నన్ను ఉండొద్దనడానికి కేసీఆర్ ఎవరు?: చంద్రబాబు | |
|
- తెలంగాణలో ఉంటాం.. గెలిచి తీరుతాం
- నా వల్ల కాదా తెలంగాణ మిగులు రాష్ట్రమైంది?
- టీ టీడీపీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్య
- ప్రజల మధ్యే ఉండి పనిచేయాలని సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇక్కడేం పని అని టీఆర్‌ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు చంద్రబాబు స్పందించారు. ‘ఆ మాట అనడానికి కేసీఆర్ ఎవరు? తెలంగాణతో నాది ముప్ఫై ఏళ్ల అనుబంధం. తెలంగాణలో ఒక స్పష్టమైన అభివృద్ధికి పునాదులు వేసింది నేనే. రోడ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు, ఐటీ కంపెనీలు, గ్రామాల్లో మంచినీటి పధకాలు వంటి వన్నీ నా హయాంలోనే తెలంగాణలో వచ్చాయి. నేను దిగిపోయే సమయానికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. ఎన్నో కంపెనీలను నేను తేవడం వల్ల..హైదరాబాద్‌కు ఆదాయం పెరిగింది. ఇవాళ దేశంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందంటే ఆ కృషి...శ్రమ నాది.
ఈ ఆరు నెలల్లో కేసీఆర్ పాలన వల్ల తెలంగాణ మిగులు రాష్ట్రం కాలేదు. చేతనైతే నా కంటే బాగా చేసి చూపించాలి. నాపై ఏడిస్తే ఉపయోగం లేదు. భౌతికంగా విడిపోయింది నిజం. కానీ మానసికంగా తెలుగువారంతా ఒకటే. వారందరి కోసం తెలుగుదేశం పార్టీ అక్కడా ఉంటుంది...ఇక్కడా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంగళవారం ఆయన ఇక్కడ సచివాలయంలో తెలంగాణ ప్రాంత పార్టీ ముఖ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన విమర్శల ప్రస్తావన రాగా, చంద్రబాబు స్పందించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో బడుగు బలహీనవర్గాలకు తమ వాణిని వినిపించే అవకాశం వచ్చి రాజకీయంగా ముందడుగు వేయగలిగారని, ఆ వర్గాల వాణి వినిపించకూడదని అనుకొనేవారే ఇక్కడ టీడీపీ ఉండకూడదని భావిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘టీడీపీ ఆవిర్భావం తెలంగాణలో పెత్తందారీతనానికి పాతర వేసింది. టీడీపీ ప్రభుత్వాలు తెలంగాణలో చక్కటి అభివృద్ధిని చూపించాయి. పని చేసిన వాళ్లం మనం. మనం లేకుండా ఎటుపోతాం? ఈ విషయాలు ప్రజలకు సమగ్రంగా వివరించండి. అనునిత్యం ప్రజల్లో ఉండండి. వారి హృదయాలను గెలుచుకోండి’ అని ఆయన పార్టీ నేతలకు సూచించారు. గిల్లి కజ్జాలు పెట్టుకొంటూ రెండు రాషా్ట్రల మధ్య తగాదాలు రగలాలన్నట్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఖరి ఉన్నదని, తాను మాత్రం వీలైనంతవరకూ తెలంగాణకు కూడా సహకరిస్తూ తన పని తాను చేసుకొంటూ పోతున్నానని చెప్పారు.
ఆదరణ బాగుంది: టీ టీడీపీ నేతల సంతృప్తి ప్రజలు ఎన్నో ఆశలతో టీఆర్‌ఎ్‌సను గెలిపించారని, ఆ ఆశలు నిలుపుకోవడంలో ప్రభుత్వం రోజురోజుకూ విఫలమవుతోందని...ప్రజల్లోకి వెళ్లినప్పుడు తమకు అది స్పష్టంగా కనిపిస్తున్నదని తెలంగాణ నేతలు..ఆయనకు చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకూ జరిగిన మూడు జిల్లాల పార్టీ సమావేశాలు బాగా జరిగాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. మే నెలాఖరులో జరిగే మహానాడు సమావేశాల తర్వాత తదుపరి జిల్లా సమావేశం నల్లగొండలో నిర్వహించాలని అనుకొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరిగే అవకాశం ఉన్నందువల్ల పార్టీపరంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, కింది స్థాయి నుంచి కేడర్‌ను ఉత్తేజితం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కూడా పార్టీపరంగా ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే, తగిన సమయం, సందర్భం చూసుకొని చేపట్టాలని అనుకొన్నారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉప నేత రేవంత్ రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, కొత్తగా టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సాయన్న పాల్గొన్నారు.
|
|
No comments:
Post a Comment