గంటాకు అయ్యన్న ఝలక్!?
Sakshi | Updated: April 29, 2015 02:22 (IST)
ఆడారికి చెక్ పెట్టనున్న ప్రభుత్వం!
సర్కారు చేతికి డెయిరీ పగ్గాలు ?
ఆధిపత్యం సాధిస్తున్న అయ్యన్న
విశాఖపట్నం: ఆధిపత్య పోరులో మంత్రి గంటాపై సహచర మంత్రి అయ్యన్న వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తున్నారు. గంటాను నేరుగా లక్ష్యంగా చేసుకోకుండా ఆయన అనుచరవర్గాన్ని ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారుకు టీటీడీ పాలకమండలి పదవి రాకుండా అయ్యన్న చక్రం తిప్పారు. మరో ప్రధాన అనుచరుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావును తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు. ఆడారి అడ్డా అయిన విశాఖ డెయిరీ వ్యవహారాలను నేరుగా ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా అయ్యన్న పావులు కదుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరులో అయ్యన్న స్పష్టమైన ఆధిక్యత సాధించారనడానికి
నిదర్శనంగా నిలుస్తున్న తాజా ఉదంతాలివిగో...
తదుపరి లక్ష్యం ఆడారి!: గంటాకు ప్రధాన మద్దతుదారైన విశాఖడెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుపై అయ్యన్న గురిపెట్టారు. 27ఏళ్లుగా ఆయన ఆధిపత్యంలో ఉన్న విశాఖ డెయిరీపై దృష్టిసారించారు. అయ్యన్న ప్రధాన మద్దతుదారుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి జిల్లా కొన్ని రోజుల క్రితం బహిరంగంగానే తులసీరావు అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. విశాఖ డెయిరీని అడ్డంపెట్టుకుని రూ.500కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆడారిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాక్ట్-64 ప్రకారం ఈ డెయిరీని స్థాపిస్తే డెరైక్టర్లకు ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడానికి సంస్థను యాక్ట్- 95 యాక్ట్ కిందకు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. తాజాగా కంపెనీ యాక్టు-55ని వర్తింపజేస్తూ నిబంధనలు మార్చడాన్ని కూడా గవిరెడ్డి ప్రశ్నించారు. డెయిరీలో అక్రమాల చిట్టాను రూపొందించి గవిరెడ్డి సీఎంచంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమచారం. డెయిరీ వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే అంశాన్ని సీఎం కార్యాలయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక అధికారిని నియమించి డెయిరీ పాలనావ్యవహారాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. అదే జరిగితే జిల్లాలో గంటా వర్గాన్ని అయ్యన్న పూర్తిగా దెబ్బతీసినట్లే అవుతుంది.
బండారుకు చుక్కెదురు
గంటా వర్గంలో కీలక నేత, ఎమ్మెల్యే బండారు సత్యాన్నారాయణమూర్తిని మంత్రి అయ్యన్న అదను చూసి దెబ్బకొట్టారు. తనకు మంత్రి పదవి రాకుండా సైంధవ పాత్ర పోషించడానికి బండారును మంత్రి గంటా ప్రయోగించిన విషయాన్ని అయ్యన్న ఇంకా మరచిపోలేదు. సమయం కోసం వేచి చూసిన ఆయన టీటీడీ పాలకమండలి నియామక సమయంలో తన అస్త్రాన్ని ప్రయోగించారు. పాలకమండలిలో బండారుకు స్థానం కల్పించాలన్న గంటా వర్గం విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు మొదట సానుకూలంగా స్పందించారు. రెండువారాల క్రితం బండారును నియమాకం దాదాపు ఖాయమైందని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయ్యన్న వ్యూహాత్మకంగా వ్యవహరించి బండారు అవకాశాలను దెబ్బకొట్టారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ద్వారా పావులు కదిపినట్లు తెలుస్తోంది. బండారు సామాజికవర్గానికే చెందిన ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును తెరపైకి తెచ్చారు. ఉత్తరాంధ్రకే చెందిన వెలమ సామాజికవర్గం నుంచి లలిత కుమారికి స్థానం ఇవ్వడంతో అదే వర్గానికి చెందిన బండారుకు దారులు మూసుకుపోయాయి.
No comments:
Post a Comment