|
తెలంగాణలో మళ్లీ బలపడతాం.. నిలబడతామని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి పూర్వ వైభవం ఖాయమని పునరుద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం ఆయన పాలమూరులో పర్యటించారు. ర్యాలీలోనూ కార్యకర్తల విస్లృతస్థాయి సమావేశంలోనూ పాల్గొన్నారు. వలసలూ, దుష్ప్రచారాలూ తాత్కాలికమేనని భరోసా ఇచ్చారు. కాగా, టీడీపీ సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. తేనెటీగలతో దాడిచేసి సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించినా సభ విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు. నాయకుల వలసలు, పార్టీపై దుష్ప్రచారాలు చూపే ప్రభావం తాత్కాలికమే. తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధే మన బలం, మన విశ్వసనీయత. దానిని దెబ్బతీయడం ఎవరి తరం కాదు. దాని ఆధారంగానే టీడీపీ మళ్లీ బలపడుతుంది. మళ్లీ నిలబడుతుంది. పూర్వ వైభవం సాధిస్తుంది’’ అని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. మహబూబ్‌నగర్‌లోని జూనియర్ కాలేజీ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. పట్టణంలో సుమారు 3 గంటలపాటు సాగిన ర్యాలీ అనంతరం వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు, తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రతిమలకు నివాళులు అర్పించారు. ‘తెలంగాణలో తెలుగుదేశానికి ఉక్కులాంటి కార్యకర్తల బలం ఉంది. ఇంతటి క్రమశిక్షణ కలిగిన క్యాడర్ మరే పార్టీకీ లేదు. సామాజిక న్యాయం ఆచరించి చూపడం టీడీపీ బలం. మండుటెండలు, అకాల వర్షాలు పార్టీ శ్రేణుల్లోని ఉత్సాహాన్ని, ఉక్కు సంకల్పాన్ని నిరోధించలేకపోతున్నాయని ఈ సభ మరోసారి నిరూపించింది. తెలంగాణలో టీడీపీ నేతలు, కార్యకర్తలు గతంలో తీవ్రవాదుల దాడులను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నో అవమానాలు, అణిచివేతను, దుష్ప్రచారాలను ఎదుర్కొన్నారు. అయినా పార్టీ పట్ల అచంచల విశ్వాసం, నమ్మకంతో నిలబడ్డారు. ఇటువంటి పార్టీకి అధ్యక్షునిగా ఉండటం నా అదృష్టం’’ అని చంద్రబాబు భావోద్వేగంతో అన్నారు. తెలంగాణలో ప్రజలు, పార్టీ కార్యకర్తలకు తాను ఏ అన్యాయం జరగనీయనని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పార్టీని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలు పార్టీని కాపాడుకున్నారని, వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరి సంక్షేమాన్ని కుటుంబ పెద్దగా తాను చూసుకుంటానని, న్యాయపరంగా, చట్టపరంగా, ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కూడా కల్పించామని, అదే పద్ధతిలో ప్రసవ సమయంలో ఇబ్బంది పడే మహిళలకు ప్రత్యేక బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. మాదిగలకు న్యాయం చేసింది, చేయబోయేదీ టీడీపీనే అని ప్రకటించారు.
విభజన విషయంలో దుష్ప్రచారం
‘రాష్ట్ర విభజన అంశంలో టీడీపీపై కొన్ని శక్తులు దుష్ప్రచారం చేశాయి. నేను విభజనను వ్యతిరేకించలేదు. ఇప్పుడైనా విభజన చట్టంలో ఎలా ఉంటే అలా పాటించడానికి నేను సిద్ధం. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలన్నదే నా విధానం. అవసరమైతే కేంద్రం మధ్యవర్తిత్వం తీసుకొని సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా దానికి సహకరిస్తాం. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా సహకరిస్తాను. రెండు తెలుగు రాషా్ట్రలు పరస్పరం పోటీపడి అభివృద్ధి కావాలన్నదే నా ధ్యేయం. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరాలతోపాటు తెలంగాణ సమస్యల గురించి కూడా చెప్పి వాటిని పరిష్కరించాలని కోరుతున్నాను’’ అని చంద్రబాబు చెప్పారు. భౌగోళికంగా విడిపోయినా రెండు రాషా్ట్రల్లోని తెలుగువారు మానసికంగా కలిసి ఉండాలన్నదే తన కోరికని, అలా కలిపి ఉంచే శక్తి ఒక్క తమ పార్టీకే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి చేసిన ప్రయత్నం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల అభివృద్ధికి దోహదపడింది. మహబూబ్‌నగర్‌ను నేను దత్తత తీసుకొని అభివృద్ధిలో ముందడుగు వేయడానికి కృషి చేశాను. అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాను. టీడీపీకంటే మిన్నగా ఎవరైనా తెలంగాణను అభివృద్ధి చేశారేమో చెప్పాలని బహిరంగ చర్చకు సవాల్ విసిరితే ఎవరూ రాలేకపోయారు. ఇప్పుడు దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న రాషా్ట్రల్లో తెలంగాణ ఒకటిగా ఉండడం హైదరాబాద్ ఆదాయం వల్ల సాధ్యపడింది. ఇంత ఆదాయం టీడీపీ వల్లే వచ్చింది. దానిని ఎవరైనా కాదనగలరా?’’ అని బాబు ప్రశ్నించారు.
ఖాళీ చేయడానికి మందు సీసా కాదు!
‘అసెంబ్లీలో ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే కళ్లలోకి చూడలేని దౌర్భాగ్య సీఎం కేసీఆర్’ అని టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి సీఎం రాషా్ట్రన్ని బంగారు తెలంగాణగా మారుస్తానంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో టీడీపీని ఖాళీ చేస్తామని కేసీఆర్ అంటున్నారు. ఖాళీ చేయడానికి టీడీపీ మందు సీసా కాదు. ఇంతకు ముందు ఇలాగే ప్రగల్బాలు పలికిన వైఎస్ పావురాల గుట్టలో పావురమై పోయారు. టీడీపీని కేసీఆర్ తాత, ముత్తాతలు దిగివచ్చినా కదలించలేరు’’ అని రేవంత్ తేల్చి చెప్పారు. 1200 మంది అమరుల బలిదానాలతో తెలంగాణ వస్తే, కేవలం 480 మందిని మాత్రమే గుర్తించి అమర వీరులను ప్రభుత్వం అవమానిస్తోందని రేవంత్ ఆరోపించారు. సమగ్ర సర్వేలో 24 గంటల్లో నాలుగు కోట్లమంది వివరాలు సేకరించానని జబ్బలు చరుచుకునే కేసీఆర్... తెలంగాణ అమర వీరుల వివరాలు ఎందుకు సేకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
మండుటెండలో ‘మహ’ సక్సెస్!
మండుటెండలో... మహబూబ్‌నగర్‌లో జరిగిన తెలుగుదేశం విస్తృత స్థాయి సభ విజయవంతమైంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తొలిసారిగా దక్షిణ తెలంగాణలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. వరంగల్, కరీంనగర్ పర్యటనలకు మించి మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీకి పునరుత్తేజం తేవటం కోసం చంద్రబాబు కొంత కాలంగా తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గురువారం మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సమావేశం ఏర్పాటు చేశారు. షామియానాల కింద స్థలం సరిపోక, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎర్రటి ఎండలో చంద్రబాబు రాక కోసం ఎదురు చూశారు. జిల్లా సరిహద్దుల నుంచి మహబూబ్‌నగర్ పట్టణం వరకు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో పలు చోట్ల స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు స్వాగతం పలికారు. మహబూబ్‌నగర్‌లో ఊరేగింపుగా చంద్రబాబును సభా ప్రాంగణం వద్దకు తీసుకెళ్లారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 40 వేల మందికి భోజనం పెట్టారంటూ చంద్రబాబు కార్యకర్తలందరితో చప్పట్లు కొట్టించారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ఇదే సమావేశ వేదికపై ప్రసంగించిన ఇతర నాయకులు తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కారును విమర్శించారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళన సమయంలో చంద్రబాబు చలించకుండా ప్రసంగించారు.
4 రాష్ట్రాల్లో పోటీ!: చంద్రబాబు
రాష్ట్ర విభజన తర్వాత పోయిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేసిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో నాలుగైదు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 60 నుంచి 70 వరకూ పార్లమెంట్ సీట్లకు పోటీ చేసే ఆలోచన ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు...
|
No comments:
Post a Comment