Wednesday, 15 April 2015

చైనాతో బలపడిన వాణిజ్య బంధం.. ఒకేరోజు 11 ఒప్పందాలపై సంతకాలు

చైనాతో బలపడిన వాణిజ్య బంధం.. ఒకేరోజు 11 ఒప్పందాలపై సంతకాలు

వేల కోట్ల పెట్టుబడులు.. ఉపాధి అవకాశాలు
భారత భవిష్యత్తు వ్యాపార భాగస్వామి చైనా
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌, చైనా వ్యాపార బంధం మరింత బలపడింది. వర్తక వాణిజ్యాల్లో రెండింటి మధ్య సువర్ణాధ్యాయం మొదలైంది. చైనా నుంచి నవ్యాంధ్రకు పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి! ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా మంగళవారం ఏకంగా 11 ఒప్పందాలపై ఇటు నవ్యాంధ్ర, అటు చైనా అధికారులు సంతకాలు చేశారు. వీటిలో ఆరు ఒప్పందాలు ప్రభుత్వ-బిజినెస్‌ ఎంవోయూలు కాగా ఐదు ఒప్పందాలు బిజినెస్‌-బిజినెస్‌ ఎంవోయూలు. వీటి కారణంగా నవ్యాంధ్రకు వేల కోట్ల పెట్టుబడులతోపాటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలూ లభించనున్నాయి. బీజింగ్‌లో మంగళవారం వివిధ కంపెనీలు, పారిశ్రామిక ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు, ఏపీ అధికారులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఒప్పందాలపై కంపెనీల ప్రతినిధులు, ఏపీ అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తులో భారత్‌ వ్యాపార భాగస్వామి చైనాయేనని చెప్పారు. భవిష్యత్‌లో యావత్‌ ప్రపంచం దృష్టి చైనా, భారత్‌పైనే ఉంటుందని, అనతి కాలంలోనే ఈ రెండు దేశాలూ అమెరికాకు దీటుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. చైనా మార్కెట్ల కోసం అన్వేషిస్తోన్న దేశం. అందుకే, చైనా నుంచి 20 బిలియన్‌ డాలర్ల (రూ.1.20 లక్షల కోట్లు) పెట్టుబడులు భారత్‌కు వస్తాయని ఆశిస్తున్నాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశ సముద్ర తీరంలో 13 శాతం వాటా (974 కిలోమీటర్లు) ఏపీదేనని, జపాన్‌, కొరియా, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాలు, షంజన్‌, షాంఘై తదితర నగరాలు ఏపీ తీరంవైపే చూస్తున్నాయని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని జల వనరులు ఏపీకి ఉన్నాయని, అందుకే చైనా తరహాలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇన్నోవేషన్‌, స్టార్టప్‌, ఎలకా్ట్రనిక్‌, ఐటీ పాలసీలను తెచ్చామని, కార్మిక సంస్కరణలను రూపొందించామని, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులపై దృష్టి సారించామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోందని, వాటికి అదనంగా తరుగు రాయితీ కింద 15 శాతం, మూలధన పెట్టుబడి రాయితీ కింద 15 శాతం, గ్రీన్‌ మెజర్స్‌కు 25 శాతం ప్రోత్సాహకాలను ఇస్తున్నామని వివరించారు. శాంతి భద్రతలకు ఏపీ నెలవని, సమ్మెలు ఉండవని చెప్పారు. రాజధాని నిర్మాణానికి తాము కోరిన వెంటనే 45 రోజుల్లోనే 45 వేల ఎకరాలను రైతులు ఇచ్చారని, జూన్‌నాటికి మాస్టర్‌ ప్లాన్లు పూర్తవుతాయని, ఆ తర్వాత మాస్టర్‌ డెవలపర్లను ఎంపిక చేస్తామని తెలిపారు. ఏపీలో వర్తక, వాణిజ్యాభివృద్ధికి ఇదే సరైన తరుణమని, ఈ అవకాశాన్ని వృథా చేసుకోవద్దంటూ చైనా కంపెనీలకు ఆహ్వానం పలికారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై త్వరలోనే ప్రత్యేక విధానం తీసుకొస్తామని, టౌన్‌షిప్‌లకు ప్రత్యేక పాలసీని రూపొందించాల్సి ఉందని చెప్పారు. విద్యుత్తు, సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లకు కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా టారిఫ్‌ను నిర్ణయిస్తున్నామని చెప్పారు. భారత్‌లో 1947-91 మధ్య స్థిరమైన ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి జరగలేదని, 1991-2004 మధ్య సంకీర్ణ సర్కారులు ఉన్నా సంస్కరణలు చేపట్టాయని, 2004-14 మధ్య అభివృద్ధి అడుగంటిందని, ఇప్పుడు మోదీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం, జనాభా వైవిధ్యం, యువతరం శక్తిసామర్థ్యాలు భారత్‌ సానుకూల అంశాలని వివరించారు.

No comments:

Post a Comment