Saturday, 18 April 2015

కేసీఆర్‌ అవకాశవాది

కేసీఆర్‌ అవకాశవాది

-టీడీపీ అంటేనే టీఆర్‌ఎస్‌కు వణుకు
- పంట నష్టంపై సీఎం ప్రకటన చేయాలి: ఎర్రబెల్లి 

కామారెడ్డి/నిజామాబాద్‌/మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 18: రంగు మారిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పచ్చి అవకాశవాది అని, పిట్టల దొర అని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలను ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ఆయన సవాల్‌ విసిరారు. టీడీపీ అంటేనే టీఆర్‌ఎస్‌కు వణుకు పుడుతోందన్నారు. రానున్న శాసనసభ సమావేశాల్లో సీఎం, మంత్రుల అవినీతి అక్రమాలను ఎండగడుతామన్నారు. టీడీపీని ఆంధ్రాపార్టీగా చెబుతున్న కేసీఆర్‌, తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ పేరును తన కొడుకుకు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. కొడుకు పేరును శ్రీకాంతచారిగా మార్చుకోవాలని సూచించారు. మిషన్‌ కాకతీయ పేరుతో టీఆర్‌ఎస్‌ నాయకులు జేబులు నింపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలపై సీఎం కేసీఆర్‌ వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో శనివారం దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలింఇన ఆయన మాట్లాడుతూ పంట నష్టంతో అల్లాడిపోతున్న రైతులను ప్రభుత్వం ఓదార్చే ప్రయత్నం కూడా చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే తామే పంట నష్టంపై ప్రధాని దృష్టికి తీసుకెళతామన్నారు. నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. కేంద్రం నిర్ణయించిన పరిహారం కాకుండా రైతుకు ఎకరాకు రూ.20- 25 వేలను ఇవ్వాలన్నారు. రైతులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమని, టీడీపీ తరపున బాధిత కుటుంబాలకు రూ. 50 వేలు అందించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, ప్రకాష్‌ గౌడ్‌లు పాల్గొన్నారు. కేబినెట్‌లో ఒక్క ఆడపడచుకి కూడా ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి సీఎంను ప్రశ్నించారు.
కేసీఆర్‌ గాల్లో తేలుతున్నాడు: జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): స్కైవేలు, ఫ్లైఓవర్లు, విశ్వనగరం అంటూ సీఎం కేసీఆర్‌ గాల్లో తేలియాడుతున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక పక్క అకాల వర్షాలతో రాష్ట్రం కొట్టుకుపోతుంటే, పంటలు నష్టపోయి రైతులు తల్లడిల్లుతుంటే... ధనిక రాష్ట్రమంటూ గాల్లో మేడలు కడుతున్నారని, బ్యాంకర్ల సమావేశంలో ల్యాండ్‌ బ్యాంకు గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పంట దెబ్బతిని రోజులు గడుస్తున్నా... ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు రూపొందించలేదని ఆరోపించారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం పర్యటించలేదని, రైతులను ఓదార్చలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీఎం గాల్లో తేలియాడకుండా... భూమ్మీదకు దిగాలన్నారు.

No comments:

Post a Comment