మన విద్యార్థులు సత్తా చాటాలి
జిల్లాకో స్టడీ సర్కిల్.. వారంలో ఒక రోజు హాస్టల్ డే
ఎస్పీలు వసతిగృహాలకు.. కలెక్టర్లు తండాలకు వెళ్లాలి
దళిత రైతులకు పెట్టుబడి మంజూరీ కలెక్టర్లకు
ఐఏఎస్, ఐపీఎస్‌ల పిల్లలూ చదివేలా సర్కారీ బడులు
కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ‘దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటాలి. ఆ దిశగా వారిని సిద్ధం చేయండి. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయండి. కలెక్టర్లు, ఎస్పీలు కూడా అక్కడి పిల్లలకు స్వయంగా బోధన చేస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భాగంగా రెండో రోజైన శనివారం సీఎం పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల అభిప్రాయాలను, సూచనలను వింటూ వారికి దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వారంలో ఒక రోజు హాస్టల్ డే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ఎస్పీలు తనిఖీలు నిర్వహించి, అక్కడ పరిస్థితుల మెరుగునకు కృషి చేయాలని కోరారు. దళిత బస్తీలు, గిరిజన తండాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు కలెక్టర్లు, ఇతర అధికారులు అక్కడ కొంత సమయం గడపాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల పరిస్థితులను కలెక్టర్లు స్వయంగా పర్యటించి తెలుసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఆసుపత్రులను సందర్శిస్తే ద్వారా అక్కడ పరిస్థితులు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యం
దళితుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితులకు భూములు ఇవ్వడమే కాకుండా వ్యవసాయం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దీనికి వీలుగా దళితులకు పెట్టుబడిని మంజూరు చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ బాధితులను ఆదుకునేందుకు వీలుగా కలెక్టర్ల వద్ద ప్రత్యేకంగా కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించేందుకు టి-ప్రైడ్ అనే కార్యక్రమం చేపట్టామని సీఎం ప్రకటించారు. ఇంజనీరింగ్ చేసిన ఎస్సీ, ఎస్టీ యువకులకు శిక్షణ ఇచ్చి, పెట్టుబడిని సమకూర్చి ప్రొత్సహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కాంట్రాక్టర్లుగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఐదు జిల్లాల్లో 67 ప్రాంతాల్లో స్నానఘట్టాలు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.340 కోట్లను ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. జూన్ 15 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ల సమావేశంలో ప్రధాన నిర్ణయాలు..
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లబ్ధిదారులు తహసిల్దార్లకే దరఖాస్తు చేసుకోవాలి. రెండు రోజల్లో పరిశీలన పూర్తి చేసి పెళ్లికి మందే డబ్బులు ఇవ్వాలి. ఈ పథకాలకు నిధులను గ్రీన్ చానల్‌లో అందుబాటులో ఉంచాలి.
ప్రతి జిల్లాలో మైనారిటీల కోసం బాలబాలికలకు వేర్వేరుగా రెండు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి.
వక్ఫ్ భూముల పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంశంగా గుర్తించాలి. వక్ఫ్ భూముల వివరాలను కలెక్టర్లకు పంపుతాం. జీవో 58 కింద వక్ప్ భూములను రెగ్యులరైజ్ చేయవద్దు. వక్ఫ్ భూములను ముస్లింల అభివృద్ధికే ఉపయోగించాలి.
ఈ సమావేశం ముగిసిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీవోలతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాల అమలు తీరును వారితో సమీక్షించాలి.
మిషన్ కాకతీయ పనుల్ని నిర్వహించే ఇంజనీర్లకు వాహన సౌకర్యం కల్పించాలి. ప్రాజెక్టుల నిర్వాసితుల కోసం మంచి ప్యాకేజీ ఇవ్వాలి. పాకాల, రామప్ప, లక్కవరం లాంటి పెద్ద చెరువులను కూడా వచ్చే ఏడాది నుంచి మిషన్ కాకతీయ ద్వారా బాగుచేయాలి.
పూడిక మట్టిని రైతులు పొలాలకు తీసుకెళ్లేందుకు వీలుగా ట్రాక్టర్ కూలీ రేట్లను నియంత్రించాలి. రైతులకు ముందుకు వస్తే భూములను సేకరించి చెరువులను విస్తరించాలి.
పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు వెనకబడకుండా తెలుగును విస్మరించకుండానే ఆంగ్ల మీడియంలో విద్యాబోధన జరగాలి. నిర్భంద ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తాం. కేజీ టు పీజీ విద్యా విధానం ఎలా ఉండాలనే దానిపై అధికారులు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోవాలి. వాటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ప్రభుత్వ విద్యాసంస్థలను సరిగా నిర్వహించేలా చూడాల్సిన బాధ్యతను అధికారులు, ప్రజా ప్రతినిధులు తీసుకోవాలి. ఐఏఎస్, ఐపీఎ్‌సల పిల్లలూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలి. రూ.20 కోట్లతో వారోత్సవాలు నిర్వహించాలి.
No comments:
Post a Comment