Saturday, 18 April 2015

భూసేకరణ ప్రభుత్వ హక్కు- మంత్రి నారాయణ

భూసేకరణ ప్రభుత్వ హక్కు- తప్పనిసరైతే నోటిఫికేషన్‌
- రాజధాని ప్రాంతంలో..25 నాటికి వంద శాతం రుణమాఫీ : మంత్రి నారాయణ
మంగళగిరి, ఏప్రిల్‌ 18 : ‘రాజధాని కోసం ఇంకో అయిదారొందల ఎకరాలు మాత్రమే అవసరముంది. ఆ రైతులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే సంతోషం. లేదంటే ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ చేయడం చట్టపరంగా ప్రభుత్వానికి ఉన్న హక్కు. ఆ హక్కును వినియోగించుకుని భూసేకరణ చేపడతాం. దీనికోసం తొందరపడకుండా ఓపిగ్గా ఎదురుచూస్తాం. తప్పనిసరైతే భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం’ అని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలో శనివారం ఆయన మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి భూసమీకరణ కింద ఇచ్చిన భూములను చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారాయణ ప్రసంగించారు. నీరుకొండ ప్రాంతంలో రైతులు భూమి చదును కోసం యాభై ట్రాక్టర్లతో సిద్ధం కావడం చాలా సంతోషం కలిగించిందన్నారు. శనివారం ఒక్కరోజే 2 వేల ఎకరాల్లో భూమి చదును పూర్తవుతుందన్నారు. సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళిక జూన్‌ నెలాఖరుకు పూర్తవు తుందని, ఆ వెంటనే రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుపుతామని మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా నీరుకొండకు చెందిన రైతు ఒకరు ఎన్టీఆర్‌ జన్మదినమైన మే 28 నాటికి రాజధానికి శంకుస్థాపన చేయాలని కోరారు. రాజధాని గ్రామాలలో రైతు రు ణమాఫీ, గ్రామకంఠం సమస్యలను గుర్తించామని,. ఈనెల 25 నాటికి రుణ మాఫీని వంద శాతం అమ లు చేస్తామన్నారు. గ్రామ కంఠం సమస్యలనూ త్వరలోపరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
‘కొండవీటి’ ముంపుపై సింగపూర్‌కు అధ్యయన బృందం
రాజధాని ప్రాంత గ్రామాలకు పెనుసమస్యగా ఉన్న కొండవీటివాగు ముంపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్‌లో కూడా ఇదే తరహా సమస్య ఉండగా, అక్కడి అధికారులు దానిని సమర్థంగా పరిష్కరించుకున్నారని తెలిపారు. సింగపూర్‌లో వరద వాగును అభివృద్ధి చేసిన విధానాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు, ఇద్దరు సీఆర్‌డీఏ అధికారులు ఆదివారం సింగపూర్‌కు వెళ్లనున్నట్టు చెప్పారు. అలాగే, వాగును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తున్నామని మంత్రి ప్రకటించారు.

No comments:

Post a Comment