నేతాజీ కుటుంబంపై 20 ఏళ్ల నిఘా
Sakshi | Updated: April 11, 2015 06:05 (IST)
* ఉత్తర ప్రత్యుత్తరాలపైనా నిఘా.. దేశంలోనే అతి పెద్ద గూఢచర్యం
* సమరయోధుడి కుటుంబంపై నెహ్రూ సర్కారు చర్య
* న్యాయవిచారణకు నేతాజీ కుటుంబం డిమాండ్
న్యూఢిల్లీ: ‘‘నాకు జవహర్‌లాల్ నెహ్రూ చేసినంత నష్టం మరెవరూ చేయలేదు’’ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన అన్న కుమారుడు అమీయనాథ్ బోస్‌కు 1939లో రాసిన ఓ లేఖలోని సారాంశం ఇది. ఇన్నేళ్ల తర్వాత ఈ లేఖ బయటపడింది. ఇది ఆయన కుటుంబ సభ్యులు విడుదల చేసిన లేఖ కాదు. స్వాతంత్రం వచ్చాక నెహ్రూ ప్రభుత్వం నేతాజీపైనా, ఆయన కుటుంబంపైనా ఏకధాటిగా నిర్వహించిన గూఢచర్యం ఫలితంగా దాచిన ఫైళ్లలోని పత్రమిది. తెల్లవాళ్లు వెళ్లిపోయాక వాళ్లను తలదన్నేలా మనవాళ్లే సమరయోధుడిపై నిఘా పెట్టిన వ్యవహారం తాజాగా బయటపడటం నేతాజీ మాటలను నిజం చేస్తోంది.
నేతాజీ కుటుంబంపై ఏకంగా రెండు దశాబ్దాల పాటు భారత ప్రభుత్వం గూఢచర్యం చేయించింది. ఇందులో ఎక్కువ భాగం.. 16 ఏళ్లు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రధానిగా ఉన్న కాలం కావటం గమనార్హం. నేతాజీకి సంబంధించిన పత్రాలలో కొన్ని పశ్చిమబెంగాల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ముఖ్యకార్యాలయంలో ‘అత్యంత రహస్య పత్రాలు’గా ఉండిపోయాయి. బెంగాల్ ఐబీ ఆఫీసులోని ఈ పత్రాలను ‘రహస్య పత్రవిభాగం’ నుంచి కేంద్ర హోం శాఖ తొలగించటంతో వాటిని ఢిల్లీలోని జాతీయ ప్రాచీన దస్తావేజుల భాండాగారం(నేషనల్ ఆర్కైవ్స్)కు తరలించారు.
దీంతో ఈ పత్రాలలోని సమాచారం బహిర్గతమైంది. వీటిలో కొంత సమాచారాన్ని నేతాజీ కుటుంబ సభ్యుడు, టీఎంసీ ఎంపీ సుగతా బోస్ సేకరించారు. వీటి ప్రకారం 1948 నుంచి 1968 వరకు సుభాష్ అన్న శరత్‌చంద్రబోస్ కుమారులు శిశిర్ కుమార్ బోస్, అమీయ నాథ్ బోస్‌లపై భారత ప్రభుత్వం నిఘా నిర్వహించింది. బోస్ కుటుంబం నివసించే కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లోని 38/2 వుడ్‌బర్న్ పార్క్ ఇళ్లపై ఐబీ నిరంతర గూఢచర్యం చేసింది. వీరిద్దరూ నేతాజీకి చాలా దగ్గరి వాళ్లు కావటం వల్ల వారి ప్రతి కదలికనూ ఐబీ వర్గాలు నీడలా పరిశీలిస్తూ వచ్చాయి. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా.. ఎవరితో మాట్లాడినా.. నీడలా వెంటాడాయి. వారి కి వచ్చిన లేఖలను రహస్యంగా చించి చదివి వాటి కాపీలను సైతం దాచాయి. ఈ వ్యవహారంపై నేతాజీ కుటుంబం తీవ్రంగా మండిపడింది. ఇది స్వాతంత్య్ర సమరయోధులందరినీ అవమానించినట్లని నేతాజీ మనవడు సుగతాబోస్ అన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment