|
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్‌సభలో మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని హోం శాఖ వర్గాలు ఆ తర్వాత పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఆశలపై కేంద్ర ప్రభుత్వం కుండెడు నీళ్లను కుమ్మరించింది! రాష్ట్ర విభజన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని బీజేపీ తుంగలోకి తొక్కింది! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజ్ఞప్తులను తోసిపుచ్చింది! తమ విజయంలో కీలక భాగస్వామి అయిన ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ వినతిని పక్కనపెట్టింది! ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాసిన లేఖలను బుట్టదాఖలు చేసింది! ‘నా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అమలు చేయండి’ అంటూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన డిమాండ్‌ను అస్సలు పట్టించుకోనేలేదు! వెరసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోదీ ప్రభుత్వం పేద్ద టోపీ పెట్టింది! కాస్త, నర్మగర్భంగానే అయినా ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చే అవకాశం లేదు’ అని తేల్చి చెప్పేసింది! నిబంధనలను ఏకరువు పెడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఉద్దేశమే తమకు లేదని చెప్పకనే చెప్పింది! కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరాన్ని కేంద్రం ఏమాత్రం గుర్తించలేదు! ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదు.. దేశంలోని ఏ రాష్ట్రానికీ ఇకపై ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కూడా తేల్చి చెప్పింది! 14వ ఆర్థిక సంఘం రూపొందించిన నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే, దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ఆశలు పెట్టుకోవద్దని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి అభ్యర్థనలు వచ్చాయని, అయితే, జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) నియమనిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా కల్పించేందుకు కొన్ని లక్షణాలు ఉండాలంటూ పాత విషయాలనే ఏకరువు పెట్టారు. రాష్ట్రాల మొత్తం అవసరాలను పరిగణనలోకి తీసుకునే 14వ ఆర్థిక సంఘం సిఫారసులు చేసిందని, తదనుగుణంగానే కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం మార్పులు చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్ర మంత్రివర్గం జాతీయ అభివృద్ధి మండలికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ రెండూ ఎన్నికల్లో హామీ ఇచ్చాయి కూడా. మరోవైపు, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తమకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నిస్తూ టీఆర్‌ఎస్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, టీడీపీ సభ్యుడు మాగంటి బాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి ఇంద్రజిత్‌సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాక ఒడిసా, రాజస్థాన్, బీహార్, ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ, జార్ఖండ్ నుంచి కూడా ప్రత్యేక హోదా కల్పించాలంటూ తమకు అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. ‘‘గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని నిర్ణయించినప్పుడు, ఆయా రాష్ట్రాలకు కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉండాలని జాతీయ అభివృద్ధి మండలి తీర్మానించింది. పర్వత, దుర్గమ ప్రాంతాలు, తక్కువ జనసాంధ్రత, చెప్పుకోదగిన గిరిజన జనాభా, పొరుగు దేశాలతో సరిహద్దులు, ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనకబాటుతనం, రాష్ట్ర ఆర్థిక వనరుల్లో తీవ్ర లోటు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని నిర్ణయించింది. దీని కిందకు వచ్చే రాష్ట్రాలకే సాధారణ కేంద్ర సాయం ఇచ్చే విషయంలో ప్రాధాన్యం ఉంటుంది. అయితే, 14వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి సిఫారసులు చేసింది. ఆ సమయంలో, ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద రాష్ట్రాల పూర్తి అవసరాలను పరిగణనలోకి తీసుకుంది. దాని ప్రకారమే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల కేటాయింపుపై కేంద్రం మార్పులు చేసింది. అందుకే, ఇతరేతర ప్రత్యేక సాయం కింద కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు’’ అని వివరించారు.
ప్రోత్సాహకాలు ఇస్తాం
పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం, ఏపీ, తెలంగాణలకు పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం వంటి కొన్ని ఆర్థిక చర్యలను కేంద్రం చేపట్టాల్సి ఉందని, అందుకే, ఆర్థిక బిల్లు 2015లో రెండు రాష్ట్రాల నోటిఫైడ్ ప్రాం తాల్లో కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించామని తెలిపారు. వీటిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నోటిఫైడ్ వెనకబడిన ప్రాంతాల్లో పెట్టే పరిశ్రమలకు ఐదేళ్లపాటు 15శాతం అదనపు పెట్టుబడి అలవెన్స్ రూపేణా రాయితీలు కల్పించేందుకు వీలుగా ఆదాయపు పన్ను చట్టంలో 32 డి పేరిట కొత్త సెక్షన్‌ను చేరుస్తారని చెప్పారు. అలాగే, రెండు రాష్ట్రాల వెనకబడిన ప్రాంతాల్లో నెలకొల్పే ప్లాంట్, యంత్రాలకు అనుమతించే 20 శాతం తరుగుదలతోపాటు మరో 15 శాతం అదనంగా తరుగుదలను అనుమతించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2015 ఏ ప్రిల్ 1- 2020 ఏప్రిల్ 1 వరకు ఈప్రాంతాల్లో నెలకొల్పే కొత్త ప్లాంట్, యంత్రాలకు మాత్రమే ఇది వరిస్తుందని చెప్పారు.
ప్రత్యేకహోదా తప్పనిసరి: చంద్రబాబు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రులు ఏం చెప్పినా.. ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాన్ని మాత్రం ఆపేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అదే సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రకటించారు. కొందరు నేతలు ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ప్రకటనలో అంత స్పష్టతగానీ, సూటిగా చెప్పినట్లుగానీ లేదని వారు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న ఇబ్బందుల దృష్ట్యా అంతకుముందు నుంచే కేంద్రం.. ప్రత్యేక హోదాపై సానుకూలంగా లేనట్లు సంకేతాలు ఇస్తోందని, అందులో భాగంగానే ఈ తాజా పరిణామం అ యి ఉండవచ్చని మరి కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే..వారి వ్యాఖ్యలపై స్పం దించిన చంద్రబాబు.. కేంద్రానికి ఏ అభిప్రాయాలు ఉన్నా రాషా్ట్రనికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటామని, రాజీపడేది లేదన్నారు. ‘‘విభజన పరిణామాల్లో హైదరాబాద్‌ను కోల్పోయాం. ఇప్పుడు రాజధానిని కట్టుకోవాలి. ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. పరిశ్రమలు, విద్యా సంస్థలు, మౌలిక వసతులు పెంచుకోవాలి. పక్కన ఉన్న రాష్ట్రాలతో పోటీ పడటానికి అనువైన పరిస్థితులు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) కల్పించాలన్నది మొ దటి నుంచి మనం వాదిస్తున్నాం. ప్రత్యేక హోదా ఇస్తే అది కొంతవరకూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. నేను ఢిల్లీ వెళ్ళి న ప్రతిసారీ కేంద్రంలోని పెద్దలకు ఇదే వివరిస్తూ వస్తున్నాను. కొద్ది రోజుల క్రితం అనంతపురంకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి దానిపై వివరించాను. వారి ఇబ్బందులు వారికి ఉండవచ్చు. కానీ, మన ఇబ్బందులు అంతకంటే పెద్దవి’’ అని ఆయన చెప్పారు. ప్రజలకు కూడా ఇదే వివరించాలని, దాచుకోవాల్సిన అవసరం లేదని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
ప్రత్యేక హోదా మా హక్కు: గోరంట్ల
ప్రత్యేక హోదా కోసం తామెవ్వరిని ‘బిక్షమెత్తడంలేదు, దేబిరించడం లేదు, అది మా హక్కు’ అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాషా్ట్రనికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈరోజు రాషా్ట్రనికి దుర్దినం’ అని అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అసంబద్ధంగా విభజించినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని హమీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందునే ఇవ్వడంలేదన్న వాదనను తోసిపుచ్చారు. మరి అంతకుముందు ప్రత్యేక హోదా ఇస్తామన్న హమీకి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. అప్పుడు హమీ ఇచ్చి ఇప్పుడు గాలికి వదిలేస్తామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీకీ ఈ విషయంలో పాపం అంటుకుంటుంది కదా? అన్న విలేకర్ల ప్రశ్నకు.. ఇప్పుడు పాపం ఎవరికి ఎంత అంటుతుందో చూడాల్సిన సమయం కాదని ఆయన అన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతున్నార ని ఆయన చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విభజన హమీల అమలుకోసం చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రితోపాటు ఆర్థిక మంత్రి కూడా ప్రత్యేకహోదాపై స్పష్టమైన హమీ ఇచ్చారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రి ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.
తుది నిర్ణయం తీసుకోలేదు!
కేంద్ర హోంశాఖ వర్గాల వివరణ న్యూఢిల్లీ : ‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వలేం’ అని ఇంద్రజిత్ సింగ్ చెప్పకనే చెప్పినప్పటికీ...కేంద్ర హోంశాఖ వర్గాలు మాత్రం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాయి. ఏపీ ఎంపీలకు ఇంద్రజిత్ సింగ్ ఇచ్చిన జవాబుతో ప్రత్యేక హోదాపై ఇక ఆశలు వదులుకోక తప్పదనే అభిప్రాయం ఏర్పడింది. విపక్షాల నిరసనలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో...శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ అంశంపై కేంద్ర హోంశాఖ వర్గాలు స్పందించాయి. ‘‘ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై హోంశాఖ ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపాయి. బీజేపీ నేత సుధాన్షు త్రివేదీ ఇదేవిషయం చెప్పారు. |
No comments:
Post a Comment