Sunday, 19 April 2015

బంగారు తెలంగాణను ముద్దాడేదాకా..కాళ్లకు గజ్జె విడవొద్దు!

బంగారు తెలంగాణను ముద్దాడేదాకా..కాళ్లకు గజ్జె విడవొద్దు!

  • కేబినెట్‌ కన్నా కళాకారులే మిన్న
  • ప్రజల్లో చైతన్యం మీ పని...
  • మీ బాగోగులు సర్కారు పని
  • కుటుంబాలకు హెల్త్‌ కార్డులిస్తాం
  • తిరగడానికి వాహనాలు, 
  • రాసి పాడటానికి డాబ్‌బంగ్లా, చాంబర్లు
  • సాంస్కృతిక సారథులకు కేసీఆర్‌ హామీ
  • అప్పటికప్పుడే ఆదేశాలు జారీ
  • సారథి భవనానికి మిద్దె రాములు పేరు
 
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : బంగారు తెలంగాణను ముద్దాడేవరకు కాళ్లకు కట్టిన గజ్జెలను విడవొద్దని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు...కళాకారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కళారూపాలతో పెంచిపోషించినవిధంగానే నూతన రాష్ట్రంలోని దారిద్ర్యాన్ని తరిమికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ‘కళాకారులు నా బిడ్డలు’ అని భావోద్వేగంతో అన్నారు. ఆదివారం మాదాపూర్‌ ఆర్ట్‌గ్యాలరీలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ అధ్యక్షతన కళాకారుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రాంగణానికి దివంగత కళాకారుడు మిద్దెరాములు కళాభవనంగా నామకరణం చేశారు. ఆర్ట్‌గ్యాలరీకి మరో కళాకారుడు వరంగల్‌ శంకరన్నపేరు పెడతామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో కేబినెట్‌ మంత్రుల పాత్రకంటే సాంస్కృతిక సారథుల పాత్రే కీలకమని కొనియాడారు. రాష్ట్రంలో కళాకారులకు ఎలాంటి బాధలు ఉండవని చెప్పారు. వారికి ప్రభుత్వ ఉద్యోగమే కాదు, వారి కుటుంబాలకు హెల్త్‌కార్డులు కూడా అందిస్తామని ప్రకటించారు. ‘సారథి’ కళాకారులకు అవసరమైన వాహనాలు, డాబ్‌ బంగ్లాల్లో బస, ప్రత్యేక చాంబర్‌, రికార్డింగ్‌ స్టూడియో సమకూర్చాలని..అక్కడికక్కడే ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, సాంస్కృతిక సంచాలకులు హరికృష్ణను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సారథులతోపాటు, వారితో గొంతు కలిపే కళాబృందం లోని సభ్యులకు కూడా ఆర్థికసాయం చేస్తామన్నారు. ’మీ సమస్యలు, ఇబ్బందులను సర్కారుకు వదిలేయండి. మిషన్‌ కాకతీయ, హరితహారం వంటి మంచి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం పెంచడంపై పూర్తి దృష్టి పెట్టండి’’ అని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. లంబాడ, గోండు, ఉర్దూ భాషల్లో కళారూపాలు ప్రదర్శించే బృందాలను తయారుచేయాలని చైౖర్మన్‌ బాలకిషన్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో పది జిల్లాల నుంచి వచ్చిన 550మంది సాంస్కృతిక సారథులతోపాటు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేశపతి శ్రీనివాస్‌ నిర్మాత రామకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
పుట్టింటికి వచ్చినట్టుంది!
2001లో తనతో ప్రారంభమైన ఉద్యమంలోకి కళాకారులు అడుగుపెట్టిన తర్వాతే అందరి ఉద్యమంగా మారిందన్నారు. ‘జయజయహే...’ గీతాన్ని అందెశ్రీ రచించినా చాలావరకు నేను మార్చి రాశాను. సుద్దాల రాసిన ‘ఇది తెలంగాణ’ పాటలో కూడా కొద్దిభాగాన్ని రాశాను. ‘గుంటూరులో గుంట స్థలం..’అనే పాట స్వయంగా రాశాను. అప్పట్లో బాత్‌రూమ్‌లో గడ్డంగీస్తూ కూడా పాటలు రాశాను. తెలంగాణ వచ్చిన తర్వాత సచివాలయంలోనే సరిపోతున్నది. అందువల్ల ఈ సమ్మేళనానికి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా ఉంద’’ని సంతోషం వ్యక్తం చేశారు.
 
రసమయి మంత్రి అవుతాడు : కేసీఆర్‌
సమ్మేళనంలో రసమయి బాలకిషన్‌ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ‘‘ఉద్యమంలో ఎంతోకష్టపడిన కళాకారులు నేడు చాక్లెట్‌ కంపెనీల్లో, చేలల్లో కూలీలుగా బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వమిచ్చిన (ఉద్యోగ) నియామక పత్రాల్లో వారికి అన్నం మెతుకులు కనిపిస్తున్నాయి’’ అని కేసీఆర్‌ సమక్షంలో కంటతడి పెట్టారు. దీనిపై కేసీఆర్‌ కూడా ఒకింత ఆవేదనకు గురయ్యారు. ‘‘కళాకారుల బాధలపై ఏడ్వాలని నాకూ ఉన్నా ఆపుకుంటున్నాను. రసమయి త్వరలోనే కేబినెట్‌ మంత్రి పదవి నిర్వహిస్తారు. సాంస్కృతిక శాఖ ఆయన చేతిలోనే ఉంటుంద’’న్నారు.
 
విస్తరి ముందు గంటపాటు నిరీక్షణ!
సమ్మేళనానికి సీఎం కేసీఆర్‌ మూడు గంటలు ఆలస్యంగా వచ్చారు. కళాకారులతో కలిసి సీఎం కేసీఆర్‌ భోజనం చేసేవిధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ వస్తున్నారంటూ.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కళాకారులకు విస్తర్లు వేశారు. అయితే.. ఆ తరువాత గంటకు గానీ ఆయన రాలేదు. ఈ గంటసేపూ కళాకారులు వట్టినే విస్తరి ఆకు ముందు కూర్చోవాల్సి వచ్చింది. భోజనం విషయంలోనే కాదు.. గుక్కెడు మంచినీళ్లకూ కళాకారులు ఇబ్బంది పడినట్టు చెబుతున్నారు.
 
నేనున్నా లేకున్నా..: సీఎం
‘నేను ఉన్నా లేకున్నా తెలంగాణలో ఉండేది మీరే’ అని సీఎం కేసీఆర్‌ అనడంతో.. ’సారథి’ సమ్మేళనంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ’’సార్‌.. మీరు అలా మాట్లాడొద్దు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి’’ అని ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. దీన్ని పట్టించుకోకుండా చేతితోరమణాచారిని కూర్చోమని సైగ చేస్తూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకుముందు....ఆయన మాదాపూర్‌ ఆర్ట్‌గ్యాలరీలో జరిగిన సాంస్కృతిక సారథుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒకరకమైన నిర్వేదాన్ని ప్రకటించారు. ‘‘ఇప్పుడు నాకు 61ఏళ్ల వయస్సు. నాకు వేరే కోరికలు ఏమీ లేవు. నా జీవితకాలపు కోరిక ప్రత్యేక తెలంగాణ. అది నెరవేరింది. నేను బతికున్నంత కాలం తెలంగాణ కోసం పోరాడాను. పోరాడిన నువ్వు ఎటు పోతావని ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కట్టేశారు. నేను ఉన్నా లేకున్నా తెలంగాణలో ఉండేవారు మీరే’’ అని కేసీఆర్‌ అన్నారు. 
 
  • తెలంగాణకు హారతి.. కళాభారతి! 
  • డిజైన్‌కు సీఎం కేసీఆర్‌ ఆమోదం
తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ప్రతిబింబంగా, హైదరాబాద్‌లో తెలంగాణ కళాభారతి భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న 14 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఇప్పటికే కేటాయించింది. త్వరలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి... ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ తయారు చేసిన భవన నిర్మాణ నమూనాకు సీఎం ఆదివారం ఆమోదం తెలిపారు. 125125 చదరపు మీటర్ల వైశాల్యంలో లక్షా ఇరవై ఐదువేల చదరపు అడుగుల మేర కళాభారతి భవనాన్ని నిర్మించనున్నారు.

No comments:

Post a Comment