Friday, 17 April 2015

సత్తా చాటండి - షాంఘై బిజినెస్‌ సర్కిల్‌కు చంద్రబాబు పిలుపు

సత్తా చాటండి

షాంఘై బిజినెస్‌ సర్కిల్‌కు సీఎం చంద్రబాబు పిలుపు
హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): చైనాలో ఆరు రోజుల పాటు బిజి బిజీగా గడిపిన ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆరు రోజుల చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ ముఖ్య నేతలతో పాటు, పారిశ్రామిక వేత్తలను కలిసి కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కాథే పసిఫిక్‌ విమానంలో హాంగ్‌కాంగ్‌ నుంచి బయలు దేరి హైదరాబాద్‌ చేరుకున్నారు. పలువురు పార్టీ ప్రతినిధులు విమానాశ్రయంలో చంద్రబాబుకు స్వాగతం పలికారు. కాగా, శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సీఎం చంద్రబాబు లేక్‌వ్యూలో ప్రజాపత్రినిధులకు అందుబాటులో ఉంటారని సీఎంవో పేర్కొంది.
అమరావతి రూపంలో కొత్త రాజధాని నిర్మాణం
ప్రతిభ, నైపుణ్య నిరూపణకు అద్భుత అవకాశం
పారిశ్రామికవేత్తలకు మేలైన ప్రోత్సాహకాలు
వివిధ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ‘ఇతర దేశాలకు వెళితే కేవలం భవంతులే నిర్మించగలరు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించవచ్చు. ప్రతిభ, నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత అవకాశం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి రూపంలో చైనా పారిశ్రామికవేత్తల ముందు నిలిచింది. మీ సత్తాను ఏపీలోనూ నిరూపించండి’ అని షాంఘై బిజినెస్‌ సర్కిల్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. చైనా పర్యటన చివరి రోజైన శుక్రవారం షాంఘైలో బిజినెస్‌ సర్కిల్‌తో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... చైనా, భారత్‌ కలిస్తే ప్రపంచాన్నే శాసించగలవని పేర్కొన్నారు. 20 ఏళ్ల కిందట తాను చూసిన షాంఘైకి, ప్రస్తుతం చూస్తోన్న షాంఘైకి పోలికే లేదంటూ... అద్భుత అభివృద్ధిని సాధించారని షాంఘై పాలకులను అభినందించారు. స్వల్ప కాలంలోనే షాంగైలో సాధించిన అభివృద్ధిని ఏపీలోనూ చూపాలని కోరారు. అనతికాలంలో నవ్యాంధ్ర రాజధాని నగర నిర్మాణం అద్భుతంగా చేసి చూపాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల తన పాలనలో వందలాది ఇంజనీరింగ్‌ కాలేజీలను నెలకొల్పామని, పారిశ్రామికీకరణలో నూతన ఒరవడిని తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. నవ్యాంధ్రలో గడిచిన 9 నెలల్లో ప్రతిరంగంలోనూ ఒక అభివృద్ధి విధానం తీసుకొచ్చామని చెప్పారు. కార్మిక సంస్కరణలు, స్టార్ట్‌ అప్‌, ఎలకా్ట్రనిక్‌ విధానాలను తీసుకొచ్చామని, ప్రైవేటు వర్సిటీల బిల్లును తీసుకురాబోతున్నామని వివరించారు. పరిపాలన, విధానాలపరంగా ఎలాంటి లోటూ లేదన్నారు. కేంద్రం నుంచి కూడా రాయితీల రూపంలో పారిశ్రామికవేత్తలకు మేలైన ప్రోత్సాహకాలు లభిస్తాయని చంద్రబాబు చెప్పారు. అదనపు ధరకు తరుగు రాయితీ 15 శాతం, మూలధన పెట్టుబడి రాయితీ 15 శాతం కేంద్రం ఇస్తున్న విషయాన్ని వివరించారు. చౌకధరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యుత్తు 247 అందుబాటులో ఉంటుందని చెప్పారు. అంతర్గత జల రవాణాను ఏపీలో ఉన్న మరో మంచి అవకాశంగా చంద్రబాబు పేర్కొన్నారు. బీజింగ్‌ రైల్వే స్టేషన్‌ తరహాలో ఏపీలో రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలన్నది తన ఆలోచనగా వివరించారు. రోడ్డు, రైలు, విమానయానం, జల రవాణా ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ కనెక్టివిటీని మరింతగా పెంచాలన్నదే లక్ష్యమని చెప్పారు. ఆగ్నేయాసియాకు లాజిస్టిక్‌ హబ్‌గా, భారతదేశానికే ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందిస్తామని అన్నారు. కాకినాడ సెజ్‌, బ్రాండిక్స్‌ ఇండియా, అపెరల్‌ సిటీ, శ్రీసిటీ తదితర ప్రత్యేక ఆర్థిక మండళ్లు అనేకం పనిచేస్తున్నాయని చంద్రబాబు వివరించారు. చైనాలో ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. కలసి పనిచేసి సమగ్రాభివృద్ధిని సాధిద్దామని షాంఘై అథారిటీకి చంద్రబాబు పిలుపునిచ్చారు. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఏపీలో భాగస్వాములు కావాలని కోరారు.
మా నిపుణుల సహకారం
ఏపీలో హైటెక్‌ పార్కుల అభివృద్ధికి చైనా కంపెనీలను ప్రోత్సహిస్తామని షాంఘై కామర్స్‌ కమిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ షాంగ్‌ యుయాంగ్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఏపీ రాజధాని నగర నిర్మాణంలో చైనా నిపుణుల సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. భారత్‌, చైనా సంబంధాల్లో షాంఘై కీలక భూమిక వహిస్తుందన్నారు. ఇన్ఫోసిస్‌, టాటా సంస్థలు షాంఘైలో భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. గతేడాది ముంబై నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో షాంఘైకు ముంబై సోదర నగరంగా మారిందని, ఏపీని కూడా షాంఘై తరహాలో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామన్నారు. గత 30 ఏళ్లలో పట్టణాభివృద్ధిలో, డిజైనింగ్‌లో షాంఘై గణనీయ ప్రగతి సాధించిందని, తమ నిపుణులు ఏపీ నగరాల నిర్మాణానికి అవసరమైన డిజైనింగ్‌ చేయడంలో సహకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చైనాలో భారత్‌ రాయబారి అశోక్‌ కాంత కూడా పాల్గొన్నారు. అనంతరం ఏపీ ప్రభుత్వం-చైనా పారిశ్రామిక సంస్థలకు; ఏపీలోని పారిశ్రామిక సంస్థలు-చైనా పారిశ్రామిక సంస్థల మధ్య సౌర విద్యుత్‌, బొమ్మలు, వస్త్ర రంగాల్లో బిజినెస్‌ టు బిజినెస్‌ ఒప్పందాలు జరిగాయి.
సోలార్‌ పార్కులకు పెద్ద పీట
ఏపీలో 10,000 మెగావాట్ల సోలార్‌ పార్కుల ఏర్పాటు తమ లక్ష్యమని ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు. ఇప్పటికే మూడు సోలార్‌పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధమైందన్నారు. ఒక్కొక్కటీ వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రెండు సోలార్‌పార్కులకు టెండర్లు ఆహ్వానించామని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు... ఏపీలో ఇప్పటికే కేంద్ర పరిశోధనా సంస్థలను నెలకొల్పుతున్నామని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ వివరించారు. రాష్ట్రంలో పరిశోధనా సంస్థల అభివృద్ధికి చైనీయులు ప్రతిపాదనలతో రావాలని రావత్‌ కోరారు.

No comments:

Post a Comment