Tuesday 24 June 2014

'కలుపుగోలు వృద్ధి' స్ఫూర్తి తెలిసేనా?

'కలుపుగోలు వృద్ధి' స్ఫూర్తి తెలిసేనా? - జాన్‌సన్ చోరగుడి

Published at: 25-06-2014 04:14 AM
60వ దశకంలో 'మిక్స్‌డ్ ఎకానమీ'ని మిశ్రమ ఆర్థిక విధానం అన్నంత సులువుగా 'ఇన్‌క్లూజివ్ గ్రోత్'ను 2010 తర్వాత 'సమ్మిళిత వృద్ధి' అంటే ఇప్పుడు అది ఎంత మాత్రం కుదరదు. పైగా 'రిఫార్మ్స్ విత్ హ్యుమన్ ఫేస్' అనే మౌలికమైన దృక్పథ బదిలీ 'ఇన్‌క్లూజివ్'లో ఇమిడి ఉంది.
విశాఖపట్టణంలో కేబినెట్ మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ - 'ఇన్‌క్లూజివ్ గ్రోత్' (ఐజీ) స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. యధాతథంగా చూస్తే అది కొత్త మాట అని మనకు అనిపించకపోవచ్చు. కానీ, దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు అమలు మొదలైన ఐదేళ్ళకే (1996) రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడిని దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు ఆయన చేసిన ఈ 'ఐజీ' ప్రస్తావనకు విశేషమైన ప్రాధాన్యం ఉన్నది.
ఎందుకంటే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసిన ఈ ప్రకటన మనకు స్పష్టం కావడానికి మనం కొంత కసరత్తు చేయవలసిన అవసరం ఉన్నది. అందుకు - 2004 మేలో ఎన్నికలకు వెళ్ళడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అక్కడి నుంచి తెచ్చి - 2014 జూన్‌లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడితో మళ్ళీ తిరిగి 'కనెక్ట్' చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇక ముందు జరిగే విశ్లేషణలకు ఇది ఒక అనివార్యత. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పదేళ్ళ విరామం ఉంది. 1991లో పి.వి. ఆర్థిక సంస్కరణల అమలుకు నేపథ్య సూత్రధారి, అప్పటి ఆర్థిక మంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆ తర్వాత కాలంలో ఆయనే స్వయంగా వాటిని పదేళ్ళపాటు అమలు చేసే ప్రధాన మంత్రి బాధ్యతలు నెరవేర్చవలసి వచ్చింది. ఆ క్రమంలోనే, పైన మనం అనుకొన్న పదేళ్ళ విరామ కాలంలో - 'రిఫార్మ్స్ విత్ హ్యుమన్ ఫేస్' దృక్పథాన్ని కూడా సంస్కరణల అమలు రెండవ దశాబ్దంలో సాక్షాత్తూ ఆయనే ఉవాచించారు. ఆ నినాదానికి తదుపరి కొనసాగింపే - ఇప్పటి 'ఇన్‌క్లూజివ్ గ్రోత్'. ఏ ఒక్క ఖాళీని కూడా వదలకుండా పూరిస్తే వృద్ధి క్రమం పూర్తి అవుతుందో, ఇరవై ఏళ్ళ అనుభవంలో స్పష్టమైంది కనుక - 'వృద్ధి'(పదం) ఇక ఇప్పుడు ఒంటరి క్రియా వాచకం కాలేకపోయింది! దానికి ముందు, అది ఎటువంటి 'వృద్ధో' కూడా స్పష్టం చేయవలసిన తరుణం వచ్చింది.
'ఇన్‌క్లూజివ్ గ్రోత్' గురించి మాట్లాడటానికి ముందు మరొక ప్రస్తావన ఇక్కడ తప్పడం లేదు. అది - తర్జుమా గురించి. మొదటి నుంచి ఈ ఆంగ్ల వాక్యాన్ని 'కలుపుగోలు వృద్ధి'గా నేను రాస్తున్నాను. అయితే 'సమ్మిళిత వృద్ధి' అనేది పత్రికల భాషలో వాడుకలో ఉంది. నిజానికి తర్జుమాలో మనం పాటించే ఈ సాంప్రదాయ 'అకడమిక్' దృష్టి కారణంగా, కాలక్రమంలో ఒక విషయానికి ఉండే మౌలిక స్ఫూర్తికి సైతం కొన్నిసార్లు నష్టం కలుగుతూ ఉంటుంది. 'ఇన్‌క్లూజివ్ గ్రోత్' అనే ఆర్థిక శాస్త్ర సంబంధమైన ఆంగ్ల పదాన్ని మన ప్రాంతీయ భాషలోకి తర్జుమా చేస్తున్నది ఎప్పుడు అనే కాలిక స్పృహ ముందుగా ఇక్కడ మనకు అవసరం. 60వ దశకంలో 'మిక్స్‌డ్ ఎకానమీ'ని మిశ్రమ ఆర్థిక విధానం అన్నంత సులువుగా 'ఇన్‌క్లూజివ్ గ్రోత్'ను 2010 తర్వాత 'సమ్మిళిత వృద్ధి' అంటే ఇప్పుడు అది ఎంత మాత్రం కుదరదు. పైగా 'రిఫార్మ్స్ విత్ హ్యుమన్ ఫేస్' అనే మౌలికమైన దృక్పథ బదిలీ 'ఇన్‌క్లూజివ్'లో ఇమిడి ఉంది. కనుక ఇప్పటి వరకు ఉన్న వృద్ధి, ఆర్థికం వంటి ఆర్థిక అంశాల్లోకి 'సామాజికం' రాక అనివార్యమయింది. కనుక 'కలుపుగోలు వృద్ధి' అనే తర్జుమా ఇప్పుడు ఇక్కడ కాన్‌టెక్స్‌ట్యువల్ ట్రాన్స్‌లేషన్ (సందర్భోచిత తర్జుమా) అవుతుంది. కమ్యూనికేషన్స్ రంగంలో ఒక పద ప్రయోగానికి ఉండే 'వెయిటేజి' అంతా ఇంత కాదు. సగం పనిని ముందుగా అదే పూర్తి చేస్తుంది!
తెలుగు సమాజానికి సంబంధించినంత వరకు రాష్ట్ర విభజన కూడా జరిగినది కనుక, రెండు రాష్ట్రాల్లో కూడా 'ఇన్‌క్లూజివ్ గ్రోత్' ప్రస్తావన ఎవరు చేసినా ఇకముందు దానికి అందరూ - 'కలుపుగోలు వృద్ధి'గా అర్థం చేసుకోవడమే జరుగుతుంది. అసలు రాష్ట్ర విభజనకు దారితీసిన ప్రధాన హేతువు కూడా జరుగుతున్న వృద్ధిలో తమ ప్రాంత ప్రజల భాగస్వామ్యం లేదనే (ఇన్‌క్లూడ్ కాలేదనే) ఫిర్యాదుతోనే కనుక, విభజన తర్వాత మొదలయ్యే స్వపరిపాలనలో ఈ 'కలుపుగోలు వృద్ధి' స్ఫూర్తి ఏమిటో వారికి అర్థం కావటానికి అక్కడ కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చును. కానీ ఈ ప్రాంత పరిస్థితి అందుకు భిన్నమైనది. ముందుగా అటువంటి అంశమొకటి ఉన్నది, దాని అమలులో ఉన్న లోపాలను సరిచేయవలసిన అవసరమున్నది అనే ఎరుక దగ్గర నుంచి అది మొదలు కావల్సి ఉంది. ఇప్పటికే అవకాశాలను ఆక్రమించిన వారు కొంత సర్దుకుని మరీ వదలవలసిన జాగా అది. ఆంధ్రప్రదేశ్‌గా పిలవబడుతున్న ఈ పదమూడు జిల్లాల రాష్ట్రంలో కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, రాయలసీమ నాలుగు జిల్లాలను ప్రత్యేక జోన్లుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో భారత ప్రభుత్వం పేర్కొన్నదీ అంటే, ప్రణాళికా సంఘం వద్ద ఉన్న గణాంక సమాచారమే అందుకు ప్రాతిపదిక. కనుక 'కలుపుగోలు వృద్ధి' అవసరం తీవ్రతకు ఈ ఏడు జిల్లాల వర్గీకరణ ఒక సూచీ అవుతుంది.
మొదటి నుంచి వ్యవసాయానికి ఉన్న భౌగోళిక అనుకూలత, ఆంగ్ల విద్య వంటి పలు ఇతర కారణాలతో అభివృద్ధి చెందిన కోస్తాంధ్ర ప్రాంతం నుంచి ఎంతో మంది ప్రస్తుతం పలువురికి ఉపాధిని సృష్టించగలిగిన ఉన్నత స్థితిలో ఉన్నారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ఇప్పుడు వీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా రేపు విస్తరించే కొత్త ఉపాధి అవకాశాలు ఇక్కడ గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఇప్పటికే వీరి చేతుల్లో ఉన్న అపారమైన భూ వసతిని ఇందు కోసం వారు వినియోగిస్తే, అది స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మనం చెప్పుకున్న భూ సంస్కరణల కంటే కూడా ఆచరణలో మరింత మెరుగైన - 'భూ పంపిణీ' అవుతుంది. అనివార్యతలను అనుకూలతగా మరల్చుకోవడం వర్ధమాన వర్గాలకు (డెవలపింగ్ సొసైటీస్) మిగిలిన ఆఖరి అవకాశమైతే, 'కలుపుగోలు వృద్ధి' - అధికార కేంద్రాలను తమ స్వాధీనంలో ఉంచుకోవాలనుకునే వారికి మిగిలిన ఆఖరి ప్రత్యామ్నాయమే కావచ్చు. ఎందుకంటే, అది వారి మనుగడ కోసం.
- జాన్‌సన్ చోరగుడి
అభివృద్ధి - సామాజిక అంశాల వ్యాఖ్యాత

No comments:

Post a Comment