హైదరాబాద్: కిరికిరి బాబు - కేసీఆర్ | |
|
- తన పని తాను చేసుకోడు.. పొద్దున లేస్తే పుల్లలు పెడతాడు
- ఛీ పొమ్మన్నా ఇక్కడే ఉంటాడట.. అక్కడ అన్నీ మోసాలు, గోల్‌మాల్..
- ఏపీ సీఎంపై కేసీఆర్ ధ్వజం.. ‘ఆవిర్భావ’ సభలో ప్రసంగం
- నా స్వప్నం, నా లక్ష్యం బంగారు తెలంగాణ.. సంక్షేమంలో దేశంలోనే టాప్..
- చెరువుల నుంచి తీస్తున్నది వలస ముష్కరుల పాపం
- ఏ గల్లీలోనైనా చర్చకు సిద్ధం.. నల్లా నీటితో పాదాలు కడుగుతా..
- రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు.. కాంట్రాక్టు రెగ్యులరైజ్ తథ్యం
- ఉద్యోగుల విభజనే అడ్డంకి.. వచ్చే మార్చి నుంచి పట్టపగలే సాగుకు కరెంటు..
- వచ్చే నెల నుంచి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ..
- మా విజయం ప్రజలకే అంకితం.. గులాబీ దళపతి ఉద్ఘాటన..
భారీ స్థాయిలో జరిగిన టీఆర్‌ఎస్ 14వ వార్షికోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ‘తల తెగి పడినా... మాట నిలబెట్టుకుంటాం’ అని పునరుద్ఘాటించారు. అదే సమయంలో... డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కేజీ టు పీజీ విద్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల భర్తీ వంటి కీలక హామీలు అమలు కాకపోవడంపై ‘వివరణ’ ఇచ్చుకునేలా మాట్లాడారు. అన్నీ చేసి తీరుతామని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన టీడీపీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ... ‘ఛీ పొమ్మన్నా ఇక్కడే ఉంటాడట!’ అని కేసీఆర్ ఈసడించుకున్నారు. ఏపీలో అన్నీ మోసాలు, గోల్‌మాల్ అని విమర్శించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు పేరెత్తకుండా... ‘కిరికిరి నాయుడు’ అంటూ ధ్వజమెత్తారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్ 14వ వార్షికోత్సవ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. భారీ స్థాయిలో తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం, అవసరం, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరిస్తూ... మధ్యలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన పేరు ప్రస్తావించకుండా విరుచుకుపడ్డారు.
ఏపీలో టీడీపీ పాలనను, తమ పాలనతో పోల్చుతూ... అక్కడ అన్నీ మోసాలే అని కేసీఆర్ విమర్శించారు. ‘‘మనకో కిరికిరి నాయుడు ఉన్నాడు. ఆయన పక్క రాష్ట్రం సీఎం.. ఛీ పో అన్న పోడట. ఆయనకు రాష్ట్రం, రాజ్యముంది. చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఆయనపని ఆయన చేసుకోవచ్చు కదా! పొద్దున లేవగానే పుల్లలు పెడుతున్నాడు. చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చే తెలివి ఆయనకు లేదు. డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. సగం మందికి కూడా చేయలేదు.
ఇక్కడ మాత్రం 17వేల కోట్లతో 34 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. మేం మాట ఇస్తే... ఇస్తే తలతెగినా సరే మాటమీద నిలబడతాం. కానీ... పక్కరాష్ట్రంలో అన్నీ మోసాలే. అంతా గోల్‌మాల్. మొన్న మహబూబ్‌నగర్‌కు వచ్చి కేసీఆర్ ను నిద్రపోనియ్యను అన్నాడు. అక్కడ దిక్కులేదుకానీ, ఇక్కడ నీళ్లు, కరెంటు ఇస్తానంటున్నాడు. కన్నతల్లికి అన్నంపెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది ఆయన తీరు’’ అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘అక్కడ పోయి చావుపో... ఇక్కడేముందని!’ అని విమర్శించారు. టీఆర్‌ఎస్ బహిరంగ సభలో బఠాణీలు అమ్ముకునేందుకు వచ్చినంత మంది కూడా టీడీపీ మహబూబ్‌నగర్‌కు సభకు రాలేదని... ఆ మాత్రానికే ఆహా ఓహో అంటున్నారని అన్నారు. ‘‘మూడు, నాలుగు పెంపుడు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అయినా సరే... గాడిదలు ఉంటేనే గుర్రాల విలువ తెలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
మన డబ్బులు మనకే...
సంక్షేమ రంగానికి అత్యధికంగా డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది అగ్రస్థానమని కేసీఆర్ తెలిపారు. ‘‘పెన్షన్లు, హాస్టళ్లకు సన్న బియ్యం, అంగన్‌వాడీలకు జీతాలు, గుడ్లు-పాలు... ఇలా సంక్షేమం కోసం 28వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అవాకులు చెవాకులు, అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకులారా... దీనిపై ఏ గల్లీలోనైనా చర్చకు సిద్ధం!’’ అని కేసీఆర్ సవాలు విసిరారు. ‘‘ఇంతడబ్బు ఎక్కడిదని ఇప్పుడు ఊళ్లలో చర్చ జరుగుతోంది.
నేనేమీ పక్క నుంచి పైసలు తీసుకురాలేదు. మన డబ్బులు ఆంధ్రాకు పోతున్నాయని, తెలంగాణ వస్తే అదంతా ఇక్కడే ఖర్చుపెడతామని ఉద్యమ సమయంలో చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది’’ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పని, ఎవరూ అడగని సంక్షేమ పథకాలు కూడా తాము అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, బీడీ కార్మికులకు పెన్షన్ల వంటి పథకాలను ప్రస్తావించారు. ‘‘వెళ్లగొట్టిన అత్తను కోడలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటోంది. ఎందుకుకంటే పించన్ పైసలొస్తాయని’’ అని చమత్కరించారు.
ఇదిగో ఆంధ్రోళ్ల మాయ... ప్రాజెక్టుల పేరిట సమైక్య సర్కారులో తెలంగాణకు మోసం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘‘ప్రాజెక్టు అనగానే అంతర్రాష్ట్ర వివాదం తేవాలి. ఇది ఆంధ్రోళ్ల మాయ. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఎస్‌ఎల్‌బీసీ పథకం. ఆ సొరంగం ఎన్నేళ్లు పడుతుందో చూడండి. వాళ్లు ప్రాజెక్టు పేరు చెప్పడం, మన తెలంగాణ సన్నాసులు చప్పట్లు కొట్టడం. ఇప్పుడు అది జరగదు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. ప్రాజెక్టుల అమలు జరుగుతుంది’’ అని కేసీఆర్ తెలిపారు. ‘గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి. పచ్చని మాగాళ్లలో పసిడి పంటలు పండాలి’ అని గతంలో తాను పాట రాశానని కేసీఆర్ గుర్తు చేశారు.
దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ... ఉత్తర తెలంగాణలో కామారెడ్డి నుంచి స్టేషన్ ఘన్‌పూర్ వరకు కరువుకు సాక్ష్యాలుగా ఉన్నాయని... ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్ తెలిపారు. ‘‘ప్రాజెక్టుల దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని తెలంగాణను అభివృద్ధి చేస్తా! ఎవరు అడ్డొస్తాడో చూస్తా. పాలమూరు పచ్చబడాలి. రాబోయే కొద్దిరోజుల్లోనే పాలమూరు ఎత్తి పోతల ద్వారా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా. పెన్‌గంగ ప్రాజెక్టు పూర్తి కావాలి. లెండి కాల్వలు పూర్తి కావాలి.
నల్లగొండ జిల్లాలో నక్కలగండిని నిర్మిస్తాం. ప్రాజెక్టుల అమలు జరుగుతుంది. కడుపు నిండా నీళ్లు వస్తాయి. ఇవన్నీ జరిగేదాకా ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించను’’ అని తెలిపారు. ఇదే సందర్భంగా... ‘హరీశ్ చాకులాగా పని చేస్తున్నాడు’ అని ప్రశంసించారు. ‘‘చెరువుల్లో పూడుకుపోయింది మట్టి కాదు... వలసపాలకుల పాపాలు. సమైక్య పాలనలో, వలస ముష్కరుల పాలనలో తెలంగాణ గుండెల మీద పేరుకుపోయిన పాపం! దానిని ఎత్తేస్తున్నాం’’ అని ప్రకటించారు. మిషన్ కాకతీయపై మంత్రి హరీష్‌రావు బ్రహ్మాండంగా పని చేస్తున్నారన్నారు. ‘‘తెలంగాణలో ప్రస్తుతం ఒక జోకు వినిపిస్తోంది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చెరువులకాడికి పోతే కచ్చితంగా దొరుకుతారని ప్రజలు నవ్వుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెరువుల్లోని మట్టిని తట్టలతో ఎత్తిపోస్తున్నారు’’ అని కేసీఆర్ తెలిపారు.
‘‘కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్లు ఉండేది, ఇప్పుడు చప్పబడింది అని కొందరు అన్నారు. అప్పుడు చెప్పాల్సిన సమయం. ఇప్పుడు తేల్చాల్సిన సమయం. ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు, చేతలు! బంగారు తెలంగాణ అంటే తెలంగాణలో 80 శాతం ఉన్న బీసీలు, మైనార్టీలు, దళితులు... ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డ ముఖం బంగారు నాణెంలాగా వెలగాలి. అప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్లు. నా లక్ష్యం, నా టీమ్ లక్ష్యం ఇదొక్కటే’’ అని కేసీఆర్ ఉద్ఘాటించారు.
చెప్పింది తూచా తప్పకుండా చేస్తాం... ‘‘ఎన్నికల్లో ఓట్లకోసం ఆకాశంలో జాబిల్లిని చూపించి, తర్వాత చౌకబారుగా మాటలు ఫిరాయించే చాలా పార్టీలను చూశాం. కానీ... టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ఏం చెప్పిందో దానిని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు. ‘‘అనుకుంటే చేసి తీరుతాను. నేను మోచేతికి బెల్లంపెట్టి అరచేతిని నాకమని చెప్పే రకం కాదు’’ అని అన్నారు. ‘‘టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించాయి.
కరెంటు సరఫరా చేసే మూడు తీగల్లో మొదటి దానికి టీడీపీ, రెండో దానికి కాంగ్రెస్, మూడోదానికి సీపీఐ, సీపీఎం జెండాలు కట్టమని ఆ పార్టీలు అడిగితే... ప్రజలు మూడు తీగలకు టీఆర్‌ఎస్ జెండాలు కట్టి అఖండ మెజార్టీతో గెలిపించారు. అందుకే 24 గంటలు కరెంటు సరఫరా అవుతోంది. వచ్చే మార్చి నుంచి రైతులకు తల తాకట్టుపెట్టైనా పొద్దటిపూట కరెంటు ఇస్తాం’’ అని కేసీఆర్ ప్రకటించారు.
నీళ్లివ్వకపోతే ఓట్లు అడుగను... ‘‘మంచి నీళ్లు అమ్ముకునే కాలం వస్తుందని పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడే అదే జరుగుతోంది. పల్లెల్లో అక్క చెల్లెళ్లు నీళ్ల కోసం కిలోమీటర్లు పోతున్నారు. ఊరూరికీ నీళ్ల సీసాల మిషిన్లు వచ్చాయి. వాటర్ గ్రిడ్‌తో పల్లెకు, తాండాకు, గూడేనికి, ప్రతి బస్తీకి ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా పెట్టించి నీళ్లు ఇస్తాం. ఆ నీళ్లతో మీ పాదాలు కడుగుతా!’’ అని కేసీఆర్ ప్రకటించారు.
ఇది చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రకటించామని పునరుద్ఘాటించారు. ‘‘ఇంత మంది నేతల భవిష్యత్తును పణంగా పెట్టి, మొండిపట్టు పట్టాల్సిందేనని చెప్పాను’’ అని తెలిపారు. ‘‘నాకు ఒకటే లక్ష్యం తెలంగాణ తేవాలని. అది తెచ్చాను. నన్ను ముఖ్యమంత్రిని చేశారు. వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి. రైతులు, యువత, అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. బంగారు తెలంగాణ సాధించేవరకు విశ్రమించను. 24 గంటలు పనిచేస్తా!’ అని కేసీఆర్ తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీటు పీజీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగాల భర్తీ... వంటి హామీల అమలు కాకపోవడం గురించి కేసీఆర్ ప్రస్తావించారు. అందుకు కారణాలూ వివరించారు. ‘గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాల కారణంగా ఏమిచేయాలో అర్థం కావటం లేదు’ అని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం వచ్చే నెల నుంచే (మే నెల) ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇక... ‘‘కాంట్రాక్టు ఉద్యోగులంతా క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. వారినీ రెగ్యులరైజ్ చేస్తాం. ఆ ఆదేశాలు జారీ అవుతాయి. రెండేళ్లలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఒక్క జెన్‌కోలోనే 25 వేల ఉద్యోగాలు వస్తాయి’’ అని తెలిపారు.
కమలనాథన్ కమిటీ ఆలస్యం కారణంగానే నియామకాల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. ‘కేజీ టు పీజీ’ విద్యను వచ్చే సంవత్సరం నుంచి వందశాతం అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మనకు కడియం శ్రీహరి ఉత్తమమైన వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నరు. గతంలో లెక్చరర్‌గా పనిచేశారు’’ అని కేసీఆర్ తెలిపారు. ప్రసంగం చివర్లో కేసీఆర్ ‘‘హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. రానున్న మూడున్నరేళ్లలో అమెరికాలోని డల్లాస్‌లా, జపాన్, సింగపూర్‌ను తలదన్నేలా మార్చి మీకు బహుమతిలా ఇస్తాను. కేసీఆర్ మాట ఇస్తే తప్పడు. మీరు మా వెంట నడవండి’’ అని గ్రేటర్ ప్రజలను కోరారు. ప్రసంగం ప్రారంభంలోనే... నేపాల్ భూకంప మృతులకు తెలంగాణ తరఫున కేసీఆర్ నివాళి అర్పించారు.
|
|
No comments:
Post a Comment