Saturday, 18 April 2015

నీకు నేను.. నాకు నువ్వు!

నీకు నేను.. నాకు నువ్వు!

వాళ్లకు మన మార్కెట్‌ కావాలి
మనకు వాళ్ల పెట్టుబడులు, టెక్నాలజీ కావాలి
చైనా పెట్టుబడులపై సీఎం వ్యాఖ్య
చైనా పర్యటనలో 29 ఎంవోయూలు
పోలవరానికి చైనా టెక్నాలజీ
విలేకరులతో చంద్రబాబు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘‘చైనాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు స్థానికంగా వ్యాపార అవకాశాలు తగ్గాయి. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తేనే అవి నిలబడగలుగుతాయి. వచ్చే రెండు ద శాబ్దాల్లో పెరిగే మార్కెట్‌ మనదే. వాళ్లకు మన అవసరం ఉంది. మనకు కూడా పెట్టుబడులు, టెక్నాలజీ కావాలి. మన కంపెనీలు కూడా చైనా కంపెనీల స్థాయికి ఎదగాలి. అందుకు ప్రాథమిక దశలో కలిసి ప్రయాణం చేయడం తప్పనిసరి. ఇద్దరికీ ఎవరి అవసరాలు వారికి ఉన్నందున చైనా నుంచి మనకు పెట్టుబడులు రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారతదేశం తరపున ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్లి ఐదు రోజులపాటు చైనాలో పర్యటించి వచ్చిన ఆయన.. శనివారం సాయంత్రం సచివాలయంలో మీడియా గోష్ఠిలో తన పర్యటన అనుభవాలను వివరించారు. నవ్యాంధ్రపై చైనాలో బాగా ఆసక్తి ఉందని, కానీ, పెట్టుబడులు తరలిరావడం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉందని చెప్పారు. ‘‘వారికి కొన్ని కోరికలు ఉన్నాయి. భారత్‌లో దిగిన వెంటనే వీసా ఇచ్చే సదుపాయం (వీసా ఆన్‌ అరైవల్‌), దేశం అంతటా ఒకే విధమైన పన్ను విధానాలు, వ్యాపార నిర్వహణకు సరళ విధానాలు కావాలని కోరుతున్నారు. వీటిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చైనాకు వెళుతున్నారు. ఆ తర్వాత వీటిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే, చైనా నుంచి ఏయే రంగాల్లోకి పెట్టుబడులు ఆహ్వానించాలన్న దానిపైనా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నా పర్యటనపై నేను త్వరలో ప్రధానిని కలిసి వివరిస్తాను’’ అని వివరించారు. తాను చైనాలోని మూడు నగరాలు బీజింగ్‌, షాంఘై, చెంగ్డు నగరాలను సందర్శించానని, మొత్తం 29 ఎంవోయూలు కుదిరాయని, వాటిలో ఇరు ప్రభుత్వాల మధ్య ఎనిమిది, ప్రభుత్వానికి, వ్యాపార సంస్థలకు మధ్య 10, ఇరు దేశాల్లోని వ్యాపార సంస్థల మధ్య 11 ఎంవోయూలు కుదిరాయని చెప్పారు. హైదరాబాద్‌లో పని చేసిన మాదిరిగా అక్కడ కూడా అర్ధరాత్రి వరకూ అందరినీ కలిసి మాట్లాడుతూనే ఉన్నామని, తనతోపాటు వచ్చిన అధికారులు కూడా బాగా పని చేశారని కితాబు ఇచ్చారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉరుకులు పరుగులతో పని చేశామని, అధికారులకు అక్కడ కనీసం చాక్లెట్లు కొనుక్కోవడానికి కూడా సమయం చాలలేదని, తాము ఎంత కష్టపడినా రాష్ట్రం బాగుపడాలన్నదే తమ తపన అని వివరించారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లో తొమ్మిది కోట్ల జనాభా ఉంటే రెండు కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారని, వ్యవసాయ దిగుబడులు కూడా మనతో పోలిస్తే బాగా ఎక్కువని, ఆ రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకొని వారి అనుభవాలను వాడుకోవాలన్న యోచనతో ఒక ఎంవోయూ కుదుర్చుకొన్నామని ఆయన చెప్పారు. భారీ డ్యాంల నిర్మాణంలో చైనా కంపెనీలకు బాగా అనుభవం ఉందని, కేంద్రంతో మాట్లాడి పోలవరం నిర్మాణంలో వారి టెక్నాలజీని వాడుకొనే ఆలోచన చేస్తామని చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీలో చైనా సంస్థలు అద్భుత ప్రగతిని సాధించాయని, దానిని వాడుకోగలిగితే మన వద్ద ఫలితాలు చాలా బాగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. చైనాతో సరిహద్దు వివాదాల వంటి వాటిని మరీ అంత పెద్ద అంశాలుగా పరిగణించడం వల్ల ఉపయోగం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘‘మనం మన శక్తిపై ఆధారపడాలి. అందరితో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. ఆ పనిని ప్రధాని మోదీ బాగా చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రధానీ తేనంత స్థాయిలో ఆయన దేశానికి గుర్తింపు తెచ్చారు. దేశాన్ని బ్రహ్మాండంగా మార్కెటింగ్‌ చేస్తున్నారు. 15 ఏళ్ల కిందట ఒక స్థాయిలో నేను ఆ పని చేశాను. చిన్న విషయాలను కాకుండా మన దేశం శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. మనం విఫలమైతే తప్ప.. రాబోయే రోజుల్లో చైనా, భారత్‌, అమెరికా వరుసలో అగ్ర దేశాలుగా నిలుస్తాయి’’ అని చెప్పారు. మన దగ్గర ప్రజలు అభివృద్ధిని కోరుకొంటున్నారని, కేవలం రాజకీయ నాయకులే చిన్న విషయాలను పెద్దవిగా చేసి అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అభ్యంతరాలన్నీ పట్టించుకొంటూ పోతే రాషా్ట్రనికి తాను 300 ఇంజనీరింగ్‌, 30 వైద్య కళాశాలలు తేగలిగేవాడిని కాదని చెప్పారు. వాటివల్ల మనవాళ్లు ప్రపంచమంతా వ్యాపించారని తెలిపారు. ఇప్పుడు మనకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థలు కావాలని, వాటివల్ల సంపద వస్తుందని, అది ప్రజల జీవన ప్రమాణం పెంచుతుందని వివరించారు. చైనా మెటలర్జికల్‌ కార్పొరేషన్‌ ఇక్కడ ఉక్కు ఉత్పత్తిపైనా, కేమెల్‌ కంపెనీ బ్యాటరీల తయారీపైనా, మరి కొన్ని సంస్థలు దుస్తుల తయారీపైనా ఆసక్తి చూపించాయని తెలిపారు.
చైనా.. యమా స్పీడ్‌!
చైనాలో భారీ నిర్మాణాల టెక్నాలజీ బాగా పెరిగింది. 30 అంతస్థుల భవన నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందని మనం ఆలోచిస్తుంటే.. వాళ్లు రోజుల్లో లెక్క వేస్తున్నారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా నిర్మాణ వ్యవ ధిని బాగా తగ్గించారు. షాంఘైలో ఫాస్ట్‌ ట్రైన్‌ ట్రాక్‌పై రైళ్లు గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. కానీ, ఈ టెక్నాలజీ ఖర్చు ఎక్కువని చైనా ఇప్పుడు స్పీడ్‌ ట్రైన్లపైకి దృష్టి మళ్లించింది. ప్రపంచంలో ఉన్న స్పీడ్‌ ట్రైన్లలో 60-65 శాతం చైనాలోనే ఉన్నాయి. బీజింగ్‌ నుంచి షాంఘైకి మధ్య 1700 కిలోమీటర్ల దూరం ఉంటే ఈ రైళ్ల ద్వారా ఐదు గంటల్లో చేరిపోతున్నారు. ఇందుకు ఏటా ఐదు వేల కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మిస్తున్నారు.
షాంఘైలో పోర్టు పెద్ద లోతు లేదు. సముద్రంలో 32.5 కి.మీ. ఫ్లై ఓవర్‌ నిర్మించి, ఒక ద్వీపం వద్ద డీప్‌ వాటర్‌ పోర్టు పెట్టారు. ప్రపంచంలో అత్యధిక రవాణా ఆ పోర్టు నుంచే జరుగుతోంది. ప్రపంచంలోని ఆరు పెద్ద పోర్టుల్లో నాలుగు చైనాలోనే ఉన్నాయి.
బీజింగ్‌లో ఆరు లైన్ల రోడ్లు, షాంఘైలో ఎనిమిది లైన్ల రోడ్లు ఉన్నాయి. నగరాల్లో అంత విస్తీర్ణంలో రోడ్లు ఉండడం చాలా అరుదు. నేను సీఎంగా ఉండగా హైదరాబాద్‌ చుట్టూ ఒక ఔటర్‌ రింగ్‌రోడ్డు మొదలు పెట్టించాను. ఇప్పుడు బీజింగ్‌ చుట్టూ నాలుగు ఔటర్‌ రోడ్లు, షాంఘై చుట్టూ ఐదు ఔటర్లు ఉన్నాయి.
చెంగ్డూ నగరంలోని వైద్య కళాశాలలో పది వేల పడకలున్నాయి. వాటిలో 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ 700 మంది భారతీయ విద్యార్థులు అయితే, 200 మంది తెలుగువారు. మెడిసిన్‌ చదవడానికి మన వద్ద రూ. కోటికిపైగా ఖర్చు అవుతుంటే, అక్కడ రూ.40 లక్షల్లో పూర్తవుతుందని, అందుకే అక్కడకు వచ్చామని తెలుగు విద్యార్థులు నాతో చె ప్పారు.
చైనా నుంచి తిరిగి వచ్చేసరికి రెండు కిలోల బరువు తగ్గాను. నాతోపాటు వచ్చిన వారిదీ అదే పరిస్థితి. వరుస భేటీల ఒత్తిడికి తోడు చైనాలో ఆహారం తేలిగ్గా ఉంటుంది. నూనెలు, ఉప్పూ కారాలు పెద్దగా ఉండవు. అదే కారణం అనుకొంటున్నాను.
చైనాలో అంతా సమయపాలనే ..
గడియారం ముల్లుకూ చైనా వారి సమయపాలనకు లంకె ఉంది. నిమిషాలు... సెకన్లను కూడా లెక్కిస్తారు. ఒక్క సెకను లేటయినా.. ఒక్క నిమిషం ముందుగా వచ్చినా అస్సలు భరించలేరు. ఈ విషయాన్ని చంద్రబాబు బృందం గుర్తించింది. పారిశ్రామికవేత్తల భేటీకి మూడు నిమిషాలు ఆలస్యమైతే సభలో కాస్త అలజడి రేగింది. సమావేశాల కోసం బస్సు వద్దకు చేరుకోవడంలో ఒక మంత్రి మూడు నిమిషాలు ఆలస్యం చేశారు. అంతే.. బస్సు వెళ్లిపోయింది. ఇదే అనుభవం ఒక అధికారికీ ఎదురైంది.
అద్దె ఇంటికి చంద్రబాబు
శనివారం తెల్లవారుజామున చైనా పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు... విమానాశ్రయం నుంచి నేరుగా కొత్త ఇంటికి వెళ్లిపోయారు. అంతకుముందే ఆయన కుటుంబ సభ్యులు ఈ అద్దె ఇంట్లోకి మారారు. జూబ్లీ హిల్స్‌ పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్‌ నెంబర్‌ పది వద్ద ఈ ఇల్లు ఉంది.

No comments:

Post a Comment