Thursday, 2 April 2015

ఏపీకి కేంద్రం షాక్‌

ఏపీకి కేంద్రం షాక్‌
అటు ఇచ్చి ... ఇటు నొక్కేసింది
ఇచ్చింది 3844 కోట్లు.. ఎగ్గొట్టింది 900 కోట్లు
13వ ఆర్థిక సంఘం నిధుల్లో భారీ కోత
సీఎ్‌సటీ నిధుల్లోనూ వంద కోట్ల మేర కోత!
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): కుడిచేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేశారు. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆంధప్రదేశ్‌కు ఉదారంగా సాయం చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కేంద్రం నిధుల కేటాయింపులో చేతివాటాన్ని ప్రదర్శించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం రాత్రి హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రూ.8 వేల కోట్లకుపైగా నిధులు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, బుధవారం మధ్యాహ్నానికి కేవలం రూ.3844 కోట్లు ఏపీ ఖాతాలో జమయ్యాయి. మొత్తం మూడు కేటగిరీల్లో ఈ నిధులు ఏపీకి వచ్చాయి. గుడ్డిలోమెల్లగా కొద్దిపాటి అదనపు సాయమైతే చేశారు కానీ రావాల్సిన నిధుల్లోనూ భారీ కోత పెట్టడం ద్వారా రాషా్ట్రనికి కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. ఏపీకి రావాల్సిన నిధులు రూ.900 కోట్లలో కోత పెట్టింది. రాషా్ట్రనికి రెగ్యులర్‌ స్కీంల కింద ఇచ్చే నిధులను ప్రత్యేకంగా చూపిస్తూ ఇంతకాలం ప్రకటనలతో సరిపుచ్చుతూ వచ్చిన కేంద్రం తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ వార్తాకథనాలను ప్రచురించింది. దీంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఈమేరకు మంగళవారం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ నిధుల విడుదలపై ప్రకటన కూడా చేశారు. ఇంత చేసినా తీరా నిధులు విడుదలకు వచ్చేసరికి కేంద్రం ప్రకటనల్లోని డొల్లతనం మరోసారి బయటపడింది. ఏపీ కొత్త రాజధాని నిర్మాణ పనుల కోసం అడ్వాన్సు రూపంలో రూ.1500 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇవి రాష్ట్ర ఖాతాలో జమయ్యాయి. ఇందులో రూ.1000 కోట్లను రాజధాని మౌలిక సదుపాయాల కోసం, రూ.500 కోట్లను సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజభవన్‌ నిర్మాణానికి వినియోగించుకోడానికి కేంద్రం అనుమతించింది. అంతవరకు బాగానే ఉన్నా సీఎ్‌సటీ కింద రూ.650 కోట్లు ఇస్తున్నామని జైట్లీ ప్రకటించగా వాస్తవానికి రూ.541 కోట్లే జమయ్యాయి. రెవెన్యూలోటు భర్తీ కోసం మరో రూ.1803 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే ఇచ్చిన రూ.500 కోట్లను కలిపి రూ.2303 కోట్లను ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇవి మినహా ఇప్పట్లో కేంద్రం నుంచి ప్రత్యేకంగా వచ్చే నిధులేవీ ఉండవని ఆర్థికశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 13వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీకి రావాల్సిన రూ.900 కోట్లకు కేంద్రం కోత వేసింది. ఇంత భారీగా నిధుల్లో కోత పడటాన్ని రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఆర్థికమంత్రి ప్రకటనలోగాని, విడుదలైన నిధుల్లోగాని వీటి ఊసు లేకపోవడంతో అవి మురిగిపోయినట్లేనని రెవెన్యూవర్గాలు ధ్రువీకరించాయి. మార్చి 31లోపు కేటాయించిన మేరకు నిధులు రాకపోతే అవి మురిగిపోయినట్లేనని వారు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాషా్ట్రన్ని ఆదుకుంటామని చెబుతూనే మరోవైపు నిధుల్లో భారీగా కోత పెట్టడం ప్రభుత్వవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. బుధవారంనాటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఇక చేసేదేమీ లేదని, వచ్చే ఏడాదికి మరిన్ని నిధులు రాబట్టేందుకు ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆర్థికశాఖ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment