Monday, 20 April 2015

సూటూ బూటోళ్ల సర్కారిది!

సూటూ బూటోళ్ల సర్కారిది!

  • ‘అచ్ఛేదిన్‌’ సర్కారుతో రైతు అసలుకే దివాలా
  • మోదీ.. ఇప్పటికైనా కార్పొరేట్లను వీడు
  • రైతుతో జతకట్టు.. మీరు బలపడకపోతే ఒట్టు
  • లేదంటే..మీ సర్కారుకు వారితోనే ముప్పు
  • పార్లమెంటులో ప్రధానిపై రాహుల్‌ విసుర్లు
  • రైతు సమస్యలే మాట్లాడతాం: సోనియా 
  • పార్టీ పగ్గాలు చేపట్టేదెప్పుడో రాహులే చెప్పాలి!
  • ‘శేష ప్రశ్నలకు’ సోనియా జవాబిది
సుదీర్ఘ సెలవు తర్వాత... తిరిగి వచ్చిన రాహుల్‌ గాంధీ పార్లమెంటులో చెలరేగిపోయారు. రైతు సమస్యలపై సోమవారం లోక్‌సభలో ప్రసంగించారు. మోదీ సర్కారు సూటుబూటోళ్లదేనని.. అచ్ఛేదిన్‌తో రైతులకు అసలుకే మోసమని ధ్వజమెత్తారు. కార్పొరేట్లతో దోస్తీతో ముప్పు తప్పదని బీజేపీని హెచ్చరించారు. 

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ‘‘ప్రధానికి నాదో సలహా. జనాభాలో రైతులు 67 శాతం. మీరు వారితో ఉంటే బలపడి తీరుతారు. కార్పొరేట్‌ పక్షపాతం వీడి.. రైతులవైపు మొగ్గి చూడండి. అప్పుడు మాకు హాని, మీకు లాభం తథ్యం. లేకపోతే వారు మీ సర్కారుకు హానికారకంగా మారతారు’’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. నరేంద్ర మోదీని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి రైతు బాధ, కష్టం అర్థం కావడం లేదని, ‘ఇది సూటుబూటు సర్కారు’ అని ఎద్దేవా చేశారు. ‘దేశంలో వ్యవసాయం-స్థితిగతుల’పై లోకసభలో స్వల్పకాల చర్చ సందర్భంగా సోమవారం ఆయన, అధికారపక్షం అభ్యంతరాలు, విపక్ష హర్షధ్వానాల మధ్య పదునైన ప్రసంగం చేశారు. మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు అంకితమైందని విమర్శించారు. ఈ ‘అచ్ఛేదిన్‌ ప్రభుత్వం’... సమస్యల్లో ఉన్న రైతాంగాన్ని మరింత దివాలా తీయిస్తూ దేశం వెన్ను విరుస్తున్నదని దుయ్యబట్టారు.
 
రైతులపై మోదీ వైఖరి చూస్తుంటే, ఆయనకు ఎన్నికల్లో గెలిచే విద్య మాత్రమే తెలుసునని పిస్తున్నదని ఎద్దేవా చేశారు. ‘‘రైతు భూములు మంచి ధర పలుకుతున్నాయి. దానివల్ల మీ (మోదీ) కార్పొరేట్‌ మిత్రుల కన్ను వాటిపై పడింది. వారి తరఫున మీరు (మోదీ) రైతులను శక్తిహీనం చేసేందుకే భూ ఆర్డినెన్స్‌ అనే గొడ్డలిని ప్రయోగిస్తున్నారు’’ అని మండిపడ్డారు. వ్యవసాయ ప్రగతి గురించి, రైతు సంక్షేమం గురించి ఎన్డీయేవి ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. ‘‘పది నెలల మోదీ పాలనలో సాగు వృద్ధి ఒక్కశాతం మాత్రమే, ఇంతకుముందు ఎన్డీయే హయాంలోనూ 2.6 శాతం మాత్రమే’’నని పెదవి విరిచారు. ‘‘పదేళ్ల యూపీఏ హయాంలో పంటలకు మద్దతు ధరను భారీగా పెంచితే అదే ఎన్డీయే సర్కారు కంటితుడుపుగా గోధుమపై రూ. 50, చెరుకుపై రూ.10 మాత్రమే పెంచింది’’ అని విమర్శించారు.
 
పంట నష్టాలపై ప్రభుత్వంలో ఉన్నవారు తలో మాట మాట్లాడుతున్నారన్న రాహుల్‌ వ్యాఖ్యలపై.. వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ స్పందించారు. రాష్ర్టాలు ఇస్తున్న పంట నష్టం అంచనాలను సవరిస్తూండటమే ఇందుకు కారణమన్నారు. అంతకుముందు.. పంటలకు మద్దతు ధరను నిర్దిష్టంగా ఖరారు చేయాలని వైసీపీ సభ్యుడు పీవీఎమ్‌ రెడ్డి సూచించారు. దేశంలో సాగును పెంచడానికి నిధులను మరింత ఖర్చుచేయాల్సి ఉందని టీఆర్‌ఎస్‌ సభ్యుడు ఏపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. కాగా, ఇకపై పార్లమెంటు వేదికగా రైతు సమస్యలను కాంగ్రెస్‌ చాటుతుందని, రాహుల్‌సహా ఎంపీలంతా ఇదే బాటను అనుసరిస్తారని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మీడియాకు తెలిపారు.

No comments:

Post a Comment