Wednesday, 8 April 2015

మీడియా ప్రెస్టిట్యూట్స్‌ - కేంద్ర మంత్రి వీకే సింగ్‌

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీకే సింగ్‌
మీడియాను ప్రాస్టిట్యూట్‌తో పోలుస్తూ ట్వీట్‌లు
మండిపడ్డ విపక్షాలు.. నోరుమెదపని బీజేపీ నేతలు

న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 08: కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీడియాకు వ్యభిచారానికి’’ లంకె పెడుతూ తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సర్వత్రా తీవ్ర దుమారం రేపుతున్నాయి. వీకే సింగ్‌ మీడియానుద్దేశిస్తూ ప్రాస్టిట్యూట్‌ అనే అర్థం ధ్వనించేలా ప్రెస్టిట్యూట్స్‌ అని సంబోధించారు. ప్రెస్టిట్యూట్ల నుంచి ఎక్కువ ఆశించలేమంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా యెమెన్‌లో చిక్కుకున్న వారిని స్వదేశం తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ‘రహత్‌’పై ఆయన పెదవి విరిచారు. అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడం కంటే పాకిస్థాన హై కమిషన్‌ను సందర్శించడం ఎక్కువ ఉత్కంఠనిస్తుందని వ్యాఖ్యానించారు. జిబౌతి వెళ్లి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పెను దుమారం లేపింది. యెమెన్‌ సహాయక చర్యలపై వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలోనే ఆయన మీడియాపై విమర్శలు చేశారు. వీకే సింగ్‌ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ఆయన సంకుచిత ఆలోచనా విధానాలకు ఆ వ్యాఖ్యలు దర్పణం పడుతున్నాయని కాంగ్రెస్‌ విమర్శించింది.  బీజేపీ మాత్రం వీకే సింగ్‌ వ్యాఖ్యలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆయన వ్యాఖ్యలపై బహిరంగంగా మాట్లాడేందుకు పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు.

వీకే సింగ్‌ ఇటీవలి కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మోదీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. కొద్దిరోజుల క్రితం పాక్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ రాయబారి ఇచ్చిన విందుకు ప్రభుత్వం తరఫున వీకే సింగ్‌ హాజరైన విషయం తెలిసిందే. అయితే తాను బాధ్యతతో ఆ కార్యక్రమానికి వెళ్లాను తప్ప ఆనందంతో కాదని విందు అనంతరం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించడం పెనుదుమారం లేపింది. వేర్పాటువాదులతో కలిసి విందు చేయడం ఇష్టంలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేశానని తరువాత వివరణ ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు, మీడియా తూర్పారబట్టాయి. ఇప్పుడు మళ్లీ ఆయన మీడియాపై కామెంట్లు చేసి వివాదాల తుట్టె కదిపారు.

No comments:

Post a Comment