Wednesday, 15 April 2015

చైనా టూరులో బిజీ బిజీగా చంద్రబాబు...

చైనా టూరులో బిజీ బిజీగా చంద్రబాబు...

07:11 - April 15, 2015
హైదరాబాద్:ఏపీ సిఎం చంద్రబాబు చైనా టూర్‌లో బిజిబిజిగా గడుపుతున్నారు. చైనా హార్బర్ ఇంజ‌నీరింగ్ కంపెనీ ప్రతినిధుల‌తో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించారు. అభివృద్ధి పైనే తాము దృష్టి పెట్టామ‌ని, భార‌త దేశంలో వ్యాపార అవ‌కాశాలు వినియోగించుకోవాల‌ని బాబు కోరారు. అనంతరం బీజింగ్‌లో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వహించారు.
మూడో రోజు కూడా విస్తృతంగా ప‌ర్యటన....
చైనా ప‌ర్యట‌న‌లో చంద్రబాబు టీం మూడో రోజు కూడా విస్తృతంగా ప‌ర్యటిస్తోంది. అక్కడ ప్రముఖ మౌలిక వ‌స‌తుల కంపెనీ అయిన హార్బర్‌ ఇంజనీరింగ్‌ ప్రతినిధుల‌తో బాబు స‌మావేశ‌మ‌య్యారు. ఆ కంపెనీ ప‌నితీరు, చైనా అభివృద్ధిలో ఏవిధంగా తోడ్పడింది అడిగి తెలుసుకున్నారు. త‌ర్వాత కంపెనీ చైర్మన్‌ మౌ వెన్‌ హూతో చ‌ర్చించారు. ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో త‌మ కంపెనీకి ఎంతో అనుభ‌వం ఉందని.. ఎయిర్ పోర్టుల నిర్మాణం, మెరైన్ కార్యక‌లాపాలే త‌మ ప్రధాన వాణిజ్యమని వెన్ హూ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, సివిల్ ఇంజ‌నీరింగ్ ప‌నుల‌్లో త‌మ‌కు మంచి అనుభ‌వం వుంద‌న్నారు. చైనాలో తాము గ‌డించిన ప్రావీణ్యత, అనుభ‌వం.. అవకాశం వస్తే ఏపీలోవినియోగించుకుంటామ‌న్నారు.
40 ఏళ్లలో చైనా మంచి ప్రగ‌తి.....
గ‌త 40 ఏళ్లలో చైనా మంచి ప్రగ‌తి సాధించింద‌న్నారు సిఎం చంద్రబాబు. భార‌తదేశం క‌న్నా 13 ఏళ్ళ ముందు చైనాలో సంస్కర‌ణ‌లు ప్రారంభించార‌ని ప్రశంసించారు. ప్రపంచ స్థాయి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నెల‌కొల్పినందుకు బాబు అభినందించారు. చైనా జీడీపీలో 20 శాతం మాత్రమే తాము సాధించామన్నారు. కొత్త రాష్ట్రంలో వ‌న‌రులు పుష్కలంగా ఉన్నాయ‌ని.. ఏపీలో వ‌ర‌ల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెల‌కొల్పాల‌న్నదే త‌మ సంక‌ల్పంగా సీఎం చెప్పారు. గ‌తంలో తాను సీఎంగా ఉండ‌గా హైద‌రాబాద్ చుట్టూ 165 కిలోమీటర్ల ఔట‌ర్ రింగ్ రోడ్డు నిర్మించిన విష‌యం ప్రస్తావించారు. దానిక‌న్నా పొడ‌వైన రింగు రోడ్డును కొత్త రాష్ట్రంలో నిర్మించాల‌ని అనుకుంటున్నట్లుగా చెప్పారు.
ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల ఏర్పాటుపై త‌మ‌కు ఆస‌క్తి....
ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల ఏర్పాటుపై త‌మ‌కు ఆస‌క్తి వుంద‌ని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చైర్మన్‌ మౌ వెన్‌ హు చెప్పారు. ఏపీలో ఇండస్ట్రియ‌ల్ పార్కు ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సిన అన్ని మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు. కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మిస్తున్న విష‌యం వారితో ప్రస్తావించిన సీఎం, ప్రాచీన బౌద్ధ క్షేత్రం పేరును రాజధానికి పెట్టినట్లుగా చెప్పారు. కొత్త రాజ‌ధాని ప్రాంతంలో చైనా హార్బర్ ఇంజ‌నీరింగ్ కంపెనీ కార్యాల‌యం ఏర్పాటు చేసుకోవాల‌ని కోరారు.
బీజింగ్‌లో పారిశ్రామిక వేత్తల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశం....
త‌ర్వాత చంద్రబాబు బీజింగ్‌లో పారిశ్రామిక వేత్తల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వహించారు. పెట్టుబ‌డుల‌కు ఏపీ ఏ విధంగా అనుకూలంగా ఉందో వివ‌రించారు. భారత్ చైనాలు రాబోయే ద‌శాబ్దాల్లో బాగా అభివృద్ధి చెందుతాయ‌న్నారు బాబు. ఆర్ధిక సంస్కర‌ణ‌ల త‌ర్వాత రెండు దేశాలు అభివృద్ధి బాట‌లో పయనిస్తున్నాయన్నారు.
బిజినెస్ టు బిజినెస్ అవగాహనా ఒప్పందం....
చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌, సోమా కంపెనీల మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో బిజినెస్ టు బిజినెస్ అవగాహనా ఒప్పందం కుదిరింది. ఎంఓయూ పై రెండు కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు.

No comments:

Post a Comment