Saturday, 11 April 2015

అన్ని మతాలూ మాకు సమానమే - మోదీ

అన్ని మతాలూ మాకు సమానమే

మైనారిటీల హక్కులను కాపాడతాం
‘యునెస్కో’ సభలో మోదీ హామీ
‘‘ప్రతి పౌరుడి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, హక్కులను పరిరక్షిస్తాం. ప్రతి మతానికి, సంస్కృతికి, తెగకు చెందిన వ్యక్తీ సమాన హోదా అనుభవించేలా చూస్తాం’’ -మోదీ
ప్యారిస్‌, ఏప్రిల్‌ 10: భారత్‌లో మైనారిటీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామనీ, అన్ని మతాల పౌరుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ‘యునెస్కో’ ప్రధాన కార్యాలయంలో శుక్రవారంనాటి ప్రసంగంలో ఆయన చెప్పారు. ఢిల్లీలో ఇటీవల చర్చిలపై దాడులు, సంఘ్‌పరివార్‌ శక్తుల ఘర్‌వాపసీ కార్యక్రమంపై మైనారిటీలలో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో ప్రధాని విశ్వ వేదికపై చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం, హింసాకాండను అణచివేసేందుకు వివిధ దేశాల సంస్కృతీ సంప్రదాయాలను, మతాలను సానుకూలంగా ఉపయోగించుకోవాలనీ అన్నివర్గాలనూ ఏకం చేసుకుపోవాలనీ మోదీ పిలుపునిచ్చారు. ‘‘ప్రతి పౌరుడి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, హక్కులను పరిరక్షిస్తాం. భారతీయ సమాజంలో ప్రతి మతానికి, సంస్కృతికి, తెగకు చెందిన వ్యక్తీ సమాన హోదా అనుభవించేలా, వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తాం’’ అన్నారు. భారత్‌లో పాలన రాజ్యాంగ మౌలికసూత్రాల ఆధారంగా జరుగుతుందని చెప్పారు. అహింసామూర్తి గాంధీజీ, అరబిందోల బోధనలను ప్రత్యేకంగా ప్రస్తావించా రు. దేశంలో ప్రతి పౌరుడికీ ఆవాసం, ప్రతి ఇంటికీ విద్యుత్తు, అందరికీ మంచినీరు, పారిశుధ్యం, మాతాశిశు సంక్షేమం ప్రభుత్వ లక్ష్యాలని మోదీ ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో పర్యావరణహితంగా 1.75 లక్షల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తికి ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
మోదీకి అనూహ్య స్పందన
‘యునెస్కో’ సభలో నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినేందుకు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. మాటమాటకూ చప్పట్లు కొట్టారు. ‘‘మోదీ’’ ’’మోదీ’’ ‘‘మోదీ’’ అంటూ నినాదాలిచ్చారు. ‘‘వందేమాతరం’’ అని కూడా నినాదాలిచ్చారు. దీనికి ప్రధాని దీటుగా ‘‘గుడ్‌’’ ‘‘గుడ్‌’’ అని బదులిచ్చారు. ప్రతి పౌరుడు చేయి చేయి కలగలిపితే అది ఆ దేశ శక్తిసామర్థ్యాలను చాటిచెపుతుందని మోదీ వ్యాఖ్యానించారు. అత్యంత బలహీనవర్గాలను అధికారంలోకి తీసుకురావడం ద్వారానే నిజమైన ప్రగతిని సాధించవచ్చని ఆయన చెప్పారు. పది నెలల క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే విశ్వాసంతో ముందుకు సాగుతున్నామని మోదీ అన్నారు. ‘‘సంస్కృతి అనేది ప్రపంచ దేశాలను అనుసంధానం చేసేదిగా ఉండాలే తప్పా విడదీసేదిగా ఉండకూడదు. ఇది భిన్న ప్రజల మధ్య గౌరవాన్ని, అవగాహనను పెంచుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
యోగా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక పోర్టల్‌ను నరేంద్ర మోదీ శుక్రవారం ప్యారిస్‌లో ప్రారంభించారు. ‘‘యునెస్కో’’ ప్రధానకార్యాలయంలో ప్రసంగించిన తర్వాత ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, యోగా ద్వారా ప్రతి ఒక్కరిలో ఏకతాభావన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరెనా బుకోవా, అనేకమంది ఎన్నారైలు పాల్గొన్నారు. ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. మోదీ చొరవమేరకు జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటిచిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment