Wednesday, 29 April 2015

2020 నాటికి దేశంలో 60 శాతం యువతే - బాబు

ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు
ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో అభివృద్ధికి కృషి
2020 నాటికి దేశంలో 60 శాతం యువతే
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం విశాఖలోని నొవాటెల్‌ హోట్‌లో ఇండస్ర్టియల్‌ మిషన్‌ను బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని, వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
 
2020 నాటికి దేశంలో ఆంగ్లంలో మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని...అప్పటికి దేశ జనాభాలో 60 శాతం యువతే ఉంటుందన్నారు. గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు ఐటీ సంస్థలను తీసుకువచ్చేందుకు 15 రోజుల పాటు అమెరికాలో పర్యటించానని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
 
రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదని బాబు తెలిపారు. 2020 నాటికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యమని స్పష్టం చేశారు. 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న బాబు రెండంకెల వృద్ధిరేటు సాధిస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేస్తామని చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని సీఎం పేర్కొన్నారు. దేశంలో మిగిలిన రాష్ర్టాల కంటే ఏపీ పారిశ్రామిక విధానం అత్యున్నతమైనదని చంద్రబాబు అన్నారు. 15 రోజుల్లోనే సింగ్‌ల్‌ డెస్క్‌తో పరిశ్రమలకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.
 
సంక్షేమ పథకాల అమలులోనూ టెన్నాలజీ వాడుతున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్‌ విధానంతో రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఆధార్‌తో అన్నింటినీ అనుసంధానం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలో ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు తీసుకొస్తామన్నారు. విద్యా, వైద్య, టూరిజం హబ్‌గా ఏపీని మారుస్తామని స్పష్టం చేశారు. హైవేతో తీరప్రాంతాలు అనుసంధానం చేస్తామని, జలరవాణా మార్గాలు అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
 
రెండోతరం పారిశ్రామిక వేత్తల్లో ఎక్కవ మంది ఏపీ వారే ఉన్న బాబు పరిశ్రమలు, సేవారంగాలతోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. కృష్ణా నదికి ఇరువైపులా రాజధాని నిర్మాణం ఉంటుందని తెలిపారు. విశాఖ ఆర్థిక రాజధాని, టూరిజం కేంద్రంగా మారుతుందని చెప్పారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు.
 
భూసేకరణపై విపక్షాల రాద్ధాంతం సరికాదని, అభివృద్ధి జరగాలంటే భూసేకరణ అవసరమని వివరించారు. రాజధానికి 33 వేల ఎకరాలు భూసమీకరణ చేసినట్లు చెప్పారు. అభివృద్ధిలో తొలి ప్రాధాన్యత భూములు ఇచ్చే రైతులకే అని స్పష్టం చేశారు. ఉపాధి కల్పనలో యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

No comments:

Post a Comment