|
పాక్ జెండా ప్రదర్శించిన ఫలితం.. శ్రీనగర్‌లో ఆందోళనలు.. ఉద్రిక్తత
పాక్ జెండా ప్రదర్శించిన ఫలితం.. శ్రీనగర్‌లో ఆందోళనలు.. ఉద్రిక్తత
శ్రీనగర్, ఏప్రిల్ 17: శ్రీనగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాక్ జెండాను ప్రదర్శించి, పాక్ అనుకూల నినాదాలు చేసినందుకు వేర్పాటువాది మస్రత్ అలంను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీనగర్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అలం అరెస్ట్‌ను, కొద్ది రోజుల క్రితం ట్రాల్‌లో ఇద్దరు యువకులను మిలటరీ కాల్చి చంపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో హురియత్ కాన్ఫ్‌రెన్స్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే నగరంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేసి టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులతోసహా ఆరుగురు గాయపడ్డారు. ఆందోళనకారులు జాతీయ జెండాను తగులబెట్టారు. రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్రం స్పందించింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, పీఎంవో మంత్రి జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. అలం అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిణామాలను పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని సంకీర్ణ సర్కార్ మనుగడ కోసం దేశ భద్రతను పణంగా పెట్టబోమని వారు స్పష్టం చేశారు. భారతదేశంలో ఉంటూ పాక్ అనుకూలంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అలం అరెస్ట్‌ను బీజేపీ సమర్థించింది. కశ్మీర్ లోయలో భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలను అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పట్రా స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్ వేర్పాటువాదులు పాకిస్తానీయులు కాదని వారు కూడా భారతీయులేనని పీడీపీ వ్యాఖ్యానించింది. కేంద్రం ఒత్తిడి మేరకే అలంను అరెస్ట్ చేశారన్న వార్తలు సరికాదని, చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని పీడీపీ అధికార ప్రతినిధి వహీద్ స్పష్టం చేశారు. మస్రత్ అలంను గత నెల్లో పీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం విదితమే. హురియత్ నేతలు సయ్యద్ గిలానీ, మస్రత్ అలంపై సరైన చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వేర్పాటువాదుల చర్యలన్నీ సీఎం ముఫ్తీ మహ్మద్‌కు కశ్మీర్‌లోయలో మద్దతు కూడగట్టడంలో భాగమేనని జమ్మూకశ్మీర్ సీఎల్‌పీ నేత నవాంగ్ రిగ్‌జిన్ జొరా ఆరోపించారు. వేర్పాటువాదుల చర్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు.
|
No comments:
Post a Comment