నేడు ఉత్తర్వులివ్వనున్న సీఎస్
తప్పు తేలితే చర్యలు తప్పవు
అసద్ ఫిర్యాదు చేశారు: నాయిని
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి):వికారుద్దీన్ సహా ఐదుగురి ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది రోజుల క్రితం పోలీస్ ఎదురుకాల్పుల్లో వికారుద్దీన్‌సహా ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వివిధ పార్టీల నుంచి ఎన్‌కౌంటర్ తీరుపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు సిట్‌తో దర్యాప్తు జరిపించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. సిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలనే దానిపై సోమవారం ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎ్‌సను సీఎం ఆదేశించారు. కాగా త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంతో మిత్రుత్వం బెడిసికొట్టకుండా ఉండేందుకే ఎన్‌కౌంటర్‌పై విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి మృతుల కుటుంబ సభ్యులతోపాటు మతపెద్దలు, ఎంఐఎం నేతలు పోలీసుల తీరును తప్పుబడుతూ ఆరోపణలు చేశారు. తన కొడుకును పోలీసులు అకారణంగా కాల్చి చంపారంటూ వికార్ తండ్రి ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. వికార్ అండ్ గ్యాంగ్ దాడికి దిగడంతోనే ఆత్మరక్షణలో భాగంగా జరిపిన ఎదురుకాల్పుల్లో వారు చనిపోయినట్లు పోలీసులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఏదేమైనా సిట్ దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. మరోవైపు.. వికారుద్దీన్ సహా ఐదుగురి ఎన్‌కౌంటర్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతోందని, ఈ ఘటనలో తప్పు జరిగిందని తేలితే నేరుగా సంబంధితులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సీఎం కేసీఆర్‌తో పాటు.. తనకూ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. అందుకు నాయిని స్పందిస్తూ వెంకయ్య ఏం మాట్లాడారో తనకు తెలియదని చెప్పారు.
No comments:
Post a Comment