Monday, 27 April 2015

ప్రత్యేక హోదాపై తాత్సారమెందుకు?....కొణిదెల చిరంజీవి

ప్రత్యేక హోదాపై తాత్సారమెందుకు?....కొణిదెల చిరంజీవి


బీజేపీ, తెలుగుదేశం పార్టీల నేతలు నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారనడంలో రెండో అభిప్రాయానికి తావులేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కుకై సంఘటితంగా సమష్టిగా కృషిచేయాలి.
హించిన ఉప్రదవమే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నెత్తిన పిడుగులాంటి వార్త. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా.. ఏపీ రాష్ట్ర పునర్‌విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పకనే చెప్పింది. ఇద్దరు గౌరవ పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సూటిగా అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిని, వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించడం ద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేనట్లేనని అర్థమవుతోంది.
కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక.. ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హమీలు నెరవేరడానికి ఎంతోకాలం పట్టదని రాష్ట్ర ప్రజానీకం ఆశించింది. అయితే గత 11 నెలలుగా ఆ రెండు పార్టీలు విడివిడిగా, ఉమ్మడిగా ఆడుతున్న డ్రామాలతో వాటి పట్ల ఏర్పరచుకొన్న భ్రమలు క్రమంగా తొలగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని అన్యాయం జరగనుంది.
ఒక్కసారి ఓ 15 నెలల ముందు కేంద్రంలో, రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్ని తెలుగు ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలుపుతూ లేఖలు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించడానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఆనాడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న నేను, ఆంధ్రాకు చెందిన సహచర కేంద్రమంత్రులు, గౌరవ పార్లమెంట్‌ సభ్యులందరం కలసి సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటు చేసుకొని, విభజన అనంతరం ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే.. చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక ప్రయోజనాలపై చర్చించాము. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు మరికొన్ని నిర్దిష్టమైన డిమాండ్‌లను తయారుచేసి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గారికి ఇచ్చాం.. వ్యక్తిగతంగా నేనైతే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ (యూటీ) చేయాలని ప్రతిపాదించాను. కానీ అది సాధ్యం కాదన్నప్పుడు.. విభజిత రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రయోజనాలు, రాయితీలు కల్పించాలని లిఖితపూర్వకంగా కోరాము.
మేము చేసిన సూచనల కనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ మొదలైన వాటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 షెడ్యూల్‌ 13లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గారు నూతనంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు చేయబోయే సహాయాలను రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు. బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం తమదేనని.. తాము నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పదేళ్ళ పాటు ప్రత్యేకహోదా ఇస్తామని, అభివృద్ధిలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవగానే ఒకవైపు బీజేపీ, మరోవైపు తెలుగుదేశం పార్టీలు నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన హామీలన్నీ అమలు చేసేందుకు తమకే ఓటు వేయాలని ప్రచారం చేశాయి. రాష్ట్ర బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికలో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పది సంవత్సరాల ప్రత్యేకహోదా ఇస్తామన్న వాగ్దానాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. నరేంద్రమోదీగారు విశాఖపట్నం, తిరుపతి ఎన్నికల సభలలో పాల్గొన్న సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీని తీవ్రంగా దుయ్యబడుతూ.. ‘బిడ్డ కోసం తల్లిని చంపేశారని’ కవితాత్మకంగా ప్రస్తావించడమే కాకుండా తమకు ఓట్లేసి అధికారం అప్పజెపితే విభజన బిల్లులో పేర్కొన్న అంశాలన్నిటినీ అములు చేస్తామన్నారు. ప్రజలు నమ్మారు. ఓట్లేసి ఎన్డీఏ, భాగస్వామ్య టీడీపీకి అధికారం అప్పజెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలకు కూడా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలున్నారు. గత ఏడాది ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం జరుగుతున్నప్పుడు విభజన అంశాన్ని బీజేపీ కూడా రాజకీయంగా వాడుకున్నది. రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చిందంటూ రాజకీయం చేసి.. ఎన్నికల్లో రాజకీయ అవసరాలు తీర్చుకొని ఇప్పుడు ఆంధ్రఫ్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలూ అదే విధమైన డిమాండ్‌ చేస్తాయంటూ రాజకీయపరమైన కారణాలని చూపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజమే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మరికొన్ని రాష్ట్రాలు ఆ డిమాండ్‌ను తెర మీదకి తీసుకురావచ్చు. అంతమాత్రాన ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయాలా? ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అవసరమో.. ఆయా రాష్ట్రాలకు చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ -ఎన్‌డీఏ మీద లేదా?
ఇక రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే సాకుతో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా పలు పదవులు అనుభవించి చివరి క్షణంలో పార్టీని వీడి బీజేపీలో చేరిన రాష్ట్ర నేతలు కొందరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై నోరుమెదపకపోవడాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. 2002లో గుజరాత్‌లో జరిగిన గోధ్రా నరమేథం నేపథ్యంలో అప్పటి ఎన్‌డీఏ సర్కార్‌ మెడపై కత్తి పెట్టి నరేంద్రమోదీని గుజరాత్‌ సీఎంగా తప్పించకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి కూలదోస్తామని బెదిరించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆరు కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుంటే ఎన్‌డీఏ నుంచి తప్పుకుంటామన్న చిన్న మాట కూడా ఎందుకు అనలేకపోతున్నారు? ఆయనకు ఎందుకు ఆ బలహీనత? ప్రతి అంశానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే చంద్రబాబు ఇంత ముఖ్యమైన అంశంపై లీకులు ఇవ్వడమే తప్ప మీడియాతో ఎందుకు ఎందుకు మాట్లాడడం లేదు? ఎన్నాళ్లు ఈ అంశంపై స్పష్టత లేకుండా ప్రజల్ని గందరగోళపరుస్తారు?
ఇదంతా తాజా చరిత్ర. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనస్సులో ఇంకా చెరిగిపోని సన్నివేశం. అయితే ఈ 11 నెలలుగా జరుగుతున్న పరిణామాలేమిటి? ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రుల సన్నాయి నొక్కులు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు! కాంగ్రెస్‌ పార్టీపై నిందలు, విమర్శలు, వెంకయ్యనాయుడి గారి అసహనం, కేంద్రంపై ఒత్తిడి తేలేని చంద్రబాబు అసమర్థత కప్పి పుచ్చుకుంటూ ఆశావహ ప్రకటనలు! కేంద్రాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ సొంతపార్టీ ఎంపీలకు క్లాసులు, హితబోధలు.. పైకి ప్రయత్నాలు చేస్తున్నామంటూ ప్రకటనలు.. లోపల లోపాయికారీ అవగాహనలు.. వెరసి ఈ రెండు పార్టీల నేతలు నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారనడంలో రెండో అభిప్రాయానికి తావులేదు.
మొదటి నుంచీ రాష్ట్రవిభజన అంశాన్ని తెలుగుదేశం పూర్తిగా తమ రాజకీయ లబ్ధికే ఉపయోగించుకొంది తప్ప తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచించలేదు. రాష్ట్ర విభజనపై పార్టీల అభిప్రాయాలు కోరుతూ కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేస్తే దాన్ని బాయ్‌కాట్‌ చేసింది తెలుగుదేశం పార్టీయే కాదూ? తెలంగాణలో ఒకమాట, ఆంధ్రాలో మరోమాట మాట్లాడుతూ.. విభజనపై ఆది నుంచి ద్వంద్వవిధానాలే అవలంభించింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాపై జరుగుతున్న తాత్సారానికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ‘కోటి సంతకాల ఉద్యమం’ ప్రారంభిస్తే టీడీపీ నేతలు హేళనగా మాట్లాడారు. కించపర్చే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని, కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందన్నారు. వారిప్పుడు ఏం మాట్లాడతారు? ఏ కొత్త పల్లవి ఎత్తుకుంటారు? అంతేకాదు..కేంద్రం నుంచి 90 శాతం నిధులు గ్రాంట్‌గా లభించే అవకాశం ఉన్న పోలవరం జాతీయ ప్రాజెక్టును పక్కన బెట్టి ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్ర ఖజానాపై రూ.1300 కోట్ల భారం పడే ‘పట్టి సీమ’ ప్రాజెక్టును తలకెత్తుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం సీనియర్‌ నేతలు కొందరు చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రత్యేక హోదా రాకపోయినా నష్టం లేదని.. ఆ మేరకు ఆర్థిక సహాయం అందుతుందని ఒకరంటారు. ప్రతిపక్షాలకు పని లేదు కనుకనే ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని మరొకరు అంటారు. ఒక సీనియర్‌ నేత మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదాకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలకు అవగాహన లేదని’ విమర్శిస్తున్నారు. పోనీ ఆయనకున్న అవగాహన ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి కదా? అది చేయడం లేదు. స్వయంగా గౌరవ అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ గారే ప్రత్యేక హోదాపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని నిజాయితీగా చెప్పారు. ఒకరిద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని అక్కడక్కడా మాట్లాడుతున్నారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎప్పుడొస్తుందో చెప్పలేమంటూ కేంద్ర మంత్రులే ప్రకటిస్తుంటే తెలుగుదేశం మంత్రులు మాత్రం అందుకు భిన్నమైన ప్రకటనలు చేయడం గమనార్హం.
ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కుకై సంఘటితంగా సమష్టిగా కృషిచేయాలి. లేదంటే ఆరుకోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి టీడీపీ ద్రోహం చేసినట్లే సుమా!
కొణిదెల చిరంజీవి
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు

No comments:

Post a Comment