Tuesday, 7 April 2015

‘పట్టిసీమ’ను కేంద్రం అనుమతించదు

‘పట్టిసీమ’ను కేంద్రం అనుమతించదు

వరి రైతుల సదస్సులో కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి
అమలాపురం, ఏప్రిల్‌ 7: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాయలసీమకు నీరు తరలించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించి ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తోందన్నారు. సీమలో ఉన్న హంద్రీనీవా, గాలేరు.. వంటి పెండింగు ప్రాజెక్టులకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిధులను మళ్లిస్తే ఆ ప్రాంతప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరతాయన్నారు. సమస్యల సాధన కోసం రైతులంతా సం ఘటితమై రోడ్డెక్కితే ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి వరి రైతుల సదస్సులో పురందేశ్వరి మాట్లాడారు. క్వింటాలు ధాన్యానికి రూ.2 వేలకు తగ్గకుండా మద్దతు ధర ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానన్నారు. సదస్సుకు బీకేఎస్‌ జాతీయ వరి రైతుల సంఘం అధ్యక్షుడు జలగం కుమారస్వామి అధ్యక్షత వహించారు. రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేవరకు ప్రభుత్వాలపై పోరాటానికి రైతులు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా చట్టాలు చేస్తున్నారన్నారు. ఈ సదస్సులో పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు, రాష్ట్ర రైతు సమాఖ్య నాయకుడు యెర్నేని నాగేంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 12 తీర్మానాలను ఆమోదించారు.

No comments:

Post a Comment