- ఎన్నికల ఖర్చులకు కార్పొరేట్ల నుంచి భారీ రుణాలు
- ఆ రుణాలు తీర్చుకునేందుకే ఈ భూ ఆర్డినెన్స్
- ‘మేక్ ఇన్ ఇండియా’తో భూములు పోతాయి
- ఉద్యోగాలూ రావు.. ఆదివాసీలకూ ఆపదే
- కిసాన్ ర్యాలీతో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ యుద్ధభేరి
- ఎక్కడ భూసేకరణ చేస్తున్నా నన్ను పిలవండి
- రైతుల తరఫున సర్కారుపై పోరాడుతా
- కార్పొరేట్ల రుణం తీర్చుకునేందుకే..భూ ఆర్డినెన్స్: రాహుల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘మోదీగారు ఎన్నికలను ఎలా గెలిచారనేది చెబుతాను. దానికోసం ఆయన బడా పారిశ్రామికవేత్తల నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకొన్నారు. తనకు సొంత ప్రచారం కల్పించుకొన్నారు. మరి ఇప్పుడు ఆ రుణం ఎలా తీరాలి? అందుకని మీ నుంచి (రైతుల) భూములను గుంజుకొని వారికి ధారాదత్తం చేస్తానని అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే చేస్తున్నారు’’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ‘గుజరాత్ మోడల్’, ‘మేక్ ఇన్ ఇండియా’ల అసలు రంగు ఇదేనని ఎత్తిపొడిచారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడ రైతుల నుంచి భూములు సేకరించాలని ప్రయత్నించినా తాను వచ్చి పోరాడతానని భరోసా ఇచ్చారు. రెండేళ్ల కిందట తాము తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలను, ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన దాదాపు ఏడాదికి మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. స్థానిక రామ్‌లీలా మైదానంలో ఆదివారం ఉదయం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ‘కిసాన్-ఖేత్ మజ్దూర్ ర్యాలీ’ పేరిట జరిగిన ఈ సభలో వివిధ రాషా్ట్రలకు చెందిన దాదాపు 70-80 వేల మంది రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా సహా ఏఐసీసీ అగ్రనాయకత్వమంతా తరలివచ్చింది. రేపు భూమి ఏమవుతుందో అని రైతాంగం ఆందోళన చెందుతున్నదని రాహుల్ హ చెప్పారు. యూపీఏ హయాంలో వీలున్న ప్రతిసారీ రైతుల్ని ఆదుకున్నామని వివరించారు. బ్యాంకులు పెద్దోళ్లకు మాత్రం రుణాలు ఇస్తున్నాయని, పేదలైన తమకు మాత్రం తలుపులు మూస్తున్నాయంటూ రైతులు తనకు చెప్పడంతో రూ.70 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రధాని మోదీ మాత్రం విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని విమర్శిస్తున్నారని, 50 ఏళ్ల మురికిని తాను శుభ్రం చేస్తున్నానంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాని హోదాకు గౌరవం తెచ్చిపెట్టేవి కాదన్నారు. ప్రభుత్వాన్ని చూసి భయపడొద్దని భరోసా ఇచ్చారు. మోదీ చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కల సాకారం కాబోదని, ఆ పేరు చెప్పి రైతుల నుంచి భూములు తీసుకుంటారని, యువకులకు ఉద్యోగాలు కూడా లభించబోవని తెలిపారు.
ఇక చాలు.. అని చెప్పాలి: సోనియా
‘జరిగిందేదో జరిగింది..ఇక చాలు’ అనే సందేశాన్ని ప్రధాన మోదీకి, ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వాలని రైతులకు సోనియాగాంధీ సూచించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పుండుపై కారం చల్లినట్లు ఉందని చెప్పారు. రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ఇప్పుడు భూమినీ వారికి దూరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. అందరి సమ్మతితో తాము భూసేకరణ చట్టం తెచ్చామని, ఆ చట్టం రైతు వ్యతిరేకి అని ఇప్పుడు బీజేపీ అంటోందని.. అలా అయితే ఆ చట్టానికి అప్పుడెందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. సంవత్సరం గడుస్తున్నా యువకులు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేయటం లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. బట్టాపర్సౌల్‌లో రైతుల కోసం ఉద్యమించినట్లుగానే దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో రైతుల తరపున రాహుల్ గాంధీ ఉద్యమిస్తారని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, మోతీలాల్ ఓరా, అజయ్ మాకెన్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
మహా తీర్పును అవమానిస్తారా?: బీజేపీ
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన మహా తీర్పును అవమానించినందుకుగాను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘దేశ ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తారా? ఆయన వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఆస్ట్రేలియాలోనూ ఇలాగే..
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానంపై తాను ఆ దేశానికి వెళ్లానని, అక్కడ ఒక వజ్రాల గనిని సందర్శించానని రాహుల్ చెప్పుకొచ్చారు. ఆ వజ్రాల గని భూములు ఎవరివని తాను ప్రశ్నించగా.. 300 కుటుంబాల నుంచి సేకరించినట్టు యజమానులు చెప్పారని, వారికి కలుద్దామంటే.. గనిలోనూ, గోడౌన్‌లోనూ, కంప్యూటర్ ఆపరేటర్‌గానూ పనిచేసే వారిని తీసుకొచ్చారని రాహుల్ తెలిపారు. ఇక్కడా అలాగే అవుతుందని హెచ్చరించారు.
నేల దక్కకుంటే నక్సలైట్లమవుతామన్నారు
యూపీఏ హయాంలో రైతులు, గిరిజనుల కోసం తాను చేసిన పోరాటాలను రాహుల్ ఏకరువు పెట్టారు. నియమగిరిలో తమ భూములు లాక్కుంటున్నారని రైతులు చెబితే వారికి విజయం లభించేలా చేశానని రాహుల్ తెలిపారు. ఇప్పుడా భూములను వేదంత కంపెనీకి ఇస్తున్నారని, అదే జరిగితే.. 400 మంది యువకులు నక్సలైట్లుగా మారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తనతో చెప్పారని రాహుల్ అన్నారు.
రాహుల్‌పై... ఆశనిరాశలు
కిసాన్ ర్యాలీ విజయవంతమవడంతో రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ బలోపేతంకావడానికి సన్నద్ధమైన విషయం తేటతెల్లమైంది. ఇది రాహుల్ గాంధీ రీలాంచ్ (రెండోసారి ఆయన నాయకత్వాన్ని ఆవిష్కరించడం) అని ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. బలమైన ప్రతిపక్షనేతగా మోదీని ఢీకొనేందుకు రాహుల్ సమాయత్తమవుతున్నారని, ఆయన విజయం పార్టీ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉందని సీనియర్ నేత ఒకరు చెప్పారు.
- రైతు ఆత్మహత్యలు పట్టవా!
- తెలంగాణలో 750 మంది ఆత్మహత్య : ఉత్తమ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ రైతు ర్యాలీలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రైతుల, పేదల వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసింది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దానికి మద్దతిచ్చిన బీజేపీ అధికారంలోకి రాగానే బడాబాబులకు మేలు చేసేలా చట్టంలో మార్పులు చేసి రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను తెచ్చిందని విమర్శించారు.
No comments:
Post a Comment