రసారాలను ఆపేసిన ఎంఎస్‌వోల పై చర్యల తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రసారాలను నిలిపివేసే హక్కు ఎంఎస్‌వోలకు ఎక్కడిదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు అమర్‌నాథ్ ప్రశ్నించారు. వెంటనే ఎంఎస్‌వోలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఎంతమాత్రం సమంజసం కాదు: ప్రభాకర్

Published at: 17-06-2014 04:13 AM
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత సమంజసం కాదని బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రసారసాధనాలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలని.. వాటి స్వేచ్ఛను, హక్కులను హరించడం భావ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో ఎంఎస్‌వోలు పునరాలోచించుకోవాలని సూచించారు. ఇక.. తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాలను నిలిపేయడం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడమేనని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎం.రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. తమకు అనుకూలంగా వార్తలు ఉంటే ప్రసారం చేస్తామని, లేకపోతే చేయమనే రీతిలో వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో మంచి నిర్ణయం అనిపించుకోదన్నారు. ఏకపక్ష నిర్ణయం తీసుకుని ప్రసారాలను నిలిపేయడం పత్రికాస్వేచ్ఛను హరించడమేనని ఆయన అన్నారు.

కక్ష సాధింపు చర్యలు దురదృష్టకరం

Published at: 17-06-2014 04:15 AM
హైదరాబాద్, ఖమ్మం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాలను ఎంఎస్‌వోలు నిలిపివేయడం వెనుక కేసీఆర్ కక్ష సాధింపు ధోరణి స్పష్టమవుతోందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. చానెళ్లలో తనకు విరుద్ధంగా వార్తలు వస్తే చట్టవిరుద్ధంగా భావించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో చానెళ్ల పై కక్ష సాధింపు ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు. టీ చానల్, సాక్షిలో తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా అనేక వార్తలు వస్తున్నాయని, మరి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యవహారాన్ని చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారని.. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీ చానెళ్లలో అనేక మంది తెలంగాణ యువకులు పనిచేస్తున్నారని.. వాటిని మూసేస్తే వారంతా ఉపాధి కోల్పోయి వీధుల్లో పడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని దయాకర్ రావు పేర్కొన్నారు. తమకు నచ్చలేదని టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం అప్రజాస్వామికమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి ప్రసారాలు చేసినట్టు భావిస్తే ఆయా చానెళ్లకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరవచ్చని ఆయన అన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం మీడియా ప్రాథమిక సూత్రమని, దాన్ని అర్థం చేసుకోవాలే తప్ప అపార్థం చేసుకోకూడదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండు వారాలు కూడా గడవక ముందే ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించి కుట్రలు చేయడం సరైంది కాదన్నారు. ఏబీఎన్ ప్రసారాల నిలిపివేత నిర్ణయాన్ని టీడీపీ పక్షాన ఖండిస్తున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. చానెళ్లలో ఏవైనా తప్పుడు ప్రసారాలు వస్తే అసెంబ్లీకి, మండలికి పిలిపించి వివరణ తీసుకోవాలి కానీ ప్రసారాలను నిలిపివేయడం సరైన పద్ధతి కాదని టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు.

ప్రసారాల నిలిపివేత అసమంజసం : భట్టి

Published at: 17-06-2014 04:14 AM
హైదరాబాద్, ఖమ్మం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): చానెళ్లు తప్పిదాలు చేస్తే చట్టప్రకారం ప్రభుత్వం, శాసనసభ తమ పరిధిలో సరైన నిర్ణయం తీసుకుంటాయని, అలా కాకుండా చట్టాన్ని వ్యతిరేకించేలా పూర్తిగా ప్రసారాలు నిలిపివేయడం లాంటి నిర్ణయాలు ఎంఎస్‌వోల సంఘం తీసుకోవడం సమంజసం కాదని మధిర ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంఎస్‌వోల చర్యను నేరంగా పరిగణించి క్రిమినల్ కేసు పెట్టాలని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి కృష్ణమోహన్ అన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో వార్తలను ప్రసారం చేసిందని ప్రశంసించారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపినంత మాత్రాన ప్రసారాలను ఆపేస్తారా? అని నిలదీశారు. ఎంఎస్‌వోల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో వాక్స్వాతంత్య్రానికి చోటే ఉండదని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.




సమాజం అంధకారంలోకే : నారాయణ

Published at: 17-06-2014 04:12 AM
హైదరాబాద్, చిత్తూరు, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పత్రికలు, చానెళ్లలో ప్రసారమైన వార్తలకు సంబంధించి కేసీఆర్ వ్యవహరిస్తున్నతీరు భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని.. దీనివల్ల సమాజం అంధకారంలోకి వెళ్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సోమవారం చిత్తూరులో ఆక్షేపించారు. టీవీ ప్రసారాల నిలిపివేత ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, కేబుల్ ఆపరేటర్ల మోనోపలీకి ఇది నిదర్శనమని.. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎంఎస్‌వోల సంఘం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సీపీఐ తెలంగాణ కమిటీ కోరుతోందని, తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని, లేదంటే ప్రభుత్వమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment