Wednesday, 15 April 2015

చైనాతో 11 ఒప్పందాలు ఖరారు

చైనాతో 11 ఒప్పందాలు ఖరారు

Sakshi | Updated: April 15, 2015 09:21 (IST)
చైనాతో 11 ఒప్పందాలు ఖరారువీడియోకి క్లిక్ చేయండి
ఏపీలో సమ్మెలుండవని, శాంతిభద్రతలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు
సాక్షి,హైదరాబాద్: చైనా ప్రభుత్వంతోపాటు అక్కడి పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య మంగళవారం చైనా రాజధాని బీజింగ్‌లో 11 ఒప్పందాలు కుదిరాయి. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మంగళవారం ఈ ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ప్రభుత్వ వ్యాపార విభాగంలో 6, బిజినెస్ టు బిజినెస్ విభాగంలో 5 ఒప్పందాలు ఉన్నాయి.

ఏపీ పరిశ్రమల శాఖతో చైనా ఎస్‌ఎంఈ చైర్మన్, కేమెల్ గ్రూప్, చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, సినోమా, ఎస్‌హెచ్‌ఎల్ లిమిటెడ్‌లు ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి, సీసీపీఐటీ కన్‌స్ట్రక్షన్ వింగ్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. బిజినెస్ టు బిజినెస్ విభాగంలో సీసీసీటీ ఆఫ్ చైనా, బ్రాండెక్స్ ఆఫ్ ఇండియా, సీసీఐటీ టెక్స్‌టైల్ విభాగం కార్యదర్శి - బ్రాండెక్స్, చైనీస్ అసోసియేషన్ ఆఫ్ నిట్టింగ్ ఇండస్రీ ్ట- బ్రాండిక్స్, ట్రాన్స్‌స్ట్రాయ్ ఆఫ్ ఇండియా-న్యూ ఎరా గ్రూప్ ఆఫ్ చైనా మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

చైనా అతిపెద్ద భాగస్వామి: చంద్రబాబు
అంతకుముందు బీజింగ్‌లో వివిధ కంపెనీలు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో భారత్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా అని చెప్పారు. చైనా నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌కు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో సమ్మెలుండవని, శాంతిభద్రతలుంటాయని ఆయన అన్నారు. త్వరలో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక విధానం తెస్తామని చంద్రబాబు చెప్పారు. పారిశ్రామిక పార్కులు, టౌన్‌షిప్‌లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలన్నారు. ఏపీలో వర్తక వాణిజ్యాభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, ఇతర దేశాలకన్నా భారత్‌లో ఎక్కువ లాభాలు పొందొచ్చని చెప్పారు.

చైనా హార్బర్ ఇంజనీరింగ్‌తో ఒప్పందం
చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ, సోమా కంపెనీల మధ్య బిజినెస్ టు బిజినెస్ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ పెట్టుబడుల విభాగం జీఎం మైకేల్ బెర్న్, మార్కెటింగ్ విభాగం డిప్యూటీ జీఎం బింగ్ వెస్, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. డెంగ్ జియావో పింగ్‌పై తనకెంతో గౌరవమని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. సాంస్కృతిక సారూప్యత దృష్ట్యా ఏపీ కొత్త రాజధాని అమరావతిని రెండో సొంతింటిలా చైనీయులు భావించాలని ఆయన కోరారు.

పలువురితో బాబు భేటీ..
చంద్రబాబు మంగళవారం బీజింగ్‌లో ఇంటర్నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(ఐడీసీపీసీ) మినిస్టర్ వాంగ్ జైరుయితో సమావేశమయ్యారు. అంతకుముందు చంద్రబాబు బృందం గ్విజు ప్రావిన్సుకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. చైనా మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్టు కార్పొరేషన్ ప్రతినిధులతోనూ బాబు భేటీ అయ్యారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలసి పనిచేస్తామని ఆ సంస్థ ఎండీ డియో సెమింగ్ తెలిపారు. బ్యాటరీల తయారీలో అనుభవమున్న కేమెల్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఐదొందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తా: చంద్రబాబు
సాక్షి,హైదరాబాద్: ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలనేదే అంబేడ్కర్ ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇచ్చిన సందేశాన్ని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

No comments:

Post a Comment