Monday, 13 April 2015

పెట్టుబడుల స్వర్గం

పెట్టుబడుల స్వర్గం

రండి.. పరిశ్రమలు పెట్టండి
సిమెంట్‌కు ఇప్పుడు మా దగ్గర మంచి గిరాకీ
పరిశ్రమల ఏర్పాటుకు ఇదే మంచి తరుణం
చైనాలో చంద్రబాబు పిలుపు
పారిశ్రామికవేత్తలతో చర్చలు
మొదటి రోజు బిజీ బిజీగా ఏపీ సీఎం బృందం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉందని, కొత్త రాజధానిలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పారిశ్రామికవేత్తలను కోరారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం చైనా పర్యటనలో భాగంగా ఆదివారం బీజింగ్‌లో అడుగుపెట్టింది. రాష్ట్ర పారిశ్రామికీకరణే ధ్యేయంగా ఆరు రోజులపాటు చైనాలో పర్యటించనుంది. ఈ ప్రతినిధి బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ఎంపీలు సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఢిల్లీలో ఏపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, తదితరులు ఉన్నారు. బీజింగ్‌లో అడుగు పెట్టిన వెంటనే తొలుత, సినోమా ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయింది. భారత్‌లో సిమెంట్‌ కర్మాగారాల ఏర్పాటుకు సినోమా ముందుకు రావడం సంతోషకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సినోమా సంస్థ 70 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోందన్న విషయం తనకు తెలుసునని, కొత్త రాజధాని నిర్మాణానికి భారీగా సిమెంట్‌ అవసరమని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అనువైన అపార సహజ వనరులు ఉన్నాయని, సున్నపు రాయి గనులు, నిరంతర విద్యుత్‌, జల వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
ఏపీలో అద్భుత పారిశ్రామిక విధానం ఉందన్నారు. పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని, కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు 15 శాతం రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. కాగా, సిమెంట్‌ రంగంలో భారత్‌లో అపార అవకాశాలున్నాయని సినోమా సంస్థ చైర్మన్‌ సౌంగ్‌ సౌషన్‌ అన్నారు. ఇప్పటికే భారత్‌లోని రెండు సిమెంట్‌ కర్మాగారాలకు తాము సామగ్రిని సరఫరా చేస్తున్నామన్నారు. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని, అనుమతులు ఎంత కాలంలో మంజూరు చేయగలరని సౌషన్‌ అడిగి తెలుసుకున్నారు. భారత్‌లో పన్నుల వివరాలు, సిమెంట్‌, పవన విద్యుత్‌ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలుసుకుంటున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఆరు రోజుల చైనా పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో 13 ఎంవోయూలు కుదుర్చుకోనుంది. బీజింగ్‌ సందర్శన సందర్భంగా గవర్నమెంట్‌ టు బిజినె్‌సతో 6 ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
పరిశోధన, తయారీ రంగాలు, స్టోరేజీ బ్యాటరీల రీసైక్లింగ్‌లో పేరొందిన క్యామెల్‌ గ్రూప్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో ప్రసిద్ధిగాంచిన చైనా పారిశ్రామిక సంస్థ ‘చైనా కౌన్సిల్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌’ (సీసీపీఐటీ)తో ఎంవోయూ కుదుర్చుకోనుంది. దీంతో, వాణిజ్య సహకారం, విదేశాలతో బిజినెస్‌ మార్పిడి సులభతరం కానున్నాయి. నిర్మాణ రంగంలో సీసీపీఐటీతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకోనుంది. ఇంజనీరింగ్‌ రంగంలో, ఉపకరణాల తయారీలో పేరొందిన సినోమా ఇంటర్నేషనల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పశుగ్రాస ఉత్పత్తి, లైవ్‌ స్టాక్‌ బ్రీడింగ్‌, స్లాటరింగ్‌, మీట్‌ ప్రాసెసింగ్‌లకు చెందిన ల్యూయో కంపెనీతోనూ ఒప్పందాలు కుదుర్చుకోనుంది. బిజినెస్‌ టు బిజినెస్‌ కింద బీజింగ్‌లోని రెండు చైనా పారిశ్రామిక సంస్థలతో రెండు ఎంవోయూలు కుదుర్చుకోనుంది. గుంటూరు జిల్లా గంగవరంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ముందుకొచ్చిన వర్టెక్స్‌ సిమెంట్స్‌ (ఇండియా), చైనాకు చెందిన సినోమా సంస్థలు ఎంవోయూ చేసుకోనున్నాయి. దుస్తుల తయారీ, సరఫరాలో ప్రముఖ కంపెనీ బ్రాండిక్స్‌, చైనా మాన్యుఫాక్చరర్‌, జియాంగ్సు కింగ్‌ డే టెక్స్‌టైల్‌ కంపెనీ మధ్య మరో ఎంవోయూ జరగనుంది. చెంగ్డు నగరంలో వివిధ చైనా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకోనుంది. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే ఆటోమేటెడ్‌ కంపెనీ, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పాన్‌ హిహ్వా గ్వాంగ్వా గ్రూప్‌, సిషువాన్‌ వెహిలిన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ, పవర్‌ప్లాంట్‌ బాయిలర్లు, స్పెషల్‌ టైప్‌ బాయిలర్లు, పవర్‌ స్టేషన్‌ యాగ్జిలరీ ఎక్వి్‌పమెంట్‌ తయారీ, ఎగుమతుల్లో ప్రసిద్ధి చెందిన చైనా వెస్ట్రన్‌ పవర్‌ ఇండసి్ట్రయల్‌ కంపెనీ (సీడబ్ల్యూపీసీ)తో ఒప్పందం కుదుర్చుకోనుంది. యాపిల్‌, శాంసంగ్‌, డెల్‌ కంపెనీలకు విడిభాగాలు ఉత్పత్తి చేసి ఇస్తున్న తైవాన్‌ పరిశ్రమ ఫోక్స్‌కాన్‌ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఏపీ రాజధాని నిర్మాణం, కొత్త రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే లీడింగ్‌ ప్లే స్టోర్‌ జెయింట్‌ పాల్స్‌ ప్లష్‌ విదేశాల్లో కార్యక్రమాలను ప్రారంభించగా.. అది శ్రీసిటీ సెజ్‌ నుంచే కావడం గమనార్హం.

No comments:

Post a Comment