Sunday, 19 April 2015

దళపతి ఏచూరిదళపతి ఏచూరి

దళపతి ఏచూరి

  • సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవ ఎన్నిక
  • 16 మందితో పొలిట్‌బ్యూరో.. 91 మందితో కేంద్ర కమిటీ 
  • వామపక్ష విలీనం తథ్యం.. పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటా 
  • మోదీ సర్కార్‌కు కర్షకులే చరమగీతం పాడుతారు: ఏచూరి
 సీపీఎం సారథిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశ ప్రజలు వామపక్షాల విలీనాన్ని కోరుకుంటున్నారని, అది త్వరలోనే జరిగి తీరుతుందని ఏచూరి స్పష్టం చేశారు. మోదీ సర్కార్‌ పేద రైతుల భూములు లాక్కుని విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి రైతులే భరతవాక్యం పలుకుతారని జోస్యం చెప్పారు. సీపీఎం నేతృత్వంలో నవభారతాన్ని నిర్మిస్తామన్నారు.
 
విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీపీఎం మహాసభల చివరి రోజైన ఆదివారం ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగింది. ఏచూరి పేరును ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ ప్రతిపాదించగా కేంద్ర కమిటీ సభ్యులంతా మద్దతు తెలిపారు. దీంతో ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కరత్‌ ప్రకటించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఏచూరి మాట్లాడుతూ.. భవిష్యత్తులో సీపీఎం, సీపీఐ విలీనం తథ్యమని సీతారాం ఏచూరి స్పష్ట చేశారు. వామపక్షాల విలీనాన్ని దేశ ప్రజలు, వామపక్ష నేతలు కూడా కోరుకుంటున్నారన్నారు. అయితే, పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. ఆ తర్వాతే వామపక్షాల విలీనం, ప్రాంతీయ పార్టీలతో పొత్తు వంటి అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. దేశంలో అతి పెద్ద వామపక్ష పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పార్టీ తనకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. క్లిష్టమైన సమయంలో పార్టీ బాధ్యతలు స్వీకరించానని, ఇది తనకు ఒక సవాల్‌ లాంటిదని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ విధానం ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని, దీని నుంచి బయటపడేందుకు కమ్యూనిజం, సోషలిజం మాత్రమే సరైన పరిష్కార మార్గాలన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్నికకు ముందు 91 మందితో కొత్త కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. వీరిలో 74 పాతవారు కాగా, 17 మంది కొత్తవారు ఉన్నారు. కేంద్ర కమిటీ ఎన్నిక పూర్తవ్వగానే 16 మందితో కొత్త పొలిట్‌ బ్యూరోని ఎన్నుకున్నారు. ఇప్పటి వరకూ పొలిట్‌బ్యూరోలో బృందా కరత్‌ ఒక్కరే మహిళకాగా, కొత్తగా సుభాషిణి అలీకి స్థానం కల్పించారు.
 
చర్చల్లో చాణక్యం.. వాస్తవిక దృష్టికోణం
సీపీఎం అనగానే గుర్తొచ్చే అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు సీతారాం ఏచూరి. పిడివాదిగా పేరున్న ప్రకాశ్‌ కరత్‌ కంటే ఈయన వాస్తవికంగా ఆలోచిస్తారని ఆయనతో పరిచయమున్న వారు అంటారు. ఏచూరి.. హరి కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ చాణక్యాన్ని వంటబట్టించుకున్నారని పార్టీలో ఆయనకు దగ్గరగా ఉన్న వారు చెబుతారు. సీతారాం ఏచూరి ఆగస్టు 12, 1952లో సర్వేశ్వర సోమయాజి, కల్పాకం దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు. సీతారాం తల్లిదండ్రులది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. ఉద్యోగరీత్యా సీతారాం తండ్రి హైదరాబాద్‌లో కొంత కాలం ఉన్నారు. సీతారాం ఏచూరి చదువు హైదరాబాద్‌, ఢిల్లీల్లో సాగింది. సీబీఎ్‌సఈ హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ఏచూరి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందారు. ఢిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. పట్టా పుచుకున్నారు. 1974లో ఎస్‌ఎ్‌ఫఐలో చేరిన ఏచూరి, ఆ తరువాత జేఎన్‌యూలో పి.హెచ్‌డీ చేస్తుండగా ఎమర్జెన్సీలో అరెస్టయ్యారు. దీంతో ఆయన పీహెచ్‌డీ అంతటితో ఆగిపోయింది. ఎస్‌ఎ్‌ఫఐ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. 1985లో సీపీఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1992లో పొలిట్‌ బ్యూరోలో సభ్యుడయ్యారు. 2005 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
 
సీతారాంది అంకిత భావం: తల్లి కల్పాకం
 సామర్లకోట : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎంపికవడంపై ఆయన తల్లి కల్పాకం ఆనందం వెలిబుచ్చారు. వామపక్ష సిద్ధాంతాల పట్ల అంకిత భావం కలిగి ఉండి ఈ దశకు చేరుకున్నారని వ్యాఖ్యానించారు. తన కుమారుడు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనట్లు ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న ఆమె సంతోషం వ్యక్తంచేశారు. సీతారాం ఏచూరి తల్లి కల్పాకం కాకినాడ రామారావు పేటలోని ఏచూరి టవర్స్‌లో నివసిస్తున్నారు. తన కుమారుడు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తల్లిగా తాను ఆకాంక్షిస్తున్నట్లు కల్పాకం చెప్పారు.

No comments:

Post a Comment